మంగళవారం 02 మార్చి 2021
Nizamabad - Jan 17, 2021 , 00:12:00

వ్యాక్సిన్‌.. సక్సెస్‌

వ్యాక్సిన్‌.. సక్సెస్‌

ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో..

మొదటి రోజు 355 మందికి టీకాల పంపిణీ

నిజామాబాద్‌ జిల్లా దవాఖానలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఇతర కేంద్రాల్లో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

సజావుగా కరోనా వ్యాక్సినేషన్‌

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ టీకాల పంపిణీ కార్యక్రమం మొదటిరోజు ప్రశాంతంగా కొనసాగింది. రెండు జిల్లాల్లోని 10 కేంద్రాల్లో టీకాలు వేశారు. తొలిటీకాను పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి అందజేశారు. మొత్తం 355మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించిన అనంతరం టీకా పంపిణీకి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్‌ జిల్లా దవాఖానలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌, మాక్లూర్‌ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డిచ్‌పల్లిలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, బోధన్‌లో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, మోర్తాడ్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కామారెడ్డి ఏరియా దవాఖానలో జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌శోభ వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ హాజరయ్యారు. సదాశివనగర్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, రాజీవ్‌నగర్‌లో కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, భిక్కనూరులో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. 

టీకా వంద శాతం సురక్షితం

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఖలీల్‌వాడి, జనవరి 16 :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నదని, ప్రస్తుతం అందిస్తున్న వ్యాక్సిన్‌ నూటికి నూరు శాతం సురక్షితమైనదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. అజయ్‌ అనే శానిటేషన్‌ వర్కర్‌కు వైద్య సిబ్బంది మొదటి వ్యాక్సిన్‌ వేశారు. అనంతరం 30 నిమిషాలు పర్యవేక్షణలో ఉంచారు. అజయ్‌ ఆరోగ్య వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. పది నెలలుగా వ్యాక్సినేషన్‌ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మొదటి విడుతలో పార్ట్‌-ఏ కింద వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది, ఐసీడీఎస్‌ కార్యకర్తలు మొత్తం 15 వేల మందికి, పార్ట్‌-బీలో పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది మొత్తం 23 వేల మందికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నామని తెలిపారు. మొదటి రోజున ఆరు కేంద్రాల్లో 30 మంది చొప్పున 180 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని చెప్పారు. ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా 42 పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ప్రభుత్వ దవాఖానలు, నాలుగు ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రోజూ వంద మందికి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో వెయిటింగ్‌రూమ్‌, వ్యాక్సినేషన్‌ రూమ్‌, పర్యవేక్షణ రూమ్‌లు వేర్వేరుగా ఉండేలా సిద్ధం చేసుకోవాలని సూచించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్‌ వేయడానికి ఇద్దరు సిబ్బందిని నియమించాలని తెలిపారు. యాంటి రియాక్షన్‌ మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో 10 పడకలు అత్యవసరం కోసం ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సదుర్శనం, దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిర, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ఉమ్మడి జిల్లాలో పది కేంద్రాల్లో..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది కేం ద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖాన, బోధన్‌, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌, మాక్లూర్‌, కామారెడ్డి ఏరియా దవాఖాన, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ, భిక్కనూరు, సదాశివనగర్‌లో టీకా పంపిణీ నిర్వహించారు. మొత్తం 355 మందికి టీకాలు వేశారు. 

ప్రజారోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వాల లక్ష్యం

 ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

విద్యానగర్‌, జనవరి 16 : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానలో జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభతో కలిసి కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు ఆరోగ్య సిబ్బంది మొదటి టీకా వేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌పై చెడు ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ శోభ మాట్లాడుతూ.. కరోనా నివారణ వ్యాక్సిన్‌ రావడం శుభపరిణామం అన్నారు. కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లాలో 22 శాతం ఉన్న కరోనా పాజిటివ్‌ను 0.32 శాతానికి తగ్గించామని చెప్పారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ.. కరోనా నివారణ వ్యాక్సిన్‌ సురక్షితమైందని చెప్పారు. రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి ప్రారంభించగా.. మొదటి టీకాను పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ వెంకటరమణకు వేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీవో శ్రీను, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి, మెడికల్‌ ఆఫీసర్‌ సుజాయిత్‌ అలీ పాల్గొన్నారు.

టీకా తీసుకోవడం ఆనందంగా ఉంది

డిచ్‌పల్లి, జనవరి 16 : కొవిడ్‌-19 టీకా మొదటి సారి నాకే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలలుగా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇకపై ధైర్యంగా ఉండొచ్చు. టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.

-సుశీల, అంగన్‌వాడీ టీచర్‌, గాంధీనగర్‌, డిచ్‌పల్లి

సైడ్‌ఎఫెక్ట్స్‌  ఉండవు

విద్యానగర్‌, జనవరి 16 : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అందరినీ వణికించింది. వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా అందుబాటులోకి వచ్చిన మొదటి సారే నేను తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కరోనా టీకాతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. ఎవరూ అధైర్యపడొద్దు. 

-డాక్టర్‌ అజయ్‌కుమార్‌, 

ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌, కామారెడ్డి

టీకా తీసుకోవడానికి భయపడ్డారు

వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతుందని, 30 మందికి టీకా ఇస్తారని శనివారం అందరికీ తెలిసింది. కానీ ముందుగా టీకా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేనే ముందుగా టీకా తీసుకోవాలని అనుకున్నా. నేను తీసుకున్నాక ఏమీ కాలేదని అందరూ ముందుకొచ్చారు. టీకా తీసుకోవడంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగలేదు.

-గంగాధర్‌, ల్యాబ్‌టెక్నీషియన్‌, మోర్తాడ్‌ సీహెచ్‌సీ 

తొలి టీకా వేసి గుర్తింపు ఇచ్చారు

బోధన్‌, జనవరి 16: కరోనా వ్యాక్సిన్‌ ఇంత తొందరగా వస్తుందని, అలా వచ్చిన వ్యాక్సిన్‌లో బోధన్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో నాకే వేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. తొలి టీకా నాకే వేయడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి సామాన్య ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించడం మామూలు మాట కాదు. తొలి టీకా వేయించిన మా దవాఖాన సూపరింటెండెంట్‌ అన్నపూర్ణమ్మ మేడమ్‌కు, ఆర్డీవో రాజేశ్వర్‌ సార్‌కు కృతజ్ఞతలు.

-బొమ్మరవేణి మహేందర్‌, 

సెక్యూరిటీ గార్డ్‌, బోధన్‌ జిల్లా ప్రభుత్వ దవాఖాన

కరోనా భయం వీడింది

విద్యానగర్‌, జనవరి 16 : గతంలో కరోనాకు మందు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది కరోనా టీకాను మన దేశంలో రూపొందించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం గర్వంగా ఉంది. టీకా రావడంతో ప్రజల్లో కరోనా భయం తొలగిపోయింది. 

-డి.వెంకటరమణ, సూపర్‌వైజర్‌, రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ, కామారెడ్డి

అందరికీ ధన్యవాదాలు

ఖలీల్‌వాడి, జనవరి 16 : కొవిడ్‌ టీకా పంపిణీని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి కృషితో ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకున్నది. యాంటి వ్యాక్సిన్‌, అంబులెన్సు అందుబాటులో ఉంచాం. మెడికల్‌ అధికారులను సిద్ధంగా ఉంచి పర్యవేక్షించాం. అందరి సమన్వయంతోనే ఇంతటి విజయాన్ని సాధించాం.

-సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, నిజామాబాద్‌

VIDEOS

logo