బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 14, 2021 , 00:24:33

కోళ్ల మృతితో కలకలం

కోళ్ల మృతితో కలకలం

రెండు రోజుల్లో 1500 కోళ్లు మృత్యువాత

పరీక్షల నిమిత్తం కళేబరాలు హైదరాబాద్‌కు..

డిచ్‌పల్లి, జనవరి 13: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండాలోని దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో సుమారు 1500 కోళ్లు మృత్యువాత పడడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి వెయ్యికి పైగా కోళ్లు మృతి చెందాయి. బుధవారం సైతం మరో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో వాటిని పౌల్ట్రీ నిర్వాహకులు జేసీబీ సహాయంతో గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పశుసంవర్థక శాఖజాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భరత్‌, కిరణ్‌ దేశ్‌పాండే ఏడీ (ల్యాబ్‌), మండల పశువైద్యాధికారి డాక్టర్‌ గోపీకృష్ణ తమ సిబ్బందితో బుధవారం ఉదయం పౌల్ట్రీఫామ్‌కు చేరుకొని నిర్వాహకుడు రాంచందర్‌గౌడ్‌తో మాట్లాడారు. కోళ్లకు ఎన్ని రోజులకు ఒకసారి వ్యాక్సిన్‌ వేస్తారని, చివరగా ఎప్పుడు వేశారని, కోళ్ల దాణా ఎక్కడి నుంచి సరఫరా అవుతుందనే వివరాలను తెలుసుకున్నారు. రెండు షెడ్లలో సుమారు 8000 కోళ్లు పెంచుతున్నామని, హైదరాబాద్‌కు చెందిన శాతవాహన కంపెనీ వారు కోడి పిల్లలు, దాణా సరఫరా చేస్తారని చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో సుమారు ఐదు వేలకు పైగా కోళ్లను కంపెనీ వారు తీసుకెళ్లారని, మంగళవారం రాత్రి నుంచి కోళ్లు మరణిస్తున్నాయన్నారు. జాయింట్‌ డైరెక్టర్‌ భరత్‌ ఆదేశాల మేరకు అధికారులు బతికున్న కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించారు. చనిపోయిన రెండు కోళ్ల కళేబరాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తరలించారు. ఈ సందర్భంగా జేడీ భరత్‌ మాట్లాడుతూ చనిపోయిన కోళ్లను పరిశీలిస్తే బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని, పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎలా చనిపోయాయనే వివరాలు తెలుస్తాయన్నారు. 

నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. డిచ్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని  మండల పశువైద్యాధికారి డాక్టర్‌ గోపీకృష్ణను ఆదేశించారు. కోళ్ల మృతితో తండావాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


logo