మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Jan 13, 2021 , 00:43:45

ఆనందాలు పంచే సంక్రాంతి

ఆనందాలు పంచే సంక్రాంతి

మూడు రోజుల ముచ్చటైన పండుగ

నేడు భోగి.. రేపు మకర సంక్రాంతి.. ఎల్లుండి కనుమ

సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న లోగిళ్లు

బాన్సువాడ రూరల్‌ / డిచ్‌పల్లి / ఎల్లారెడ్డి రూరల్‌ / నిజాంసాగర్‌, జనవరి 12 : 

మూడు రోజులపాటు ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకొనే ముచ్చటైన పండుగ సంక్రాంతి. మకర సంక్రాంతి తెలుగు రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పర్వదినం. ఈ పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడురోజులపాటు నిర్వహించుకుంటారు. జిల్లాలో ఈ నెల 13న భోగి, 14న మకర సంక్రాంతి, 15న కనుమ పండుగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. మూడు రోజుల పండుగ సందర్భంగా తెల్లవారుజామున ఇంటి ముందర కల్లాపి చల్లి వాకిళ్లలో రంగురంగుల ముగ్గులను వేసి అందులో గొబ్బెమ్మలు, నేరేడు పండ్లు పెట్టి అలంకరిస్తారు. భోగి పండుగ నాడు చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా తలంటు స్నానం చేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. సాయంత్రం వైభవంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులకు కానుకలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మహిళలందరూ పొంగలిని సామూహికంగా వండి సూర్యభగవానుడికి సమర్పిస్తారు. సంక్రాంతి పర్వదినాన మకర ధ్వజుడు, పుష్పబాణసంధాన చతురుడు అయిన మన్మథుడిని మధుర శృంగార భావం చేరకూడదన్న సంకల్పంతో చెరుకు గన్నెల్ని తమ ఇంటి గుమ్మాలకు అలంకరిస్తారు. పొంగలి వండడం పరిపాటి. తమిళ, తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను పొంగల్‌ అని అంటారు. ఈ పండుగను కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి అత్యంత వైభవంగా మూడు రోజులపాటు జరుపుకొంటారు. 

బోగభాగ్యాల భోగి

భోగి పండుగనాడు చిన్న పిల్లల సంబురాలు ఎక్కువగా చేస్తారు. తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేస్తారు. భగ అనే పదం నుంచి భోగి వచ్చింది. భగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం. దక్షిణాయణంలో ప్రజలు తాము పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగి మంటలు. కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్థాలను, పాత వస్తువులను మంటల్లో వేయడంతో పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. భోగిరోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పండ్లు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తారు. 

సరదాల సంక్రాంతి

నక్షత్రాలు ఇరవైఏడు. ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుండగా.. మొత్తం 108 పాదాలుగా విభజించారు. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిని సంక్రాంతిగా వ్యవహరిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే పుణ్యదినం. సంక్రాంతిలో ‘సం’ అంటే మిక్కిలి అని, ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని, మంచి అభ్యుదయాన్ని ఇచ్చేది కనుకనే దీనిని సంక్రాంతిగా పెద్దలు చెబుతారు. ఈ పండుగకు ఇంటికి ధన, ధాన్యరాశులు వచ్చి చేరుతాయి. మకర సంక్రాంతి రోజున ఉదయం ప్రతి ఇంటి ముందు పిడకలతో పేర్చిన మంటల్లో కొత్త పాత్రలో పాలు పోసి పొంగించడం ఆనవాయితీ.  

ఉత్సాహాన్ని నింపే కనుమ

మకర సంక్రాంతి మరుసటిరోజు అంటే మూడో రోజు కనుమ పండుగను నిర్వహిస్తారు. దీనినే పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పల్లెల్లో రైతులకు పశువులే గొప్ప సంపద. అవి ఆరోగ్యంగా ఉంటే పాడి రైతుకు ఉత్సాహం. పంటల సాగులో వీటి పాత్ర ఎంతగానో ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. అందుకే కనుమ రోజు పల్లెల్లో పశువులను పూజిస్తారు. పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీనినే పాలిచల్లడం అంటారు.  

 


logo