పద్యం శాశ్వతంగా నిలుస్తుంది

పద్య ప్రభంజనం జాతీయ కావ్యం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలుగుయూనివర్సిటీ, జనవరి 24 (హైదరాబాద్) : తెలుగు ప్రజల సొత్తు పద్యం అజరామరంగా నిలుస్తుందని శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని ఆబిడ్స్ తిలక్‌రోడ్డు బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్తులో మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో దేశభక్తి ఇతివృత్తంతో వెలువడిన పద్య ప్రభంజనం సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం ఘనంగా జరిగింది. మెతుకుసీమ అధ్యక్షుడు పూసల లింగాగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత పద్య ప్రభంజనం సంకలనాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కరోనా కాలంలో భౌతికంగా కలిసి కార్యక్రమాలు జరుగక చాలా రోజులు అయిందని, నేటి సభ ద్వారా సాహితీవేత్తలను కలిసే అవకాశం రావడం హర్షించదగిన విషయమని అన్నారు. ప్రతి పద్యంలో దేశభక్తి ప్రధానంగా ఉన్న ఈ కావ్యం పాఠకుల్లో జాతీయ భావాలు పెంపొదిస్తుందని తెలిపారు. పద్యానికి ప్రాణం పోసేలా 610 మంది కవులు అద్భుతమైన పద్యాలు రాశారని ప్రశంసించారు. తెలుగు పద్యాల్లోని మాధుర్యం, ఆనందం పంచేలా ఈ పద్యాలు ఉన్నాయన్నారు. పద్య కవిత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలను ఎవరైనా వేలెత్తి చూపిస్తే సహించే వారు కాదని అన్నారు. గోల్కొండ పత్రిక వచ్చిన నేపథ్యాన్ని వివరించారు. 1966లోనే వానమామలై వరదాచార్యులు ఖండకావ్యం రాశారన్నారు. జాతీయ కావ్యంగా ఆమె అభివర్ణించారు. జాతీయతను ప్రజల ఆత్మగా చెప్పారు. సాహిత్యప్రక్రియల ద్వారా కవులు జాతి నిర్మాణంలో పాత్ర పోషించాలని సూచించారు. అస్తిత్వం కాపాడుకుంటూనే జాతి నిర్మాణానికి, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు సాగాలని అన్నారు. ఆధునికతకు అనుగుణంగా పద్యరచనలు కొనసాగాలని కోరారు. శాశ్వతమైన పద్య ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అఖిల భారత సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశ కాలపరిస్థితులకు అనుగుణంగా వచ్చిన క్రియాత్మక గ్రంథంగా వర్ణించారు. ప్రజల్లో దేశభక్తి ప్రేరేపిత గ్రంథం అన్నారు. కవిత్వం వెనుక ఉన్న పరమార్థాన్ని చాటిందన్నారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు పద్యం వెయ్యేండ్లనాటిదని అన్నారు. పద్యం అజరామరమైనదిగా వివరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాహిత్య పిపాసి కాబట్టే కవులు, సాహితీవేత్తలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. దేశభక్తి ఇతివృత్తంగా వచ్చిన ఈ పద్య సంకలనం ప్రతిష్టాత్మకమైనదిగా అభివర్ణించారు. వివిధ సామాజిక అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలపై పలువురు కవులు గొప్ప పద్యాలను రాశారని గుర్తు చేశారు. పద్యకవులకు పట్టాభిషేకం చేసేలా భాషా సాంస్కృతిక శాఖ కృషి చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యం నిగుఢీకృతం అయిందన్నారు. పద్యప్రక్రియ సాహిత్యానికి మణిమకుటం అన్నారు. పద్యాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చుకుని కొత్త పుంతలు తొక్కించాలని ఆకాంక్షించారు. గ్రంథ సమీక్ష గండ్ర లక్ష్మణరావు, జి.ఎం రామశర్మ, డాక్టర్ ఎస్.రఘు తదితరులు పాల్గొన్నారు.