బుధవారం 20 జనవరి 2021
Nizamabad - Jan 11, 2021 , 00:09:33

ధాన్యాగారంగా నిజామాబాద్‌ జిల్లా

ధాన్యాగారంగా నిజామాబాద్‌ జిల్లా

ఇక్కడి పసుపు పంటకు దేశవ్యాప్తంగా డిమాండ్‌  

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

ఇందూరు, జనవరి 10 : రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచిందని, ముఖ్యంగా ఇక్కడి పసుపు పంటకు విశేష ప్రాధాన్యం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఆదివారం ఎక్సెల్‌ ఇండియా పత్రిక ఆధ్వర్యంలో లీడర్‌షిప్‌ మీట్‌లో భాగంగా ‘నిజామాబాద్‌ గ్రోత్‌ ఎజెండా 2021’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్థసారథి హాజరుకాగా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు అధ్యక్షత వహించారు. ముందుగా మాజీ ఎంపీ నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లా పసుపునకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుండగా, డిమాండ్‌ మేరకు ఎగుమతి కావడంలేదన్నారు. రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఎగుమతి చేయడానికి వీలవుతుందన్నారు. మన మార్కెట్‌కు సెకండ్‌ లార్జెస్ట్‌ డిమాండ్‌ ఉందని, ఈ-నామ్‌ ద్వారా పంటకు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయని వివరించారు. నందిపేట్‌, కొండారంలో ఉన్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ వస్తే జిల్లాలో వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి మంచి ప్రాజెక్టులు వస్తాయని దీంతో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. బీడీ పరిశ్రమతో మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. యువత కోసం సైబర్‌ సెక్యూరిటీ క్లాసులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌, ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ నసీమ్‌, కృషి దర్శన్‌ కేంద్రం అధికారి అరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, వాసవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పార్థసారథికి ఘన స్వాగతం

జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, లత ఘనస్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. 


logo