బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 11, 2021 , 00:09:29

కొంగొత్తగా..

కొంగొత్తగా..

ఇద్దరు సీఈలు.. నలుగురు ఎస్‌ఈలు !

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జలవనరుల శాఖ ముఖచిత్రమిది..

నిజామాబాద్‌ సీఈకి 280, కామారెడ్డి సీఈకి 289 మంది సిబ్బంది కేటాయింపు

పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేస్తూ జీవో జారీ చేసిన సర్కారు

సర్కిళ్లుగా మారిన నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, బాన్సువాడ

ఒక్కో సర్కిల్‌ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డివిజన్‌ ఏర్పాటు

ఇకపై చీఫ్‌ ఇంజినీర్‌ పరిధిలోనే సమస్త నీటి పారుదల వ్యవస్థ

నిజామాబాద్‌, జనవరి 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో బీడుభూములకు పరుగులు తీస్తున్న గోదావరి జలాలతో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల వ్యవస్థకు ప్రాధాన్యత అమాంతం పెరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కంకణబద్ధులై పని చేస్తున్నారు. రైతులు మొగులు వైపు చూసే రోజులు పోవాలనే సంకల్పంతో నీటిపారుదల ప్రాజెక్టులను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో పర్యవేక్షణ సులువుగా ఉండేందుకు నీటి పారుదలశాఖను పునర్వ్యవస్థీకరించారు. రకరకాల పేర్లతో ఉన్న నీటిపారుదల శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. జలవనరుల శాఖగా పేరు మార్చడంతోపాటు గందరగోళంగా ఉన్న ప్రస్తుత డివిజన్లు, సబ్‌ డివిజన్లను ఆయకట్టు ఆధారంగా విభజించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన నూతన జిల్లాల ప్రాతిపదికన జలవనరుల శాఖ కొంగొత్త రూపంలో మనుగడలోకి వచ్చింది. ఈ మేరకు సిబ్బంది కేటాయింపు, సర్కిళ్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా సీఈలను నియమించగా.. ఒక్కో సీఈ పరిధిలో ఇద్దరు ఎస్‌ఈలు, ఒక్కో ఎస్‌ఈ నేతృత్వంలో ఇద్దరు డీఈలు ఉంటారు. నిజామాబాద్‌ సీఈకి 280, కామారెడ్డి సీఈకి 289 మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇద్దరు సీఈలు... 569 మంది సిబ్బంది

చెల్లాచెదురుగా పడి ఉన్న నీటిపారుదల శాఖలోని ఆయా విభాగాల ఉద్యోగులందరినీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. తద్వారా నిజామాబాద్‌, కామారెడ్డి సీఈల పరిధిలో 569 మంది సిబ్బందిని కేటాయించింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ విడుదల చేసిన జీవోతో ఎక్కడ? ఎంత మంది? సిబ్బంది పని చేయనున్నారో స్పష్టత వచ్చింది. నిజామాబాద్‌ చీఫ్‌ ఇంజినీర్‌కు 280 మంది జలవనరుల శాఖ ఇంజినీర్లు, పరిపాలన సిబ్బందిని కేటాయించారు. కామారెడ్డి చీఫ్‌ ఇంజినీర్‌కు 289 మంది సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్మూర్‌ ఎస్‌ఈ పరిధిలో 123 మంది, నిజామాబాద్‌ ఎస్‌ఈ పరిధిలో 118 మంది పని చేయనున్నారు. నిజామాబాద్‌ సీఈ ఆఫీసులో 39 మంది స్టాఫ్‌ను కేటాయించారు. కామారెడ్డి ఎస్‌ఈ పరిధిలో 130 మంది, బాన్సువాడ ఎస్‌ఈ పరిధిలో 121 మంది పని చేస్తారు. కామారెడ్డి సీఈ ఆఫీసులో 38 మంది ఉంటారు. ఉభయ జిల్లాల్లో ఇద్దరు సీఈలకు మొత్తం 569 మంది సిబ్బందిని కేటాయించారు. జలవనరుల శాఖ పునర్విభజనతో ఉమ్మడి జిల్లాను రెండు సీఈలుగా, నలుగురు ఎస్‌ఈలుగా విభజించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, బాన్సువాడలు సర్కిళ్లుగా మారాయి. నిజామాబాద్‌ సీఈ ఆధ్వర్యంలో బోధన్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌ బాల్కొండ డివిజన్లుగా రూపాంతరం చెందనున్నాయి. కామారెడ్డి సీఈ పరిధిలో బాన్సువాడ, నిజాంసాగర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లుగా కొనసాగనున్నాయి.

జిల్లాకు ఒక సీఈ..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి పారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై ఉద్యోగులు, ఇంజినీర్లు ఆసక్తి చూపారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు ఇప్పటికే నూతనంగా చీఫ్‌ ఇంజినీర్లు(సీఈ) నియమితులయ్యారు. నిజామాబాద్‌ సీఈగా ఆర్‌.మధుసూదన్‌ రావు, కామారెడ్డి సీఈగా టి.శ్రీనివాస్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో సర్కిల్‌ పరిధిలో డివిజన్లు, సబ్‌ డివిజన్లు సైతం ప్రభుత్వం విభజించింది. అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదికన డివిజన్‌ పోస్టులు నిర్ణయించారు. డివిజన్‌, సబ్‌ డివిజన్‌ వర్గీకరణను ఆయకట్టు ఆధారంగా పూర్తి చేశారు. చీఫ్‌ ఇంజినీర్‌ పరిధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు, భారీ, మధ్య, చిన్న నీటి పారుదల వ్యవస్థలతోపాటు ఎత్తిపోతల పథకాలు సైతం వచ్చేస్తాయి. దీంతో ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా పర్యవేక్షణ సులువు కానుంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని ప్రాధాన్యత ఉమ్మడి నిజామాబాద్‌కు దక్కింది. రెండు భారీ ప్రాజెక్టులతోపాటుగా గోదావరి నది తీరంలోని జలాల ఆధారంగా అనేక చిన్న, మధ్య తరహా ఎత్తిపోతల పథకాలు నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టులైన పోచారం, సింగీతం, కళ్యాణి, కౌలాస్‌ వంటి ప్రాజెక్టులు రైతన్నలకు సాగు సంబురాన్ని కల్పిస్తున్నాయి. జలవనరుల శాఖ ద్వారా ఇకపై సీఈల నేతృత్వంలోనే మొత్తం సాగు వ్యవస్థ ముందుకు సాగనుంది.logo