శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Jan 04, 2021 , 02:57:11

నెలాఖరులోగా టీయూకు వీసీ

నెలాఖరులోగా టీయూకు వీసీ

  • సెర్చ్‌ కమిటీల సమావేశాలకు కసరత్తు
  • సంక్రాంతి తర్వాత షెడ్యూల్‌
  • ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు 

తెలంగాణ యూనివర్సిటీకి వైస్‌చాన్స్‌లర్‌ను నియమించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు జనవరిలోగా వీసీలను నియమిస్తామని సీఎం కేసీఆర్‌ గత నెలలో ప్రకటించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ సైతం 11 వర్సిటీలకు వీసీలను, అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవల వెల్లడించారు. వరుస పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా వీసీల నియామకం పూర్తికానున్నట్లు స్పష్టమవుతున్నది.

-డిచ్‌పల్లి, జనవరి 3

డిచ్‌పల్లి, జనవరి 3 : తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ) నియామకం ఎప్పుడెప్పుడా అన్న ఎదురుచూపులకు త్వరలోనే తెర పడనున్నది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ నెలాఖరులోగా టీయూతోపాటు రాష్ట్రంలోని 11 వర్సిటీలకు వీసీలను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో మార్గం సుగమమైంది. జనవరి నెలాఖరులోగా వర్సిటీలకు వీసీలను ఎంపిక చేస్తామని స్వయంగా కేసీఆరే వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ 11 వర్సిటీలకు వీసీలను, వాటిల్లో ఖాళీగా ఉన్న 1,161 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేస్తామని డిసెంబర్‌ 23న ప్రకటించారు. వరుస పరిణామాలను బట్టి చూస్తే జనవరి నెలాఖరులోగా వీసీల ఎంపిక పూర్తి కానున్నట్లు తేటతెల్లమవుతున్నది. 

త్వరలోనే షెడ్యూల్‌ ఖరారు

టీయూతోపాటు రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటికీ వీసీలను ఒకేసారి ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ప్రకటించారు. అందుకు బీహార్‌ రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అమలుపరుచనున్నట్లు వెల్లడించారు. ఈ వీసీల ఎంపిక కోసం నిర్వహించే ప్రక్రియను చూసేందుకు రాష్ట్ర కాలేజీయేట్‌ విభాగం కార్యదర్శి సునీల్‌ మిట్టల్‌ను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. వీసీల ఎంపికను చూసే సెర్చ్‌ కమిటీ సమావేశాలను నిర్వహించేందుకు సునీల్‌ మిట్టల్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌-19 కారణంగా సెర్చ్‌ కమిటీల మీటింగ్‌లను ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెర్చ్‌ కమిటీల సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రావాల్సి ఉన్న దృష్ట్యా కొవిడ్‌-19 కారణంగా వారి రాకపోకలు ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో వెబ్‌ ద్వారా సభ్యుల సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. ఆ మేరకు సెర్చ్‌ కమిటీలు సూచించిన ముగ్గురి పేర్లతో తుది జాబితాను ప్రభుత్వానికి పంపనున్నారు.

మారిన నిబంధనలు

వర్సిటీలకు వీసీల ఎంపిక కోసం నిర్వహించే ప్రక్రియలో ఈసారి పలు నిబంధనలు మారనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఏ వర్సిటీలో ఉన్న సీనియర్‌ ప్రొఫెసర్లు అయినా అదే వర్సిటీకి వీసీగా ఎంపిక కోసం దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఈసారి ఈ నిబంధనను పూర్తిగా మార్చనున్నట్లు సమాచారం. కచ్చితంగా ఆయా వర్సిటీలకు సంబంధించిన అభ్యర్థులను అదే వర్సిటీకి ఎంపిక చేయవద్దని స్వయంగా సీఎం కేసీఆరే తెలిపినట్లు సమాచారం. దీంతోపాటు గతంలో వీసీలుగా పని చేసిన సామాజికవర్గాల నుంచి కాకుండా ఇతరులను ఎంపిక చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. టీయూలో పని చేసిన వారిలో మొదటి వీసీ ప్రొఫెసర్‌ కాశీరాం బీసీ కాగా ఆ తర్వాత అక్బర్‌ అలీఖాన్‌ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన తర్వాత సాంబయ్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు ముగ్గురే రెగ్యులర్‌ వీసీలుగా పని చేశారు. వీరు కాకుండా ప్రొఫెసర్‌ సాయిలు, లింగమూర్తి, ఐఏఎస్‌లు పార్థసారథి, ప్రవీణ్‌కుమార్‌ ఇన్‌చార్జిలుగా పని చేశారు. ప్రస్తుతం టీయూకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి నీతూకుమారి ప్రసాద్‌ ఇన్‌చార్జి వీసీగా కొనసాగుతున్నారు. ఇక ఈసారి ఏ సామాజిక వర్గానికి వీసీ పదవి వరించనుందో వేచి చూడాలి.

ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం

సెర్చ్‌ కమిటీలు ఎంపిక చేసిన పేర్లతో తుది జాబితాను ప్రభుత్వానికి పంపుతారు. వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేస్తారు. అయితే ఈ వీసీల ఎంపికలో రాష్ట్ర ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం కానుంది. గవర్నర్‌ ఆమోద ముద్ర తర్వాత వీసీల ఎంపిక పేర్లు ఆయా వర్సిటీలకు జారీ అవుతాయి.