బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 04, 2021 , 03:05:12

వ్యాక్సినేషన్ కు సిద్ధం

వ్యాక్సినేషన్ కు సిద్ధం

  • కరోనా టీకా పంపిణీకి జిల్లా యంత్రాంగం సన్నద్ధత
  • నిజామాబాద్‌ జిల్లాలో 12లక్షల 960 డోసుల వ్యాక్సిన్‌ నిల్వకు అవకాశం
  • అందుబాటులో 135 ఫ్రీజర్‌ బాక్సులు, 84 ఐఎల్‌ఆర్‌, డీప్‌ ఫ్రిజ్‌లు
  • తొలి ప్రాధాన్యం కరోనా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కే..
  • హైరిస్క్‌ ప్రజలకు ముందుగా టీకా..తర్వాతే సామాన్యులకు..
  • సమన్వయానికి జిల్లా, మండల స్థాయిలో కమిటీలు
  • కరోనా తగ్గిందని ఎవరూ నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు
  •  ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి

‘కరోనా వ్యాక్సినేషన్‌కు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధతతో ఉంది. టీకాల కార్యక్రమంపై ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు మొదటి విడుత శిక్షణ పూర్తయ్యింది.  ఫార్మాసిస్టులకు రెండోవిడుత శిక్షణ పూర్తిచేశాం. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే నిల్వ చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇందుకోసం 40 కేంద్రాల్లో 84 ఐఎల్‌ఆర్‌, డీప్‌ఫ్రిజ్‌లు సిద్ధం చేస్తున్నాం. 135 ఫ్రీజర్‌ బాక్సులను అందుబాటులో ఉంచాం. వీటిద్వారా జిల్లాలో 12లక్షల 960 డోసుల టీకా నిల్వకు అవకాశం ఉంది..’ అని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల  వినియోగానికి  డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఏ) ఆదివారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్‌ పలు వివరాలను వెల్లడించారు. తొలిదశలో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన 18వేల మంది వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు టీకా వేయనున్నామని చెప్పారు. మొదటి డోసు తర్వాత 28 రోజులకు రెండో డోసును ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

-నిజామాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు 15,345 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం లక్షా 37వేల 325మందికి పరీక్షలు నిర్వహించాం. మొదట్లో వందల సంఖ్యలో కేసులు రాగా.. ఇప్పుడు 10-20 నమోదవుతున్నాయి.  కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

-నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

నిజామాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరిగ్గా 9 నెలల క్రితం రాష్ట్రంలో, నిజామాబాద్‌ జిల్లాకు వ్యాపించిన కరోనా వైరస్‌ ఒక్కసారిగా విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కనిపించని శత్రువుతో సాగుతున్న పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. సర్కారు మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం పటిష్టవంతంగా పని చేస్తోంది. జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ కరోనా బారి నుంచి వేలాది మందిని రక్షిస్తోంది. మార్చి రెండో వారంలో ఒకరిద్దరితో మొదలైన కరోనా ఏకంగా నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 15వేల 345 మందికి వ్యాప్తిచెందింది. లక్షా 37వేల 325 మందికి పరీక్షలు నిర్వహిస్తే 15వేల మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొదట్లో వందల సంఖ్యలో నమోదైన కేసులు క్రమేపీ తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 10 నుంచి 20 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రపం చ వ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మొదటి విడుతలో 18వేల మందికి, రెండో విడుతలో 3లక్షల 81వేల మందికి, మూడో దశలో సామాన్య ప్రజలకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వెల్లడించారు. 

నమస్తే తెలంగాణ : ప్రస్తుతం జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఏ విధంగా ఉంది. కట్టడి చర్యలేమిటి?

కలెక్టర్‌ : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నాం. కొవిడ్‌-19 బారిన పడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్నాం. నిజామాబాద్‌ జిల్లాలో కొవిడ్‌-19 పరీక్షలు సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. రోజుకు వేయి పరీక్షలు చేసేందుకు వైద్య సిబ్బం ది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు లక్షా 37వేల 325 మందికి పరీక్షలు నిర్వహించగా 15వేల 345 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వైద్య సిబ్బంది ఎల్లవేళలా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సూచనలు ఏంటి?

కరోనా కేసులు తగ్గుతున్నది నిజ మే. అంత మాత్రాన మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా ఇష్టానుసారంగా ఉండడం అనేది సరైంది కాదు. వైరస్‌ మన కోసం కాచుకుని కూర్చుంది. మనం జాగ్రత్తగా లేకుంటే అంటుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు తప్పనిసరిగా మాసులు ధరించాలి. శానిటైజర్‌ వాడాలి. భౌతికదూరం పాటిస్తూనే కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే భారీ నష్టం సంభవిస్తుంది.

కరోనాకు టీకా వచ్చేస్తోంది. కొద్ది రోజుల్లోనే పంపిణీ చేయబోతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎంత మందిని గుర్తించారు?

టీకా వేసే సమయం వచ్చింది. వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి తొలి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా లెక్కలు తీశాం. తొలి దశలో 18వేల మందికి టీకా ఇవ్వబోతున్నాం. ఇందులో వైద్యులు(ప్రభుత్వ, ప్రైవేటు), వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. 

టీకాను నిల్వ చేయడం చాలా సున్నితమైన అంశం. మనకు సరిపడా ఫ్రీజర్లు ఉన్నాయా?

కొవిడ్‌ -19 టీకా అందుబాటులోకి రాగానే జిల్లాలో నిల్వ చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇందుకోసం 40 కేంద్రాల్లో 84 ఐఎల్‌ఆర్‌, డీప్‌ ఫ్రిజ్‌లు సిద్ధం చేస్తున్నాం. 135 ఫ్రీజర్‌ డబ్బాలను అందుబాటులో ఉంచాం. వీటి ద్వారా నిజామాబాద్‌ జిల్లాలో 12లక్షల 960 డోసుల టీకా నిల్వకు అవకాశం ఉంది. నగరంలోనే కేంద్ర ఔషధ నిల్వ కేంద్రంలో రెండు భారీ ఫ్రీజర్లు ఉన్నాయి. వాటిలో టీకాను శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల నిల్వకు కోల్డ్‌ చైన్‌ పాయింట్‌లు ఉన్నాయి. ప్రభుత్వం వాక్‌ ఇన్‌ కూలర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రత్యేక వాహనాల ద్వారా పీహెచ్‌సీలకు టీకాలు పంపిణీ జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. జిల్లాలో కొవిడ్‌ టీకాపై ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు మొదటి విడుత, సూపర్‌ వైజర్లు, ఫార్మాసిస్టులకు రెండో విడుతలో రెండ్రోజులపాటు శిక్షణ ఇచ్చాం. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లకు శిక్షణ ఉంటుంది.

సామాన్య ప్రజలకు టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మొదట ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా అందిస్తాం. తర్వాత హైరిస్క్‌తో ఉన్న బాధితులకు వ్యాక్సిన్‌ వేస్తాం. రెండో దశ టీకా పంపిణీలో 60 సంవత్సరాలు దాటిన వారు, 10 ఏండ్లలోపు పిల్లలు, ఆయా వ్యాధులతో సతమతం అవుతున్న వారు. గర్భిణులు ముఖ్యమైన వారు. వీరి సంఖ్య 3లక్షల 81 వేల వరకు ఉంది. వీరందరూ అయిపోయిన తర్వాత సామాన్య ప్రజలకు టీకా అందుతుంది.

టీకా ఇచ్చేందుకు ఎంత మంది సిబ్బందిని నియమించారు. తీసుకుంటున్న చర్యలేమిటి?

టీకా వేసేందుకు ఇప్పటికే జిల్లాలో నిష్ణాతులైన వైద్య సిబ్బంది మనకు ఉన్నారు. ప్రైవేటు వైద్య సిబ్బంది అవసరం రాకపోవచ్చు. ప్రతి వారం బుధ, శనివారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ప్రభుత్వ దవాఖానలో టీకాలు వేస్తున్నాం. ఏడాదిలో రెండు సార్లు పోలియో వ్యాక్సినేషన్‌ సైతం విజయవంతంగా అందిస్తున్న అనుభవం జిల్లా యంత్రాంగానికి ఉంది. వీరంతా కలిసి సుమారుగా 500 మంది ఉంటారు. వీరితో బృందాలు ఏర్పాటు చేసి టీకాలు వేయిస్తాం. టీకా మొదటి డోసు అందించిన తర్వాత రెండో డోసును 28 రోజులకు ఇవ్వాల్సి ఉంటుంది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఏ) మార్గదర్శకాల ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది.


logo