శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 25, 2021 , 00:03:28

మహాకిక్కు

మహాకిక్కు

వక్రమార్గంలో 180 ఎంఎల్‌!

విచ్చలవిడిగా దేశీదారు విక్రయాలు

చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ అధికారులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి

బోధన్‌, జుక్కల్‌ నియోజకవర్గాల్లో భారీగా మహారాష్ట్ర చీప్‌లిక్కర్‌

చెక్‌పోస్టులు ఉన్నా నియంత్రణ కరువు

నామమాత్రపు దాడులతో సరి

తెరవెనుక పలువురు ఎక్సైజ్‌ అధికారుల పాత్ర ఉన్నట్లు నిఘావర్గాల అనుమానం

నిజామాబాద్‌, జనవరి 22 నమస్తే తెలంగాణ ప్రతినిధి)

ఆబ్కారీశాఖ అధికారుల తీరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. అక్రమార్కులతో చేతులు కలపడంతో సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. మహారాష్ట్ర నుంచి దేశీదారు ఇబ్బడి ముబ్బడిగా డంప్‌ అవుతోంది. దొంగమార్గాల్లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోకి తరలిస్తున్నారు. అయినా ఎక్సైజ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలో విక్రయించాల్సిన పన్ను చెల్లింపు మద్యానికి గిరాకీ తగ్గుతోంది. పొరుగు రాష్ర్టానికి చెందిన మద్యమే అధికంగా అమ్ముడవుతోంది. ఈ వ్యవహారంపై ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బోధన్‌ నియోజకవర్గంలో ఈ తరహా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. దీని వెనుక ఎక్సైజ్‌ శాఖకు చెందిన కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన దేశీదారు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోనూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

సరిహద్దులో అక్రమదందా..

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించారు. ఈ సమయంలో మద్యం దుకాణాలను సైతం రాష్ట్ర సర్కారు మూసేసింది. మూడు నెలల తర్వాత తెరిచేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో పలు మద్యం బాటిళ్లపై ధరలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. చీప్‌లిక్కర్‌ ధర రూ.95కు చేరింది. దీంతో సరిహద్దులో అక్రమదందా రెండింతలైంది. మహారాష్ట్రలో 180 ఎంఎల్‌ బాటిల్‌ చీప్‌లిక్కర్‌ ధర రూ.60కి విక్రయిస్తున్నారు. దీంతో అక్కడ తయారయ్యే దేశీదారు బాటిళ్లను దొంగచాటున ఇక్కడికి తీసుకొచ్చి రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభించే దేశీదారు కోసం మద్యం ప్రియులు ఎగబడుతున్నారు. మధ్యవర్తులు, బెల్టుషాపుల నిర్వాహకులతో స్థానిక ఎక్సైజ్‌శాఖ అధికారుల మామూళ్ల సంబంధాల నేపథ్యంలో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని చీప్‌లిక్కర్‌ గిరాకీ తగ్గి.. మహారాష్ట్ర దేశీదారుకు డిమాండ్‌ పెరిగింది. బోధన్‌, జుక్కల్‌ నియోజకవర్గాల్లో దేశీదారు అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎక్సైజ్‌ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో బహిరంగంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. 

చేతులెత్తేసిన ఆబ్కారీశాఖ

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని సాలూరా చెక్‌పోస్టులో ఎక్సైజ్‌శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాల్సి ఉండగా అక్కడ నిఘా గాలికి వదిలేశారు. అలాంటి దుస్థితే కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నెలకొంది. ఇక్కడ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన వారంతా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జాతీయ మార్గం గుండానే పట్టపగలే చీప్‌ లిక్కర్‌ బాటిళ్లు యథేచ్ఛగా రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. కొంత మంది బ్రోకర్లు ఏకంగా మంజీరా నది లోయ గుండా రాత్రి వేళలో భారీగా మద్యాన్ని డంప్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక పోలీసులకు సైతం ఈ వ్యవహారంపై సమాచారం ఉన్నప్పటికీ అంతగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం వచ్చినప్పుడు పైపై దాడులు చేసి దేశీదారు నిల్వలను పట్టుకుంటున్నప్పటికీ అసలు వక్రమార్గంలో రాష్ట్రంలోకి వస్తున్న మద్యానికి అడ్డుకట్ట వేసే చర్యలకు ఆబ్కారీ ఉన్నతాధికారులు పూనుకోకపోవడం విడ్డూరంగా ఉంది. బోధన్‌ మండలం సాలూరా, రెంజల్‌ మండలం కందకుర్తి, నవీపేట మండలం యంచ సరిహద్దు ప్రాంతాల నుంచి దేశీదారు భారీగా నిజామాబాద్‌ జిల్లాలో డంప్‌ అవుతోంది. కామారెడ్డి జిల్లాలో మద్నూర్‌, జుక్కల్‌ మండలం సోపూర్‌ మీదుగా మంజీరా నది ద్వారా అక్రమార్కులు సంచుల్లో సీసాలను తీసుకొస్తున్నారు. 

పాత నేరస్తులను బైండోవర్‌ చేస్తున్నాం..

దేశీదారును నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దులో నిఘా పెంచుతున్నాం. పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్‌ చేశాం. ఈ అక్రమ వ్యాపారానికి అలవాటు పడిన వారంతా కొత్త వారితో మద్యాన్ని డంప్‌ చేయిస్తున్నారు. అలాంటి వారిని కూడా పట్టుకొని కేసులు పెడుతున్నాం. మహారాష్ట్ర నుంచి మద్యాన్ని రాష్ర్టానికి తరలించినా... కొనుగోలు చేసినా తప్పే. సమాచారం ఇస్తే దాడులు చేసి చర్యలు తీసుకుంటాం.

- డేవిడ్‌ రవికాంత్‌, డిప్యూటీ కమిషనర్‌, ఎక్సైజ్‌ శాఖ (ఉమ్మడి జిల్లా)

ప్రభుత్వ ఆదాయానికి గండి

ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. నిఘా వైఫల్యం, స్థానికంగా మధ్యవర్తులతో కొంత మంది ఎక్సైజ్‌ అధికారు లు చేతులు కలపడంతో అక్రమదందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ర్టానికి చెందిన మద్యం రాష్ట్రంలో చొచ్చుకొస్తుండడంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. దేశీదారు బాటిళ్లు తయారీ, అమ్మకాలు, పన్ను చెల్లింపులన్నీ మహారాష్ట్ర సర్కారు నియంత్రణలోకి వస్తుంటాయి. ఆ ప్రాంతంలో రూ.60కి ఒక్కో బాటిల్‌ను కొనుగోలు చేసి తీసుకురావడం ద్వారా సదరు రాష్ర్టానికే ఆదాయం పోతోంది. రాష్ట్రంలో అమ్ముడవ్వాల్సిన చీప్‌ లిక్కర్‌కు డిమాండ్‌ తగ్గుతుండడంతో అమ్మకాలు నిలిచిపోతున్నాయి. సర్కారుకు రావాల్సిన పన్నుకు ఆటోమెటిక్‌గా భారీగా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా మొద్దు నిద్రలో ఉండడం అనేక విమర్శలకు తావిస్తోంది. 

VIDEOS

logo