శుక్రవారం 05 మార్చి 2021
Nizamabad - Jan 24, 2021 , 00:43:31

అర్వింద్‌ ఆగమాగం

అర్వింద్‌ ఆగమాగం

నిలదీసిన పసుపు రైతులు.. నీళ్లు నమిలిన ఎంపీ 

రాజీనామాకు గడువు పది రోజులు

చౌట్‌పల్లిలో రైతులతో ముఖాముఖి

ఎంపీపై ప్రశ్నల వర్షం

పసుపు బోర్డు తెస్తవా.. రాజీనామా చేస్తవా?

ఆగ్రహంతో అన్నదాతల ఆక్రోశం

సమాధానం దాటవేత ధోరణిపై రైతుల మండిపాటు

అర్ధంతరంగా వెళ్లిపోయిన అర్వింద్‌

ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక

నిరాహార దీక్షలకు రైతులుసై 

నిజామాబాద్‌, జనవరి 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కమ్మర్‌పల్లి :

పసుపు బోర్డుపై మాటమార్చిన ఎంపీ అర్వింద్‌పై రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీకి అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. 2019 సాధారణ ఎన్నికల్లో పసుపు బోర్డు, పసుపు పంటకు కనీస మద్దతు ధర ఇప్పిస్తానంటూ హామీలు ఇచ్చిన అర్వింద్‌.. శనివారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో రైతుల సమక్షంలోనే తానలాంటి హామీనే ఇవ్వలేదంటూ మరోసారి మాటమార్చారు. తమ సమక్షంలోనే అబద్ధాలాడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నువ్వు ఇచ్చిన హామీలు ఇవిగో..’ అంటూ వీడియో క్లిప్పింగులను చూపిస్తూ.. ఎంపీకి ముచ్చెమటలు పట్టించారు. పసుపు బోర్డు, పసుపు పంటకు కనీస మద్దతు ధర అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ రైతులు నినాదాలు చేయడంతో ఎంపీ అర్వింద్‌ నీళ్లు నమలాల్సి వచ్చింది. పదిరోజుల గడువు ఇస్తున్నామని, రాజీనామా చేస్తారో.. మద్దతు ధర తెస్తారో తేల్చుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. స్పష్ట ప్రకటన చేసిన తర్వాతే సమావేశం నుంచి కాలుబయట పెట్టాలనడంతో ఎంపీకి ఏమీ తోచక అయోమయానికి గురయ్యారు. రైతుల నినాదాలు కొనసాగడంతో కార్యక్రమం రసాభాసగా మారింది. దీంతో మధ్యలోనే ఎంపీ అక్కడినుంచి వెళ్లిపోయారు. 

ఎంపీ అర్వింద్‌కు పది రోజుల గడువు..

పసుపు రైతుల సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించిన ఎంపీ అర్వింద్‌ తీరుపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. తానిచ్చిన హామీలపై ఎలాంటి ప్రకటన చేయకుండా సమావేశం నుంచి వెళ్లిపోయిన ఎంపీకి రైతులు అల్టిమేటం జారీ చేశారు. పది రోజుల్లో ఎంపీ పదవికి అర్వింద్‌ రాజీనామా చేయాలని లేదంటే పసుపు రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ఖాయమని రైతు కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ప్రాంతాలకు చెందిన పసుపు రైతులతో మరోమారు భేటీకానున్నామని, ఐక్యకార్యాచరణ సమితి నాయకత్వంలో తదుపరి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లుగా నేతలు వెల్లడించారు. 

అడుగడుగునా నిలదీతలు

చౌట్‌పల్లిలో రైతు ఐక్యవేదిక నిర్వహించిన పసుపు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ ఆపసోపాలు పడ్డారు. సమావేశానికి బాల్కొండ, ఆర్మూర్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంత రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచే పరిసర ప్రాంతాలకు చెందని టీఆర్‌ఎస్‌ నేతలు, రైతునాయకులు పలువురిని పోలీసులు హౌస్‌అరెస్టు చేశారు. సమావేశం ప్రారంభంలో ఎంపీని సాదరంగా మీటింగ్‌ హాలులోకి రైతులు ఆహ్వానించారు. బీజేపీ కార్యకర్తలెవరూ ఇక్కడ ఉండొద్దంటూ నిర్వాహకులు ఎంపీ అనుచరులను బయటికి పంపేశారు. సమావేశ ప్రారంభంలో తొలుత రైతులు మాట్లాడాలని, వారు అభిప్రాయాలు చెప్పిన తర్వాత తాను మాట్లాడతానని అర్వింద్‌ పేర్కొన్నారు. మైకు పట్టుకున్న ప్రతి రైతు పసుపు బోర్డు, కనీస మద్దతు ధర ఎప్పటిలోగా తెస్తారో చెప్పాలంటూ అర్వింద్‌ను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనే పసుపు రైతులు పట్టు విడవకుండా ప్రశ్నిస్తుండడంతో ఎంపీ పలుమార్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. అనంతరం మాట్లాడిన అర్వింద్‌.. నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు బదులుగా స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేశామని, దాని ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యాలు మెరుగవుతున్నాయని వివరించే ప్రయత్నం చేశారు. రైతులు మాత్రం ఎంపీ చెప్పిన మాటలను పట్టించుకోలేదు. తానిచ్చిన హామీల పైనే ప్రధానంగా చర్చకు పట్టుపట్టారు. తానెక్కడా పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇవ్వలేదని అర్వింద్‌ అనడంతో సమావేశంలో కలకలం మొదలైంది. ఆగ్రహించిన రైతులు ఎంపీ వద్దకు దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. చౌట్‌పల్లికి చెందిన కుంట ప్రతాప్‌ అనే రైతు ముందుకొచ్చి.. ఎన్నికల ప్రచారంలో అర్వింద్‌ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగును ఫోన్లో సభికులకు చూపించారు. అందులో ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానంటూ ధర్మపురి అర్వింద్‌ అన్నట్లుగా స్పష్టంగా ఉంది. రూ.15వేలు కనీస మద్దతు ధర కల్పిస్తానని తాను హామీ ఇవ్వలేదంటూ మరోమారు అర్వింద్‌ తప్పించుకునే ప్రయత్నంచేశారు. మరికొందరు రైతులు బాండ్‌ పేపర్‌ ప్రతులను చూపించారు. మంచి ధర కల్పిస్తానంటే అర్థమేమిటని ఎంపీని నిలదీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాకపోతే తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ రైతులు పట్టుబట్టారు. రాజీనామా చేసి.. రైతుల ఉద్యమానికి మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. కర్షకులంతా మూకుమ్మడిగా నినాదాలు చేయడంతో ఎంపీ ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘నేను చేసింది చెప్పాను.. ఇక మీ ఇష్టం..’ అంటూ అర్వింద్‌ బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డితో కలిసి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయన కార్యక్రమం నుంచి వెళ్లిపోతుండగా ‘డౌన్‌ డౌన్‌ అర్వింద్‌' అంటూ రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

యూటర్న్‌ తీసుకున్నారా 

ఎంపీ గారు ఎన్నికల్లో మీరు పసు పు బోర్డు తెస్తానని హామీ ఇచ్చా రు. ఇప్పుడేమో రీజినల్‌ ఆఫీస్‌ అంటున్నారు. మేము కోరుకునేది ఆ ఆఫీసు కాదని పదే పదే చెబుతున్నా మీరు రీజినల్‌ ఆఫీసు అంటున్నారు. మీరు పసుపు బోర్డు ఆఫీసు హామీపై యూ టర్న్‌ తీసుకున్నారా. మీ హామీలు, రాం మాధవ్‌ హామీ ఉత్తదేనా ?

-సుంకెట రవి, రైతు, కమ్మర్‌పల్లి

రాజీనామా చేయాలి 

రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన విధంగా హామీలను ఎంపీ అర్వింద్‌ నెరవేర్చాలి. లేదా రాజీనామా చేయాలి. బాండ్‌ పేపర్‌లో ఇచ్చిన హామీలు ఎంపీ మర్చిపోయినా రైతులు మరువలేరు.

-శ్రీనివాస్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల జిల్లా

అడుగడుగునా అడ్డుకుంటాం

ఎన్నికల వేళ ఓట్ల కోసం హామీ ఇచ్చి గెలిచాక తికమక మాటలు మాట్లాడడం సరి కాదు. అర్వింద్‌  రాజీనామా చేసి రైతులతో కలిసి రావాలి. లేదా అడుగడుగునా అడ్డుకుంటాం.

-లింబాద్రి, నర్సాపూర్‌ 

తిరుపతన్నా.. ఎంపీ గట్లంటున్నరేందె ?

కమ్మర్‌పల్లి, జనవరి 23 : శనివారం చౌట్‌పల్లిలో ఎంపీ అర్వింద్‌తో జరిగిన ముఖాముఖి సందర్భంగా జగిత్యాల జిల్లా రైతు తిరుపతి రెడ్డిని ఎంపీ అర్వింద్‌ పలు ప్రశ్నలు వేసిన సందర్భంగా రైతుల్లో ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. రీజినల్‌ ఆఫీస్‌ పసుపు బోర్డుకన్నా బెటర్‌ అని చెబుతూ ఎంపీ వంశీ హోటల్లో స్పైసిస్‌ బోర్డు అధికారులు వచ్చినప్పుడు ఐదుగురు, హైదరాబాద్‌లో, కమ్మర్‌పల్లిలో బోర్డుపై చర్చ జరిగినప్పుడు మీరు చెప్పినట్లే కదా అధికారులు అభిప్రాయాలు తీసుకున్నది తిరుపతన్నా అంటూ పలు మార్లు అడిగారు. దీంతో పసుపు బోర్డు వద్దు. రీజినల్‌ ఆఫీస్‌కు ఓకే అనే అభిప్రాయాలు అందించారా అనే చర్చ రైతుల్లో జరుగుతోంది.

మద్దతు ధర కోసం నిరాహార దీక్షలు

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన రైతులు అక్కడికక్కడే భవిష్యత్‌ కార్యాచరణ కోసం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ముఖా ముఖిలో అర్వింద్‌ నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. మా నిర్ణయం వినకుండానే వెళ్లిపోయిన అర్వింద్‌ పది రోజుల్లో మద్దతు ధర తేవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాజీనామా చేసి తమతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. లేదంటే అర్వింద్‌ ఇంటిని ముట్టడిస్తామన్నారు. మద్దతు ధర సాధనకు నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు.

VIDEOS

logo