శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 17, 2021 , 00:12:00

డ్రోన్‌ వ్యవసాయం

డ్రోన్‌ వ్యవసాయం

హైటెక్‌ సాగుకు బాటలు.. కూలీల కొరతకు చెక్‌

ఏడు నిమిషాల్లో ఎకరానికి మందు పిచికారీ

పురుగుమందుల వినియోగంలో 40 శాతం ఆదా

వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్న రైతులు

ఏడు లక్షలతో కొనుగోలు చేశా.. : రైతు సురేశ్‌

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. సాగులో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పొలాల్లో పురుగుమందులు చల్లేందుకు డ్రోన్లను వినియోగిస్తూ హైటెక్‌ సాగుకు బాటలు వేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల కొరత తీరడంతోపాటు పురుగుమందులూ ఆదా అవుతున్నాయి. సమయం కూడా కలిసి వస్తుండడంతో డ్రోన్ల వినియోగంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. 

- రుద్రూర్‌, జనవరి 16

రుద్రూర్‌, జనవరి 16 :

సాగులో యాంత్రీకరణను అందిపుచ్చుకుంటున్న రైతులు మరో అడుగు ముందుకు వేశారు. పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తూ హైటెక్‌ సాగుకు బాటలు వేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల అవసరం లేకుండా పోతున్నది. దీనికితోడు పురుగుమందులు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి. సమయం కూడా కలిసి వస్తున్నది. దీంతో డ్రోన్ల వినియోగానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రుద్రూర్‌ మండలంలోని పలువురు రైతులు డ్రోన్‌తో పంటలకు పురుగుమందులు స్ప్రే చేయిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగులో వినూ త్న పద్ధతులు అవలంబిస్తున్నారు. కాడెద్దులతో పంటలు పండించడం నుంచి దశలవారీగా యాంత్రీకరణ వైపు సాగుతున్నారు. సాగులో యంత్రాల వాడకంతో శారీరక శ్రమతగ్గడంతోపాటు సమయం ఆదా అవుతున్నది. ఇప్పటికే ట్రాక్టర్లను వివిధ పనులకు వినియోగిస్తున్నారు. దుక్కి దున్నడం నుంచి పంట చేతికొచ్చే వరకు ట్రాక్టర్‌తోపాటు పలు రకాల యంత్రాలు, పరికరాలను విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు అన్నదాత చేతికి మరో అస్త్రం లభించింది. అదే డ్రోన్‌. పంటలకు పురుగుమందులు చల్లేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. దీంతో రైతులకు ప్రధానంగా కూలీల సమస్య తొలగిపోనున్నది. పురుగుమందులు చల్లడంలోనూ 40 శాతం వరకు ఆదా కావడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. ఖర్చు తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుండడంతో డ్రోన్ల వినియోగంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రుద్రూర్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ క్యాంపునకు చెందిన రైతు సురేశ్‌ డ్రోన్‌ను కొనుగోలు చేశాడు. 10 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్‌ ఎకరానికి సరిపడా పురుగుమందును స్ప్రే చేస్తుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే ఎకరం వరి పంటకు పురుగుమందు పిచికారీ పూర్తి చేస్తుంది. ఈ డ్రోన్‌కు ఐదు బ్యాటరీ సెట్లు, రెండు ఛార్జర్లు ఉంటాయి. ఒక్కో బ్యాటరీ సెట్టు 10 నిమిషాలు మాత్రమే ఛార్జింగ్‌ ఉంటుంది. ప్రతి పదినిమిషాల కోసారి ఛార్జింగ్‌ చేయాల్సి ఉంటుంది. డ్రోన్‌ హ్యాండ్‌ చేసే హ్యాండిల్‌ వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి ఆపరేట్‌ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో అగ్రికల్చర్‌ అసెస్‌మెంట్‌ అనే యాప్‌ ద్వారా స్ప్రే చేయాలి. భూమి కొలతను ఎంటర్‌ చేస్తే డ్రోన్‌ ఆన్‌ చేసిన తరువాత ఆపరేట్‌ చేయకుండా ఇచ్చిన కొలతలో స్ప్రే చేస్తుంది.  

సమయం వృథా కాకుండా ఎకరం పొలాన్ని కేవలం ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తుంది.

సాధారణంగా స్ప్రేచేస్తే అయ్యే మందులో కేవలం 60 శాతమే పొలానికి అవసరముంటుంది. 

స్ప్రే చేసిన మందు మొక్కకు నేరుగా నిలువుగా పడడంతో కింది వరకు  చేరుతుంది. 

కూలీల కొరతను అధిగమిస్తూ ఒక్కరు మాత్రమే స్ప్రే చేయొచ్చు. 

lడ్రోన్లను మ్యానువల్‌గా ఉపయోగిస్తే ఆపరేటర్‌ చేతిలో ఆధారపడే డ్రోన్‌ ఏరియా ఫీడింగ్‌ చేసిన తరువాత వరుసల క్రమంలో మూడు ఫీట్ల విస్తీర్ణంతో స్ప్రే చేస్తుంది.  

ఎకరానికి రూ.500 అద్దె

నేను పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తా. అవసరమైన సమయానికి కూలీలు దొరక్క ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు డ్రోన్‌ను కొనుగోలు చేశా. ఇందుకోసం రూ.7 లక్షలు ఖర్చు చేశా. దీన్ని తీసుకొచ్చిన నెల నుంచి ఇప్పటి వరకు 30 ఎకరాల్లో స్ప్రే చేశా. డ్రోన్‌ ద్వారా స్ప్రే చేయించుకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎకరానికి రూ.500 అద్దె తీసుకుంటున్నా. 

-సురేశ్‌, డ్రోన్‌ యజమాని

డ్రోన్ల అవసరం ఉంది

వ్యవసాయరంగంలో డ్రోన్ల అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ డ్రోన్లతో స్ప్రే చేసే విషయంలో రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. వ్యవసాయరంగంలోకి డ్రోన్లను తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కొన్ని నియమ నిబంధనల ప్రకారం ఈ డ్రోన్లను వాడాల్సి ఉంటుంది. చుట్టూ ఉండే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నష్టం కలుగకుండా, ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ఉపయోగించాలి. డ్రోన్లను ఉపయోగించాలంటే అనుమతి తప్పనిసరి.  

-డాక్టర్‌ శ్రీధర్‌, 

 వరి, చెరుకు పరిశోధనా స్థానం అధిపతి


VIDEOS

logo