శనివారం 27 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 16, 2021 , 02:44:50

నేడే తొలి టీకా

నేడే తొలి టీకా

  • నిజామాబాద్‌ జిల్లా కేంద్ర దవాఖానలో లాంఛనంగా ప్రారంభం 
  • హాజరు కానున్న మంత్రి  ప్రశాంత్‌రెడ్డి
  • నిజామాబాద్‌లో ఆరు, కామారెడ్డిలో నాలుగు కేంద్రాల్లో..
  • వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకే తొలి డోసు
  • సోమవారం నుంచి కేంద్రానికివందమందికిచొప్పున..

కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి విరుగుడుకు టీకా వచ్చేసింది. ఉమ్మడి జిల్లాలో శనివారం వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్నది. మొదటి రోజు నిజామాబాద్‌లో ఆరు, కామారెడ్డిలో నాలుగు కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. కేంద్రానికి 30 మందికి చొప్పున 300 మందికి టీకా వేయనున్నారు. సోమవారం నుంచి వంద మందికి చొప్పున వ్యాక్సిన్‌ వేస్తారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్ర దవాఖానలో లాంఛనంగా ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ప్రారంభమయ్యే టీకా పంపిణీకి  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. డ్రైరన్‌లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు, సూచనలు అందజేస్తూ వచ్చారు.  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎట్టకేలకు కరోనా విరుగుడుకు టీకా రావడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు

విద్యానగర్‌,జనవరి 15 : కామారెడ్డి జిల్లాలో శనివారం జిల్లా దవాఖానలో ప్రారంభించనున్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో విప్‌ గంపగోవర్ధన్‌, ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, కలెక్టర్‌ శరత్‌ పాల్గొంటారని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

ఖలీల్‌వాడి , జనవరి 15 :

కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్‌ను శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరుకానున్నారు.  ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగం అనంతరం నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో  టీకా పంపిణీని ప్రారంభిస్తారు. వ్యాక్సినేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన, బో ధన్‌, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌, మాక్లూర్‌ ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ప్రభుత్వ దవాఖానలో  మోదీ ప్రసంగం వినేందుకు టీవీలను కూడా ఏర్పాటు చేశారు. ఎ లాంటి పొరపాట్లు జరగకుండా ఆర్డీవోలు పర్యవేక్షించాల్సిందిగా   కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కు మొత్తం 302 వా యిల్స్‌ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. మొదటి రోజు  ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యా క్సిన్‌ వేయనున్నారు. అనంతరం 100 మంది చొ ప్పున ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి టీకా ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. తొమ్మిది నెలలుగా ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనాను అంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేశాయి. ఈ వ్యాక్సిన్‌తో    కరోనా మాయమవుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

పకడ్బందీ ఏర్పాట్లు

 వ్యాక్సినేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను నిజామాబాద్‌ కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కేంద్రంలో వెయిటింగ్‌ , వ్యాక్సిన్‌, పర్యవేక్షణ గదులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్ల కోసం  జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌ పూర్తి బాధ్యత వహించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. 

కరోనా వ్యాక్సినేషన్‌కు సర్వసిద్ధం 

వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ జిల్లాకు వచ్చేసింది. శనివారం ప్రారంభానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. ప్రతి కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌ ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. వైద్య సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సినేషన్‌పై శిక్షణ పూర్తి చేశాం. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 42 ప్రభుత్వ, 4 ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సిన్‌ వేయనున్నాం. 

-సుదర్శనం, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, నిజామాబాద్‌.

ప్రణాళికతో ముందుకెళ్లాలి..

 నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇందూరు, జనవరి 15 : కరోనా వ్యాక్సినేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అట్టహాసంగా ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నుంచి టీకా పంపిణీని ప్రారంభిస్తున్నందున అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొదటి రోజు టీకా పంపిణీ చేయనున్న నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ దవాఖాన, బోధన్‌ దవాఖాన, డిచ్‌పల్లి, మోర్తాడ్‌, ఆర్మూర్‌, మాక్లూర్‌లోని ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఈ ఆరు కేంద్రా ల్లో వెయింటింగ్‌ రూముల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరగాలని, కనీసం 10 పడకలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కేంద్రంలో కంప్యూటర్‌తో పాటు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేకాధికారులుగా నియమించిన జిల్లాస్థాయి అధికారులు ఈ ప్రారంభ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు.  చిన్న పొరపాట్లు జరిగినా వారిపై చర్యలు ఉంటాయన్నారు.సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, లత, డీఎంహెచ్‌వో సుదర్శనం, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, ఇతర కేంద్రాల ఇన్‌చార్జిలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రత్యేకాధికారులు గోవింద్‌, నర్సింగ్‌నాయక్‌, శశికళ, రమేశ్‌, ఆర్డీవోలు, రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

మొదటిరోజు నాలుగు కేంద్రాల్లో..

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌

విద్యానగర్‌/ సదాశివనగర్‌, జనవరి 15 : మొదటి రోజు కరోనా వ్యాక్సినేషన్‌కు జిల్లాలో నాలుగు కేంద్రాలను సిద్ధం చేసినట్లు కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి ఏరియా దవాఖాన, రాజీవ్‌నగర్‌, సదాశివనగర్‌ పీహెచ్‌సీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 5,214 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను గుర్తించి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వీరిలో ప్రభుత్వ వైద్యులు 2262, ఐసీడీఎస్‌ 2104, ప్రైవేట్‌ వైద్యులు 848 మందికి టీకా వేయనున్నామని తెలిపారు. జిల్లాలో 30 వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశామని, మొదటి రోజు కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖాన, రాజీవ్‌నగర్‌, భిక్కనూరు, సదాశివనగర్‌ పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ వేయనున్నామని తెలిపారు. మొదటి రోజు ప్రతి కేంద్రంలో 30 నుంచి 50 మందికి, రెండో రోజు నుంచి జిల్లాలోని 30 కేంద్రాల్లో 100 మందికి చొప్పున వ్యాక్సిన్‌ వేయనున్నామని తెలిపారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇప్పటికే ఫోన్లకు మెసేజ్‌లు పంపామన్నారు. కేంద్రంలో వ్యాక్సినేషన్‌ చేసిన వ్యక్తిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలని సూచించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీను, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, వైద్య సిబ్బంది, అధికారులు ఉన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో  వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  


VIDEOS

logo