మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Jan 06, 2021 , 01:40:28

‘ప్రగతి’ వెలుగులు

‘ప్రగతి’ వెలుగులు

  • పల్లె, పట్టణాల్లో కరెంటు సమస్యలు దూరం
  • సాకారమవుతున్న సర్కారు లక్ష్యం
  • గ్రామాల్లో వంద శాతం విద్యుత్‌ పనులు పూర్తి

డిచ్‌పల్లి, జనవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో పల్లెలు, పట్టణాల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేగంగా పనులు..

నిజామాబాద్‌ జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు సర్కారు లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి. అన్ని గ్రామాల్లో విద్యుత్‌ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు వేగంగా చేపడుతున్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా లక్ష్యంతోపాటు కరెంటు సమస్యలు పరిష్కరిస్తున్నారు. అటు వ్యవసాయ భూముల్లో ఉండే ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల మరమ్మతులతోపాటు గృహాలకు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎత్తు పెంచడం, విద్యుత్‌ తీగలు కిందికి వేలాడకుండా సరి చేయడం వంటి పనులు పూర్తి చేశారు. 

మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ వెలుగులు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌తోపాటు భీమ్‌గల్‌, ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో భాగంగా జోరుగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారులు పట్టణాల్లోని వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలు విన్నవించే సమస్యలను వెనువెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. రెప్పపాటు కూడా విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. వీధుల్లో ఉండే విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు బిగించి పట్టణాల్లో కాంతులు పెంచుతున్నారు. ప్రతి వార్డులో పారిశుద్ధ్యం, పచ్చదనం, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలు పరిష్కరిస్తున్నారు. 

సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం..

పల్లె ప్రగతిలో భాగంగా గుర్తించిన పనులను విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో వందశాతం పూర్తి చేశాం. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా పనులు ఆలస్యమైనప్పటికీ విజయవంతం పూర్తి చేశాం. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. 

- సుదర్శనం, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, నిజామాబాద్‌ జిల్లా

కరెంటు రంది లేదు..

పల్లె ప్రగతితో ఊళ్లో కరెంటు రంది పోయింది. అప్పట్లో రాత్రిపూట గల్లీల్లో తిరగాలంటే మస్తు భయమైతుండె. కరెంటు ఆఫీసర్లు ఇప్పుడు సమస్యలు తీర్చిండ్రు. ఏలాడుతున్న వైర్లు తీసేసి కొత్తవి వేసిండ్రు. ఎల్‌ఈడీ లైట్లు పెట్టిండ్రు. ఇప్పుడు మా ఊరిని చూస్తుంటే జిగేల్‌ జిగేల్‌ మనిపిస్తుంది. రాత్రి కూడా పగటి మాదిరిగా కనిపిస్తుంది.

-లొక్కిడి విజయ రాములు, సర్పంచ్‌ సీతాయిపేట్‌, ధర్పల్లిlogo