గురువారం 21 జనవరి 2021
Nizamabad - Jan 07, 2021 , 01:06:48

ఎడతెగని ఎదురుచూపులు

ఎడతెగని ఎదురుచూపులు

వచ్చేయండి ప్లీజ్‌..!

అదృశ్యమైన వారి కుటుంబీకుల ఆవేదన

మిస్టరీగా మిగిలిపోతున్న మిస్సింగ్‌ కేసులు

నిజామాబాద్‌ సిటీ, జనవరి 6 : ఆ కేసులు మిస్టరీగానే మిగిలి పోతున్నాయి. ఒకరి తరువాత మరొకరు అడ్రస్‌ లేకుండా పోతున్నారు. ప్రేమ వ్యవహారం, కుటుంబంలో నెలకొన్న కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇంటికి దూరమవుతున్నారు. కిరాణా దుకాణానికని కొందరు, పాలకని ఇంకొందరు, బంధువుల ఇంటికి వెళ్తున్నామని మరికొందరు.. ఇంటి నుంచి బయిటికి వెళ్తున్నారే తప్ప తిరిగి రావడంలేదు. ఇలా రకరకాల అవసరాల నిమిత్తం వెళ్లి తిరిగి ఇల్లు చేరని వారు ఏటా వందల సంఖ్యలో ఉంటున్నారు. వీరి కోసం ఎదురుచూస్తూ  కుటుంబీకులు రోజులు, నెలలు, ఏండ్లు గడిపేస్తున్నారు. నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రతి ఏటా అదృశ్యం కేసులు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 450కుపైగా మనుషులు కనిపించకుండా పోతున్నారు. ఎవరు, ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నారో పోలీసులకే అంతు చిక్కడం లేదు. మిస్సింగ్‌ అయిన వారంతా మహిళలు, యువతులే కావడం ఆందోళన కలిగిస్తోంది. తమవారు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నారు. ఇదిలా ఉంటే నేరాల నియంత్రణలో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు మిస్సింగ్‌ కేసులు సవాల్‌గా మారుతున్నాయి.

వివిధ కారణాలతో మిస్సింగ్‌

అదృశ్యమైన వారి కోసం కుటుంబసభ్యులు పలు చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సాధ్యమైనంతవరకు పలువురి ఆచూకీని కనుక్కొంటున్నారు. మిగిలిన వారి ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో అదృశ్యం కేసులు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఏండ్లుగా వారి ఆచూకీ తెలియడం లేదు. కుటుంబ కలహాలతో మహిళలు, పురుషులు.. ప్రేమ పేరుతో యువతీ యువకులు ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకొని లేదా మోసపోయి తిరిగి వస్తున్నారు కొందరు. కుటుంబసభ్యులతో గొడవపడి, ఇతర కారణాలతో వెళ్లిపోయిన వారి ఆచూకీ మాత్రం తెలియడం లేదు. పోలీసు స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైన తర్వాత వ్యక్తి వివరాలను ఇతర ఠాణాలకు చేరవేస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకంతో కుటుంబీకులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

మూడేండ్లలో 1,451 మంది అదృశ్యం

జిల్లాలో గడిచిన మూడేండ్లలో అదృశ్యమైన వారిలో బాలురు, బాలికలు, మహిళలు, పురుషులు ఉన్నారు. ప్రతి ఏటా నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 450కిపైగా మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ మిస్సింగ్‌ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్‌ అవుతున్నాయి. మరో 15 శాతం కేసులు మిస్టరీగానే ఉంటున్నాయి. పోలీసులు అధికారికంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం స్పష్టమవుతున్నది. జిల్లాలో గడిచిన మూడేండ్లలో 18 సంవత్సరాలు పైబడి వయస్సు ఉన్న వారు 1,451 మంది అదృశ్యమైనట్లు వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,290 కేసులను పోలీసులు ట్రేస్‌ చేశారు. మిగిలిన 161 కేసులు మిస్టరీగానే మిగిలాయి. 2018లో 442 కేసులు నమోదుకాగా, 406 కేసులు ట్రేస్‌ అవగా, 36 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో 10 శాతం మిస్సింగ్‌ కేసులు పెరిగాయి. ఇందులో 547 మిస్సింగ్‌ కేసులు నమోదుకాగా 498 కేసులు ట్రేస్‌ అవగా, 49 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020లో గత సంవత్సరం కన్నా స్వల్పంగా తగ్గాయి. ఇందులో 462 కేసులు నమోదుకాగా, 386 కేసులు ట్రేస్‌ చేయగా, 76 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇటీవలే నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ విడుదల చేసిన క్రైం రిపోర్టు ద్వారా తెలుస్తున్నది. 

ఇటీవల నమోదైన కేసులు

ఆర్మూర్‌లోని గోల్‌బంగ్లాకు చెందిన అబ్దుల్‌ రహమత్‌పాషా రోజూలాగే నమాజ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు నవంబర్‌30న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నవంబర్‌ 25న మార్కెట్‌కు వెళ్లి వస్తానని తండ్రికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మంగ్తయ్య అరుణ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో నవీపేట్‌ పోలీసు స్టేషన్‌లో ఒకటో తేదీన కేసు నమోదైంది.

నవంబర్‌ 28న వాకింగ్‌ కోసం వెళ్లిన నిజామాబాద్‌ నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్‌కు చెందిన అఖిలేశ్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో డిసెంబర్‌ 1వ తేదీన కేసు నమోదు చేశారు.

డిచ్‌పల్లికి చెందిన మహ్మద్‌ ఆసీఫ్‌ఖాన్‌ నిజామాబాద్‌లో పని ఉందని వెళ్లి తిరిగి రాకపోవడంతో 3వ తేదీన కేసు నమోదైంది.

నగరంలోని పూలాంగ్‌ కాలనీకి చెందిన షేక్‌జాకీర్‌ కనిపించడం లేదని డిసెంబర్‌ 8వ తేదీన నాలుగో టౌన్‌లో కేసు నమోదు చేశారు.

బోధన్‌ పట్టణానికి చెందిన భూమయ్య అనే వృద్ధుడు, మోస్రా మండలానికి చెందిన పుష్ప అనే మహిళ కనిపించడంలేదని డిసెంబర్‌ 12వ తేదీన పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేశారు.

దర్యాపూర్‌ తండాకు చెందిన లత అనే మహిళ కనిపించడం లేదని డిసెంబర్‌ 13న నవీపేట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రెంజర్ల పోశెట్టి అనే వృద్ధుడు కనిపించడంలేదని డిసెంబర్‌ 26న నాలుగో టౌన్‌లో కేసు నమోదు చేశారు.

ఆర్మూర్‌ పట్టణానికి చెందిన గంగు అనే వృద్ధురాలు కనిపించడంలేదని డిసెంబర్‌29న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

అంతుచిక్కని కొన్ని కేసులు

సం. కేసులు ట్రేస్‌ చేసినవి పెండింగ్‌ 

2018 442 406 36

2019 547 498 49

2020 462 386 76 

మొత్తం 1451 1290 161logo