శనివారం 27 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 24, 2021 , 00:43:32

పసుపు రైతు ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి

పసుపు రైతు ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి

బోర్డు కన్నా మెరుగైనదే తెచ్చానంటూ ఎంపీ అర్వింద్‌ ప్రగల్భాలు

ముఖాముఖి సమావేశంలో ఎంపీ అర్వింద్‌కు పసుపు రైతులు పలు ప్రశ్నలను సంధించారు. సుమారుగా మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో రైతులు అడిగిన చాలా ప్రశ్నలకు అర్వింద్‌ ఒకే సమాధానం చెబుతూ వచ్చారు. పసుపు బోర్డు, మద్దతు ధర రెండే అంశాలతో మీటింగ్‌కు వచ్చిన రైతులంతా ఎంపీని నిలదీశారు. బోర్డు కన్నా మిన్నగా స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ తెచ్చానంటూ సమాధానం ఇచ్చారు. సంతృప్తి చెందని రైతులు ఎన్నికలప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించగా.. ఎంపీ నుంచి సమాధానం లేకుండా పోయింది. ముఖాముఖి సమావేశంలో ఎంపీ అర్వింద్‌కు రైతులకు మధ్య జరిగిన సంవాదం ఇలా.. 

గుర్జాల నర్సయ్య (శెట్పల్లి) : 

సారూ... పసుపు రైతుకు నష్టం కలిగిస్తున్నది ఈనామ్‌. దానిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

అర్వింద్‌: దానితో నష్టమేమున్నది. నామ్‌తో ఎక్కడి నుంచో వ్యాపారి వచ్చి పోటీ పడి ఎక్కువ ధర ఇవ్వొచ్చు కదా.

గుర్జాల నర్సయ్య : పసుపు రైతుల కోసం మీ కృషితో వస్తున్న జీవోలు ఇక్కడ చూపిస్తున్నరు కదా. అలాగే ఆన్‌లైన్‌లో పసుపు ట్రేడింగ్‌ను తీసేయించానని చెప్పారు కదా. దాని జీవోను చూపించండి. నమ్ముతాము.

అర్వింద్‌ : ఇప్పుడు అది లేదు. ఢిల్లీలో ఉంది. ఈసారి వెళ్లినప్పుడు తెస్తా.

గుర్జాల నర్సయ్య: కేంద్రమే మద్దతు ధర ప్రకటించవచ్చు కదా.

అర్వింద్‌: అలా చేయలేము. మేము తెలంగాణలో మద్దతు ధర ఓ పది వేలు ప్రకటించామే అనుకో.. ఆంధ్రాలో భగ్గుమంటది.

నవీన్‌ (కమ్మర్‌పల్లి): మీరు బాండ్‌ రాసిచ్చిన పేపర్‌లో మద్దతు ధర, బోర్డు రెండూ ఉన్నయి. అవి తేకపోతే రాజీనామా చేస్తానన్నవు. పసుపు ధర మార్కెట్ల 4200 ఉంది. మీరు నిజమైన రైతు అయితే మీకు పెట్టుబడి నిండుతదా..? మార్కెట్‌కు పోదాం. మీకు నిండితే నాకు నిండినట్లే సార్‌.

అర్వింద్‌ : ...... (సమాధానం లేదు. మౌనం వహిస్తూ... తలూపుతూ రైతు చెప్పిన మాటలు వింటున్నట్లుగా సంజ్ఞ)

ప్రతాప్‌ (చౌట్‌పల్లి): మీరు పసుపు బోర్డు ఐదురోజుల్లో తెస్తానని చెప్పలేదంటున్నరు గదా. ఇగో గీ వీడియో వినుండ్రి. ఈ మాటలు మీవేకదా. ఇప్పుడేమంటరు.. రాజీనామా చేస్త్తరా? పసుపు బోర్డు తీసుకువస్తరా?

అర్వింద్‌: నేను పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.

చౌట్‌పల్లికి చెందిన మరో రైతు : సార్‌... గవన్నీ కాదు. పసుపు బోర్డు, మద్దతు ధర ఎప్పుటిలోపు తెస్తరో కరెక్టుగా చెప్పండి. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు.

అర్వింద్‌ : మద్దతు ధర విషయమై రాష్ట్రప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాయాలి. సీఎం లెటర్‌ ఇస్తే వెంటనే మద్దతు ధర అంశానికి సమాధానం దొరుకుతది. స్టేట్‌ గవర్నమెంటు లెటర్‌ ఇవ్వమంటే ఇస్తలేదు.

శ్రీనివాస్‌రెడ్డి, పసుపు రైతు : ఎన్నికలప్పుడు రాసిచ్చింది పసుపు బోర్డే కదా. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ అని అప్పుడే చెప్పేదుండె. రాజీనామా చేయుండ్రి. లేదంటే పసుపు బోర్డు తీసుకురండ్రి.

అర్వింద్‌ : మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు.

బద్దం అరుణ్‌ (మెండోరా) : బోర్డు తేవడంలో విఫలమైతే రాజీనామా చేస్తామన్నరు కదా?

అర్వింద్‌: పసుపు బోర్డు కన్నా మెరుగైన వ్యవస్థను కేవలం ఆరు నెలల్లోనే తెచ్చాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈ విధంగా ఆరునెలల్లోనే పూర్తిచేశాను. మద్దతు ధర విషయంలో రాష్ట్రప్రభుత్వం లేఖ ఇవ్వడం లేదు.

బద్దం అరుణ్‌ : పసుపు బోర్డుకన్నా మెరుగైన వ్యవస్థ. అదే దాన్నే స్పైసిస్‌ బోర్డు ఆఫీసు అంటారు కదా. అది బోర్డు కన్నా మెరుగైనదైతే రైతులకు లాభాలు రావడం లేదేంటి ?ఈ సారి మద్దతు ధర ఆశతో పసుపు పంట వేస్తే నాకు రూ.5 లక్షలు నష్టమొచ్చింది. ఆ నష్టాన్ని నాకు ఎవరిస్తారు..నేను పంట సాగు చేస్తున్నది నా కోసం మాత్రమే కాదు. మీ కోసం, దేశం కోసం..

అర్వింద్‌ : సమాధానం కరువు.

మంథెన నవీన్‌, పసుపు రైతు : అప్పుడు బోర్డు అన్నారు. ఇప్పుడు స్పైసిస్‌ బోర్డు ఏమిటి ? హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానన్నారు. బాండ్‌ పేపర్‌ మీద రాసి ఇచ్చారు. ఇంత వరకు హామీలు నెరవేర లేదు. ఇలా అయితే మా రైతుల సెగ తగులుతుంది.

అర్వింద్‌ : నేను స్పైసెస్‌ బోర్డ్‌ రీజినల్‌ ఆఫీసు తేకంటే ముందు మూడేండ్లు రాష్ర్టానికి వచ్చిన నిధులు కేవలం రూ.మూడు కోట్ల లోపే. కానీ నేను స్పైసిస్‌ బోర్డు రీజినల్‌ ఆఫీసు తెచ్చాక రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నాము. అందుకే బోర్డు కన్నా బెటర్‌ వ్యవస్థ తెచ్చి నేను ఇచ్చిన హామీని ఆరు నెలల్లోనే నెరవేర్చా.

రాజేశ్వర్‌ రెడ్డి, (మల్లాపూర్‌-జగిత్యాల జిల్లా) : షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు న్యాయంచేస్తా అని ఎన్నికల్లో అన్నారు. లేదంటే కొత్త షుగర్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా అన్నారు కదా?

అర్వింద్‌ : అన్న మాట నిజమే. కోర్టు వ్యవహారం ఉండడంతో ఏం చేయలేక పోతున్నా.

రాజేశ్వర్‌ రెడ్డి : అప్పుడు ఇవన్నీ చెప్పలేదు కదా?

అర్వింద్‌ : ...... (సమాధానం లేదు)


సంజీవ్‌ (మోతె) : సార్‌ నాది ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం మోతె. మా నాన్న గల్ఫ్‌ కార్మికుడు. నా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్న. పసుపునకు మద్దతు ధర ఇస్తామని మీరు చెప్పడంతో ఈ సారి పసుపు సాగుచేసిన. నాకు 10 వేల మద్దతు ధర కావాలె. అది ఇప్పుడే ఇక్కడే చెప్పాలె సార్‌. మీకు దండంబెడుతా సార్‌.

అర్వింద్‌ : నీవు అడిగింది నిజం. మద్దతు ధర కోసం రాష్ట్రం లెటర్‌ ఇస్తలేదు. గదాని కోసమే కృషిచేస్తున్న.

విక్రమ్‌ రెడ్డి (జగిత్యాల) : జాతీయ పంటల మద్దతు ధరల్లో పక్కరాష్ట్రంతో పోలిస్తే తేడా ఉంటే తప్పేంటి. మనకు ధర ఎక్కువ వస్తే మీకొచ్చే సమస్యేంటి?

అర్వింద్‌ : అప్పుడు ఏపీలో లొల్లి చాలైతది.

మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో ఓవైపు రైతుల ప్రశ్నలు కొనసాగుతుండగానే.. ‘భారత్‌ మాతాకీ జై..’ అంటూ అర్వింద్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ‘అర్వింద్‌ డౌన్‌ డౌన్‌..’, ‘పసుపు బోర్డు తీసుకురాని ఎంపీ రాజీనామా చేయాలి’ అంటూ రైతులు నినాదాలు చేశారు.


VIDEOS

logo