కట్టెల కోసం తీసుకెళ్లి.. కడతేర్చాడు!

- ఘన్పూర్ అటవీప్రాంతంలో తల్లీకొడుకు దారుణహత్య
- గొడ్డలితో హతమార్చి అడవిలో పూడ్చిపెట్టిన నిందితుడు
- నాలుగేండ్లుగా మహిళతో సహజీవనం.. వదిలించుకొనేందుకే దారుణం
- మృతురాలు గర్భిణిగా అనుమానాలు
చందూర్, జనవరి 3: బోధన్ డివిజన్ పరిధిలోని చందూర్ మండలం ఘన్పూర్ అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకున్నది. తల్లి, కొడుకును ఒకేసారి హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. హూమ్నాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సుజాత (30), ఆమె రెండేండ్ల కుమారుడు రాము అటవీ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. వీరిద్దరిని హత్యచేసిన చెవిటి రాములు ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోవడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. తల్లీకొడుకులను ఘన్పూర్ అటవీ ప్రాంతంలో దారుణంగా హత్యచేసిన రాములు.. సుజాత మృతదేహాన్ని లోతైన ఒర్రెలో వేసి పైన మట్టి, ఆకులు, కొమ్మలు కప్పివేశాడు. పక్కనే ఆమె రెండేండ్ల కుమారుడి మృతదేహాన్ని మట్టితో కప్పేశాడు. ఈ ప్రదేశం ఘన్పూర్ గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో అడవిలో ఉంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు, నిందితుడు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
ఘన్పూర్ గ్రామానికి చెందిన చెవిటి రాములు నాలుగేండ్లుగా హుమ్నాపూర్ గ్రామానికి చెందిన సుజాతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఘన్పూర్, హుమ్నాపూర్ గ్రామాలు పక్కపక్కనే అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి. సుజాత ప్రతిరోజూ అటవీ ప్రాంతానికి వెళ్లి కట్టెలు సేకరించేది. రాములు ఘన్‌పూర్‌లో పాలేరుగా పనిచేసేవాడు. ఇలా వీరు అడవిలో తరచుగా కలుసుకునేవారు. డిసెంబర్ 31న పథకం ప్రకారం రాములు సుజాతను, ఆమె కుమారుడిని కట్టెల కొడుదామని చెప్పి అడవికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కట్టెలు కొట్టేందుకు తెచ్చిన గొడ్డలితో వారిద్దరినీ హత్యచేసినట్లు పోలీసులతో తెలిపాడు. మృతదేహాలను కప్పిపెట్టిన ప్రాంతాన్ని నిందితుడు పోలీసులకు ఆదివారం చూపించాడు. పొద్దుపోవడంతో మృతదేహాలను సోమవారం వెలికి తీస్తామని పోలీసులు తెలిపారు.
కొడుకు భారం మోయాల్సి వస్తుందనే భయంతో..
సుజాత కుమారుడితో తనకు సంబంధంలేదని, అయితే తన కుమారుడే అని చెప్పి తనపై భారం మోపుతారన్న భయంతోనే నిందితుడు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తున్నది. మృతురాలు గర్భంతో ఉన్నదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31న హత్యకు పాల్పడిన రాములు ఘన్‌పూర్‌లో తన ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. స్థానికులకు అనుమానం వచ్చి నిలదీయగా..నేరాన్ని అంగీకరించాడు. అనంతరం స్థానిక పోలీసులకు లొంగిపోయాడు.
తాజావార్తలు
- స్వాతిలో ముత్యమంత సాంగ్‌ని రీమిక్స్ చేసిన అల్లరోడు-వీడియో
- ఫస్టియర్ ఫెయిలైన వారికి పాస్ మార్కులు!
- సింగరేణిలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు
- అమ్మకు గుడి కట్టిన కుమారులు..
- టర్పెంటాయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడి మృతి
- మాల్దీవుల్లో మంచు లక్ష్మీ రచ్చ.. ఫొటోలు వైరల్
- తదుపరి సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారనున్న అనుష్క..!
- రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
- రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత
- మారిన ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీలు