ధర్పల్లి చెరువుకు ట్యాంక్‌బండ్ సొబగులు

- చివరి దశలో పనులు
- కట్టపై రెయిలింగ్, మెటల్ రోడ్డు నిర్మాణం
- త్వరలో అలుగుపై మినీ బ్రిడ్జి
- చెరువులో బోటింగ్ కోసం చర్యలు
ధర్పల్లి, జనవరి 4:ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పనులు చివరిదశలో ఉన్నాయి. కట్టపై రోడ్డుతోపాటు, రెయిలింగ్, ఫుట్‌పాత్ టైల్స్ పనులతో చెరువు నూతన అందాలను సంతరించుకొని కనువిందు చేస్తోంది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి కృషితో రెండు విడుతల్లో నిధులు మంజూరు కాగా, చెరువును అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతోపాటు పంటలకు సాగునీరు అందించేలా చెరువు మరమ్మతులు చేపట్టారు. దీంతో కట్ట కింద సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందనుంది.
రెండు విడుతల్లో నిధులు
ధర్పల్లి-సీతాయిపేట్ మధ్యన ఉన్న పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో మిషన్ కాకతీయలో భాగంగా మొదటి విడుతలో రూ.99.70 లక్షలు, రెండో విడుతల 1.86 కోట్లు మంజూరయ్యాయి. మొదటి విడుతలో నిధులతో కట్ట బలోపేతం, బతుకమ్మఘాట్ నిర్మాణం, పూడికతీత పనులు, తూముల మరమ్మతు పూర్తి చేశారు. రెండో విడుత నిధులతో కట్ట వెడల్పు, చిన్న తూము వైపు మరో బతుకమ్మ ఘాట్, కట్టపై నుంచి వాహనాలు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కట్టపై ఉన్న గంగమ్మ ఆలయం వద్ద పార్కింగ్ కోసం స్థలం కేటాయించారు. కట్టపైకి వెళ్లేందుకు, మిగులు నీరు ప్రవహించేలా కాలువపై మినీ బ్రిడ్జి, కట్ట ఎక్కేందుకు రోడ్డుకు సిమెంట్ గోడ నిర్మాణం, ఇరిగేషన్ కెనాల్ నిర్మాణం, ఫీడర్ చాన్ ప్రొటెక్షన్‌వాల్ నిర్మాణం చేపట్టారు. కట్టపై విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లను బిగించారు. ప్రస్తుతం కట్టకు రివిట్మెంట్ (కట్ట బలోపేతం కోసం రాతి ఫెన్సింగ్), కట్టను 6.5 మీటర్ల వెడల్పు చేయడంతోపాటు, కట్టపై చెరువు నీళ్ల వైపు పర్యాటకులు పడి పోకుండా, సెల్ఫీలు తీసుకునేలా రెయిలింగ్(కంచె) ఏర్పాటు చేశారు. దీంతో కట్ట నూతనశోభను సంతరించుకుంది. పర్యాటకులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. కట్ట అలుగుపై నుంచి వాహనాల రాకపోకల కోసం బ్రిడ్జి నిర్మాణం కోసం అదనపు నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపారు. బోటింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నారు.
500 ఎకరాలకు సాగునీరు..
చెరువు మరమ్మతులు పూర్తికావడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో చెరువు కింద సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందనుంది. మిషన్‌కాకతీయలో భాగంగా చెరువు మరమ్మతులు పూర్తి చేశారు. అదనంగా నిధులు కేటాయించి మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేస్తున్నారు.
తప్పిన మురికి నీటి సమస్య
గతంలో ధర్పల్లి గ్రామంలోని మురికి నీరంతా వచ్చి చెరువులో కలిసేది. ప్రధాన మురికి కాలువ నీటి పారకం చెరువులోకి ఉండడంతో నీరంతా కలుషితమయ్యేది. మురికి కాలువను పోలీసుస్టేషన్ పక్కనే క్వార్టర్స్ నుంచి పెద్ద కాలువ తీసి అలుగు ప్రవహించే నీటితో కలిసిపోయేలా ఏర్పాటు చేశారు. దీంతో చెరువులోకి మురికినీరు చేరడంలేదు. స్వచ్ఛమైన నీటితో సరస్సును తలపిస్తున్నది.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఆయన కృషితోనే ధర్పల్లి చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా మారుతున్నది. చెరువు రెయిలింగ్, ఫుట్‌పాత్ రోడ్డు, దానిపై టైల్స్ వేయడం పూర్తయ్యింది. బ్యాలెన్స్ పనుల కోసం ఎమ్మెల్యే ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
- బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ, ధర్పల్లి
ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..
ధర్పల్లి మినీ ట్యాంక్‌బండ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయంటే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషే కారణం. నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించే ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం. చెరువును సుందరంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
-నల్ల హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, ధర్పల్లి
చాలా ఆనందంగా ఉంది
పెద్ద చెరువుకట్టపై మినీట్యాంక్‌బండ్ పనులు చేపట్టడంపై చాలా ఆనందంగా ఉంది. మినీట్యాంక్బండ్తో చెరువుకు కొత్త కళ వచ్చింది. చెరువుకట్టపైకి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తున్నది. పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయకట్టుకు సాగునీరు అందనుంది. చెరువును ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సారుకు రైతుల తరఫున ధన్యవాదాలు.
-సిరుసు పోతరాజు, రైతు, ధర్పల్లి
తాజావార్తలు
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!
- 26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం