ఆయకట్టుకు పచ్చకోక

- ఏడు వేల ఎకరాలకు రామడుగు ప్రాజెక్టు నుంచి సాగునీరు
- కుడి, ఎడమ కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
ధర్పల్లి, జనవరి 8:వరుణుడు కరుణించడంతో.. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిశాయి. ఫలితంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనే మొదటి మధ్యతరహా ప్రాజెక్టు, నాలుగు మండలాల సాగునీటి వరప్రదాయిని అయిన ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు సైతం పూర్తిగా నిండింది. నెల రోజుల పాటు అలుగుపై నుంచి నీరు ప్రవహించింది. వర్షాలు సమృద్ధిగా కురియడంతో వానకాలం సీజన్లో ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అంతగా లేకుండానే పంటలు పండాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు దాదాపు పూర్తిస్థాయిలో ఉండడంతో యాసంగి పంటలకు ఢోకాలేకుండా పోయింది. ప్రాజెక్టు ఆయకట్టు కింద ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీమ్గల్ మండలాల రైతులు పూర్తిస్థాయిలో పంటలు సాగుచేస్తున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 22 కిలోమీటర్ల దూరం మేర రామడుగు, కేశారం, మైలారం, చల్లగర్గె, చింతలూర్, చేంగల్, బడాభీమ్గల్ గ్రామాల్లో 5,500ఎకరాలకు నీరందుతున్నది. ఇటీవల చేపట్టిన ఆధునీకీకరణ పనుల ద్వారా మరో నాలుగు గ్రామాలైన వాడి, కొత్తపల్లి, పచ్చలనడ్కుడ, ఆక్లూర్ గ్రామాల పరిధిలోని పంటలకు కూడా సాగునీరందుతున్నది. ఎడమ కాలువ ద్వారా సుద్దు లం, కొరట్పల్లి, కలిగోట్, మనోహరాబాద్ గ్రామాల్లోని 1500ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
ప్రాజెక్టులో 1276 అడుగుల నీటి నిల్వలు..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278.30 అడుగులు కాగా వర్షాకాలం ఆరంభంలో ప్రాజెక్టులో నీటిమట్టం అత్య ల్ప స్థాయిలో ఉంది. వర్షాలు సమృద్ధిగా కురియడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం 1276.630 అడుగుల నీరు ఉంది. 2016వ సంవత్సరంలో కూడా వర్షాలు ఆలస్యంగా కురిసినా.. కేవలం 36 గంటల్లో పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండింది. గత సంవత్సరం ఆగస్టులో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ప్రారంభం కాగా సెప్టెంబర్ నెలలో పూర్తిగా నిండి నెల రోజుల పాటు అలుగుపై నుంచి నీరు ప్రవహించి కనువిందు చేసింది. ఈయేడాది అక్టోబర్ నెలలో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. నెల రోజుల పాటు మిగులు జలాలు అలుగుపై నుంచి ప్రవహించాయి.
నీటి సామర్థ్యం పెంపుదలతో పెరిగిన విస్తీర్ణం..
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంపుదలతో ప్రస్తుతం ఆయకట్టు విస్తీర్ణం కూడా పెరిగింది. మొదట ఐదువేల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా మూడో పంచవర్ష ప్రణాళికలో నిధులు కేటాయించి 12జూన్ 1961లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. మూడేండ్లుగా కొనసాగిన పనులు జూన్ 1964లో పూర్తయ్యాయి. అప్పటి నుంచి నాలుగు మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. 2006 సంవత్సరంలో రూ.19.83 కోట్లతో ప్రాజెక్టును ఆధునీకరించి ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాలకు నీరందించే విధంగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచారు. ప్రాజెక్టు నీటి నిల్వలు 0.6 టీఎంసీల నుంచి 0.966 టీఎంసీల (1278. 50 అడుగులు)లకు పెరిగింది.
కొనసాగుతున్న నీటి విడుదల..
రామడుగు ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగుకోసం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిసెంబర్ 28న నీటి విడుదలను ప్రారంభించారు. ప్రతి రోజూ కుడి కాలువ ద్వారా 110 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 30 క్యూసెక్కులు, మొత్తం 140 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278.30 అడుగులు కాగా ప్రస్తుతం 1276.630 అడుగుల నీరు ఉంది.
రెండు పంటలకు ఢోకా లేదు..
ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఆయకట్టు కింద ఉన్న 15 గ్రామాల్లో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. రామడుగు గ్రామంలో ఈయేడాది సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వానకాలంలో కూడా పంటలు బాగా పండాయి. ప్రాజెక్టు నిండడంతో భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయి.
-కేఎస్ రాజారెడ్డి, రైతు, రామడుగు గ్రామం.
140 క్యూసెక్కుల నీటి విడుదల..
ప్రస్తుతం ప్రాజెక్టులో 797.516 ఎంసీఎఫ్టీల నీటి నిల్వలు ఉన్నాయి. డిసెంబర్ 28వ తేదీ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా మొత్తం 140 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నాం. యాసంగి పంటలకు సరిపోయే నీటి నిల్వలు ప్రాజెక్టులో ఉన్నాయి.
- సుశీల్ నాయక్,ప్రాజెక్టు ఇన్చార్జి ఏఈ