శనివారం 27 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 22, 2021 , 01:25:35

మెరుగైన వసతులు మేలైన సేవలు

మెరుగైన వసతులు మేలైన సేవలు

  • అధునాతన సౌకర్యాలు, పరిశుభ్ర వాతావరణంలో సేవలు 
  • శుభ్రతకు పెద్దపీట వేసి కాయకల్ప అవార్డును సాధించి..
  • మరో అవార్డు సాధన దిశగా పరుగులు
  • కరోనా కాలంలోనూ రోగులకు మెరుగైన వైద్యసేవలు 

బోధన్‌, జనవరి 21: బోధన్‌ ఏరియా దవాఖాన జిల్లా కేంద్ర వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత.. రోగులకు సేవలు అందించడంలో ముందంజలో ఉంది. స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్న దవాఖాన, అదే స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ మంచి ఫలితాలను సాధిస్తున్నది. జాతీయ ఆరోగ్య మిషన్‌ మార్గదర్శకాలకు లోబడి ప్రమాణాలను సాధించి.. కాయకల్ప అవార్డుల జాబితాలో చోటు సంపాదించింది. మరోపక్క జిల్లా కేంద్ర దవాఖానలో ప్రసవాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రసూతి సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది రోజుకు 24 గంటల పాటు మెటర్నిటీ విభాగంలో సేవలు అందిస్తూ గర్భిణులు, బాలింతల మన్ననలు పొందుతున్నారు. గత ఏడాదిగా ప్రతి నెలా ప్రసవాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. సరాసరి ప్రతి నెలా 200 ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌ కిట్ల పంపిణీ, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు, స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రైవేట్‌ దవాఖానాలకు దీటుగా వైద్యసేవలు అందించే స్థాయికి దవాఖాన చేరుకున్నది. 

కాయకల్ప అవార్డుతో గుర్తింపు..

ప్రభుత్వ దవాఖాన ల్లో స్వచ్ఛతను పెంచేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రకటిస్తున్న కాయకల్ప అవార్డును బోధన్‌లోని జిల్లా కేంద్ర దవాఖాన సాధించింది. 2019-20 సంవత్సరానికి గాను జిల్లా కేంద్ర దవాఖానల విభాగంలో బోధన్‌ వైద్యశాల ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ అవార్డు కింద రూ.10 లక్షల ప్రోత్సాహకం రా నుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌజన్యంతో యూనిసెఫ్‌ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వ వైద్యశాలల్లో వివిధ అంశాల్లో మెరుగైన పురోగతిని సాధిస్తున్నందుకు ఈ అవార్డులను ప్రకటిస్తుంది. మొదటి ప్రయత్నంలోనే బోధన్‌ ప్రభుత్వ  దవాఖాన రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలవడం గమనార్హం. 

గణనీయంగా పెరిగిన ప్రసవాలు

బోధన్‌ దవాఖానలో గతంతో పోల్చితే.. ఈ ఏడాది ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ వైద్యశాలల ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా అందిస్తున్న సేవలతో సామాన్య, మధ్య తరగతి మహిళలు ప్రసవాల కోసం రావడం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్లు, ఆపరేషన్‌ థియేటర్లలో సకల సౌకర్యాలను కల్పించడం, గైనకాలజిస్టుల నియామకం, సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటుండడంతో బోధన్‌ జిల్లా కేంద్ర దవాఖాన ప్రసవాల్లో  మేటిగా నిలుస్తున్నది.  గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు 2167 గర్భిణులు ప్రసవాలు చేయించుకున్నారు. వీటిలో 866 సహజ ప్రసవాలు కాగా, 1301 మందికి సిజేరియన్లు జరిగాయి. మాతాశిశు మరణాలు లేకుండా ఇక్కడ వైద్య సేవలు అందాయి. 

‘లక్ష్య’ అవార్డు దిశగా.. 

కాయకల్ప అవార్డును సాధించిన బోధన్‌ జిల్లా కేంద్ర దవాఖాన త్వరలో ‘లక్ష్య’ అవార్డును సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతు న్నాయి. మాతా శిశు సంరక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ ‘లక్ష్య’ అవార్డును జాతీయ ఆరోగ్య మిషన్‌ ఇవ్వనుంది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం, సహజ ప్రసవాలు జరిగేలా చూడడం, మాతా, శిశు మరణాలను అరికట్టడం, ఆపరేషన్‌ థియేటర్లలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం తదితర అంశాల ఆధారంగా పురోగతి సాధించిన వైద్యశాలలకు ఈ అవార్డులను ఇస్తారు. ‘లక్ష్య’ అవార్డుల కోసం ఈ నెలలో రాష్ట్రస్థాయి బృందం పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర బృందం రానుంది. అవార్డు కోసం దవాఖాన వర్గాలు చేస్తున్న కృషి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవార్డు దక్కితే  మూడేండ్ల పాటు రూ.6 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం వస్తుంది. 

కొవిడ్‌లోనూ నిరంతరాయంగా వైద్య సేవలు..

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలోనూ బోధన్‌ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాయి. ఒకవైపు కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నప్పటికీ వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలను అందించడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఇన్‌పేషెంట్లుగా చేరిన 311 మంది కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందాయి. 

VIDEOS

logo