గురువారం 04 మార్చి 2021
Nizamabad - Jan 21, 2021 , 00:59:29

తెలుగుకు పట్టాభిషేకం

తెలుగుకు పట్టాభిషేకం

  • టీయూ నుంచి తెలుగులో డాక్టరేట్‌ పొందిన తొలి ముస్లిం విద్యార్థిని 
  • తెలుగులో యూనివర్సిటీ టాపర్‌గా గోల్డ్‌మెడల్‌
  • భాషాభివృద్ధికి పలు వ్యాసాలు 
  • సాహిత్య సేవకు గురజాడ పురస్కారం
  • భాషపై సయ్యద్‌ అఫ్రీన్‌ మమకారం

డిచ్‌పల్లి, జనవరి 20 :‘తేనెలొలుకు భాష తెలుగు భాష..’ అంటూ అమ్మభాష కమ్మదనాన్ని ఎందరో కవులు వర్ణించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సయ్యద్‌ అఫ్రీన్‌ బేగం తెలుగు సాహితీ రంగంలో రాణిస్తున్నారు. ఆంగ్లంపై మోజులో తెలుగును మరిచిపోతున్న ఈ రోజుల్లో ముస్లిం యువతి తెలుగులో పీహెచ్‌డీ చేయడం గర్వించదగిన విషయం. ముస్లిం కుటుంబంలో జన్మించి, సంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య పెరిగినా తెలుగుపై మమకారాన్ని పెంచుకున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. తెలుగులో సెట్‌, నెట్‌లలో అర్హత సాధించడం విశేషం. తెలుగు సాహితీ జగత్తులో మరో కలికితురాయిగా నిలుస్తున్నారు అఫ్రీన్‌.  

అఫ్రీన్‌ విద్యాభ్యాసం సాగింది ఇలా..

బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ లతీఫ్‌- రేహన్‌ బేగం దంపతుల రెండో సంతానం అఫ్రీన్‌ బేగం. ఆమె ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు బాన్సువాడలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్మీడియెట్‌ బైపీసీలో 915 మార్కులు సాధించారు. అప్పటి ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ చక్రపాణి నుంచి ప్రశంసలు అందుకున్నారు. బాన్సువాడలోని కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తెలుగులో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో 100కు 100 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేసి 1,774 మార్కులు సాధించారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ కనకయ్యతోపాటు తెలుగు అధ్యాపకులు తెలుగు భాషపై పట్టు సాధించేందుకు తోడ్పడ్డారు. తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సాధించి ప్రముఖ రచయితల దృష్టిలో పడ్డారు. నిజామాబాద్‌లోని బీఆర్‌ మెమోరియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ మోడల్‌ ఆఫ్‌ మూవ్‌మెంట్‌ పేరుతో సత్కరించారు. 2016లో అప్పటి టీయూ ఉపకులపతి పార్థసారథి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అఫ్రీన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పలు పత్రికల్లో 30కిపైగా వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యంపై రచనలు చేశారు. ఇవన్నీ పలు దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. భాషపై మమకారమే ఆమె డాక్టరేట్‌ సాధించడానికి కారణమైంది. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలన్నదే ఆమె అభిమతం. తెలుగు సాహిత్యంపై పూర్తి పరిజ్ఞానం సాధించిన ఆమె తన విజయానికి సోపానం తల్లిదండ్రులు, గురువులేనని వినమ్రంగా చెబుతున్నారు. అఫ్రీన్‌ ప్రతి విద్యార్థికి స్ఫూర్తి, మార్గదర్శకురాలని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

ప్రొఫెసర్‌గాస్థిరపడాలన్నదే లక్ష్యం

  • అఫ్రీన్‌ బేగం

మాతృభాష ఉర్దూ అయినా తెలుగు అంటే ఎంతో మమకారం. ఇంటి చుట్టుపక్కల తెలుగు మాట్లాడేవారే ఎక్కువగా ఉండడంతో చిన్ననాటి నుంచి భాషపై అభిమానం ఏర్పడింది. అమ్మ, నాన్నలు ఎంతో ప్రోత్సహించారు. నాన్న లతీఫ్‌ తెలుగు పత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న కారణంగా తెలుగు సాహిత్యానికి స్ఫూర్తిగా నిలిచారు. డాక్టరేట్‌ సాధించి తెలుగు డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా స్థిరపడాలన్నదే నా లక్ష్యం. ఇంటర్‌, డిగ్రీ, యూనివర్సిటీలో పాఠాలు బోధించిన గురువుల సహకారం నా జీవితంలో మరచిపోలేను. పీహెచ్‌డీ పూర్తి చేయడానికి మా పర్యవేక్షకులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.కనకయ్య ఇచ్చిన సూచనలు, సలహాలు ఎంతో దోహదం చేశాయి. అందరి సహకారంతో పరిశోధన విజయవంతంగా పూర్తి చేశా. 

తెలుగు సాహిత్యంపై పరిశోధన

‘తెలంగాణ నవలా రచయిత్రులు - ఒక పరిశీలన’ అనే అంశంపై అఫ్రీన్‌ తన పరిశోధనను పూర్తి చేశారు. తెలంగాణ నవలా రచయిత్రుల రచనలను ఇతివృత్తంగా తీసుకొని సమగ్ర పరిశోధన జరిపిన నేపథ్యంలో అఫ్రీన్‌కు డాక్టరేట్‌ ప్రకటించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి ముస్లిం యువతిగా అఫ్రీన్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. తన పరిశోధనను అతిస్వల్ప కాలంలో పూర్తి చేయడంపై యూనివర్సిటీ అధ్యాపకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆమె రాసిన సుమారు 30కి పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో అఫ్రీన్‌ పాల్గొని పత్ర సమర్పణ చేశారు. అఫ్రీన్‌ రాసిన వ్యాసాల్లో తెలుగు సాహిత్యంపై పరిశోధనలే అధికంగా ఉన్నాయి. ఆమె ప్రాచీన కాలం నాటి పుస్తకాలు చదివి తెలుగు చరిత్రపై అనేక వ్యాసాలు రాశారు. ముఖ్యంగా ముస్లిం కథలు - జీవన వాస్తవికత, సామెతల్లో జీవన చిత్రన, రచయిత్రుల కథల్లో తెలంగాణ జీవన చిత్రన, తెలంగాణలో నవలామణులు తదితర వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణలో నవలామణులు అనే పరిశోధనాత్మకత కథనంలో 400 ఏండ్లుగా తెలుగు సాహిత్యానికి జరుగుతున్న సేవ, రచయితలు, కనుమరుగైన వారి పేర్లను ఆమె తన వ్యాసంలో ప్రస్తావించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 

గురజాడ పురస్కారం

అఫ్రీన్‌ రాసిన వ్యాసాలను పరిశీలించిన విజయవాడకు చెందిన మానవ సాహిత్య సాంస్కృతిక అకాడమీ వారు గురజాడ అవార్డును ప్రదానం చేశారు. 2014 మార్చిలో విశాఖ పట్టణంలో ఏపీ స్టేట్‌ కల్చరల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ వారు నిర్వహించిన ఉమ్మడి రాష్ట్రస్థాయి ఎడ్యుకేషన్‌ మెరిట్‌ అవార్డుల్లో అఫ్రీన్‌ బేగం ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించారు. 

తండ్రి ప్రోత్సాహం

అఫ్రీన్‌ను ఆమె తండ్రి లతీఫ్‌ అడుగడుగునా ప్రోత్సహించారు. ఆమెలో ఆత్మైస్థెర్యాన్ని నింపారు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పీహెచ్‌డీని మూడేండ్లలోనే పూర్తి చేశారు. పర్యవేక్షకులు ఆచార్య కనకయ్య సూచనలు, సలహాలు పీహెచ్‌డీకి ప్రేరణనిచ్చాయి. 

VIDEOS

logo