శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 23, 2021 , 00:37:04

బడికి చలో.. చలో..

బడికి చలో.. చలో..

  • ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల ప్రారంభం
  • 9, 10, ఇంటర్‌, డిగ్రీ తరగతుల నిర్వహణ
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ 
  • బడుల శానిటైజ్‌కు ఆదేశాలు

పాఠశాలలు పునఃప్రారంభానికి ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా పది నెలలుగా మూసి ఉన్న బడులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం అనుమతించింది. పాఠశాలలతోపాటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలను తెరువనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తరగతి గదుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. దీంతోపాటు మూత్రశాలలు, పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. 

ఇందూరు, జనవరి 22 :కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడం, దీనితోడు టీకా అందుబాటులోకి రావడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం సమ్మతించింది. కరోనా భయంతో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఇందులో భాగంగా పాఠశాలలు సైతం మూసి ఉంచారు. పది నెలల తర్వాత బడులు తెరుచుకుంటున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు నిర్వహించనున్నారు. కొన్ని నెలలుగా ఉపాధ్యాయులు మాత్రమే బడులకు వెళ్తున్నారు. ఆన్‌లైన్‌ తరగతులను పర్యవేక్షిస్తున్నారు. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించారు.  

పదో తరగతి విద్యార్థులు 47,800 మంది

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కేజీబీవీ, మోడల్‌ పాఠశాలలు 620 ఉన్నాయి. వీటిలో 9వ తరగతి విద్యార్థులు 23,600, 10వ తరగతి విద్యార్థులు 24,200 మంది ఉన్నారు. 96 ఇంటర్మీడియెట్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు 18,371, రెండో సంవత్సరం విద్యార్థులు 19,423 మంది, మొత్తం 37,794 మంది ఉన్నారు. 

తరగతులు సిద్ధం

9 నుంచి డిగ్రీ వరకు తరగతి గదులను సిద్ధం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. తరగతి గ దులను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో పిచికారీ చేస్తున్నారు. మూత్రశాలలను శుభ్రం చేస్తున్నారు. పరిసరాలను శుభ్రం చేసి తరగతుల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. నాలుగైదు రోజులపాటు గదులను నీటితో కడిగారు. తరగతుల నిర్వహణకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నారు. 

తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి

విద్యార్థులను పాఠశాలకు పంపించాలంటే తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించి వారి సమ్మతి తీసుకోవాలి. పత్రంలో విద్యార్థి వివరాలతోపాటు తల్లిదండ్రుల పేరు, మీడియం, అడ్మిషన్‌ నంబర్‌, అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ వంటివి సేకరించాలి. తమ పిల్లలకు కొవిడ్‌ సోకలేదని, ఇష్ట ప్రకారమే పాఠశాలకు పంపిస్తున్నామని సమ్మతి తెలుపాల్సి ఉంటుంది. సమ్మతి పత్రంపై సంతకం తప్పనిసరి.  

27 వరకు పూర్తి చేయాలి

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ లోపు పూర్తి చేయాలి. ఎంఈవోలు, కళాశాల ప్రిన్సిపాళ్లు, ఎంపీడీవోలతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించి ఆదేశాలు జారీ చేశాం. శానిటేషన్‌, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించాం. తాగునీరు ఇతర మెటీరియల్‌ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పాం. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. స్కూళ్లు, కళాశాలలు, హాస్టళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తయ్యాయి. పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందితో విద్యాసంస్థల్లో శానిటేషన్‌ చేయించాలి. నాలుగు రోజులపాటు వాటర్‌ వాష్‌ చేయాలి. ఈ నెల 27 నాటికి శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలి. 

-సి.నారాయణరెడ్డి, కలెక్టర్‌, నిజామాబాద్‌

VIDEOS

logo