శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Jan 02, 2021 , 00:48:19

లక్ష ఎకరాల.. లక్ష్యం దిశగా..

లక్ష ఎకరాల.. లక్ష్యం దిశగా..

వడివడిగా మంచిప్ప రిజర్వాయర్‌ పనులు

రూరల్‌ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అందనున్న సాగునీరు

ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ కవిత చొరవతో రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.375 కోట్లు మంజూరు 

ఏడాదిలో వినియోగంలోకి  రిజర్వాయర్‌, పైప్‌లైన్లు 

లక్ష ఎకరాలకు సాగునీరు

చురుగ్గా సాగుతున్న పనులు

రూరల్‌ నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో ఊతం లభించగా.. ప్యాకేజి - 20, 21 కింద మంచిప్ప రిజర్వాయర్‌, సాగునీటి పైప్‌లైన్ల పనులు చురుకుగా సాగుతున్నాయి. రూ.375కోట్ల నిధులతో చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి కానున్నాయి. భూసేకరణతో సంబంధం లేకుండా మధ్యప్రదేశ్‌ తరహాలో భూగర్భ పైప్‌లైన్‌ ద్వారా సాగునీటి సరఫరాకు నిర్ణయించిన ప్రభుత్వం.. పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు ఏకంగా రూ.2248కోట్లు ఖర్చు చేస్తున్నది. మంచిప్ప పంప్‌హౌస్‌ పూర్తయితే రూరల్‌ నియోజకవర్గంలో మొత్తం 1,04,774 ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనికి అనుబంధంగా మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ పనులు కూడా పూర్తయితే బాల్కొండ, మెట్‌పల్లి నియోజకవర్గాల్లోని మరో 150 గ్రామాలకు సాగునీటి రంది లేకుండా రైతులు రెండు పంటలను పండించేందుకు వీలవుతుంది. 

- డిచ్‌పల్లి, జనవరి 1

డిచ్‌పల్లి, జనవరి 1: అన్నదాతల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణానికి వేలాది కోట్ల నిధులు మంజూరు చేస్తున్నది. రూరల్‌ నియోజకవర్గంలోని మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ పచ్చజెండా ఊపారు. ఇందుకోసం రూ.375 కోట్లు మంజూరు చేశారు. అంతేగాకుండా ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమగ్ర సర్వే చేయించి రిజర్వాయర్‌ నిర్మాణంతోపాటు రైతుల భూములకు ఎలాంటి నష్టం కలుగకుండా అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ సహాయంతో సాగునీటి సరఫరా జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి బీడు భూములను సాగులోకి తేవడానికి మంచిప్ప వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.375కోట్లు, అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.2,248 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో మంచిప్ప పెద్ద చెరువు, కొండెం చెరువులను కలుపుతూ నిర్మిస్తున్న రిజర్వాయర్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.  

కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో ఊతం..

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్యాకేజీ-20, 21 పనులు చురుగ్గా సాగుతున్నాయి. 20వ ప్యాకేజీ కింద నవీపేట్‌ మండలంలోని బినోల గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నీటిని నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని సారంగాపూర్‌ గ్రామం వరకు 18కిలో మీటర్లు సొరంగం తవ్వకం పనులు (టన్నెల్‌) పూర్తయ్యాయి. పంపుహౌస్‌ పనులు కొనసాగుతున్నాయి. 20ప్యాకేజీ కింద పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.892 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన మిగిలిన పంపుహౌస్‌ కాలువ నిర్మాణపు పనులు మరో మూడు నెలల్లో పూర్తి కానున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

21ప్యాకేజీ పనులకు రూ.1143.70కోట్లు.. 

21ప్యాకేజీ కింద పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.1143.70 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో టన్నెల్‌ పనులు వేగవంతంగా జరగడంతో చివరి దశకు చేరుకున్నాయి. కొండెం చెరువు పక్కన పంపుహౌస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా.. 

మధ్యప్రదేశ్‌లో కాలువల ద్వారా కాకుండా అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్‌ సహాయంతో సాగునీటి సరఫరా విజయవంతంగా అమలవుతుంది. అదే తరహాలో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 21ప్యాకేజీ కింద కేటాయించిన భూములకు అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ సహాయంతో నీటిని సరఫరా చేసేలా ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. పైపులైన్‌ నిర్మాణానికి రూ.2,248కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కమ్మర్‌పల్లి మండలం నుంచి పైపులైన్‌ నిర్మాణ పనులు ప్రారంభమై బాడ్సి, చిన్నాపూర్‌, కమలాపూర్‌, నర్సింగపూర్‌, ఖిల్లా డిచ్‌పల్లి, ధర్పల్లి మండలాల్లో పనులు కొనసాగుతున్నాయి. అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ ద్వారా సరఫరా చేయడం ద్వారా  నీరు వృథా కాకుండా ఉండడంతో పాటు కాలువల కోసం రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉండదు. కాలువల ద్వారా నీటి సరఫరా జరిగితే చిన్న, సన్నకారు రైతులు 5వేల ఎకరాల భూములను కోల్పోవాల్సి వచ్చేది. రైతులు తమ భూములను కోల్పోకుండా అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ సహాయంతో నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. పైపులైన్‌ ద్వారా సాగునీటి సరఫరా జరగడంతో ప్రభుత్వంపై అదనంగా రూ.15వందల కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పైపులైన్‌ సహాయం ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 

రిజర్వాయర్‌ నుంచి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు.. 

మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణంతో పాటు పైపులైన్‌ సహాయంతో నీటి సరఫరా పనులన్నీ పూర్తయితే నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో 1821ఎకరాలకు, డిచ్‌పల్లిలో 19,439, మోపాల్‌లో 15,557, జక్రాన్‌పల్లిలో 14,419ఎకరాలకు, ఇందల్వాయిలో 12,598ఎకరాలకు, ధర్పల్లిలో 21,199ఎకరాలకు, సిరికొండలో 19,741ఎకరాలతో కలిపి మొత్తం 1,04,774ఎకరాలకు మంచిప్ప పంప్‌హౌస్‌ నుంచి సాగునీరు సరఫరా జరుగనుంది. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, వేల్పూర్‌, ఆర్మూర్‌, మాక్లూర్‌, జగిత్యాల్‌ జిల్లాలోని మెట్‌పల్లి నియోజకవర్గంలోని 150గ్రామాలకు చెందిన లక్ష ఎకరాల భూములకు డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ నుంచి సాగునీరు సరఫరా కానుంది.

గోదావరి నీటి మళ్లింపునకు లిఫ్ట్‌ చేసే విధానం.. 

నవీపేట్‌ మండలంలోని బినోల నుంచి గోదావరి నీటిని టన్నెల్‌(సొరంగం) ద్వారా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని సారంగాపూర్‌ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌కు తరలిస్తారు. ఇక్కడి నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి నిజాంసాగర్‌ ప్రధాన కాలువలకు మళ్లిస్తారు. ఈ కాలువ ద్వారా న్యాల్‌కల్‌ మాసాని చెరువులోకి నీరు చేరుతుంది. ఈ చెరువు నుంచి నీటిని మళ్లీ న్యాల్‌కల్‌ వద్ద గల నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి మళ్లిస్తారు. ప్రధాన కాలువ 1.3కిలోమీటర్లు దాటిన తర్వాత రెగ్యులేటర్‌ నిర్మించి ఇక్కడి నుంచి మోపాల్‌, సిర్పూర్‌, నర్సింగ్‌పల్లి, ముదక్‌పల్లి శివారు గుండా టన్నెల్‌ ద్వారా మంచిప్ప వద్ద ఉన్న కొండెం చెరువుకు నీరు చేరుతుంది. ఇక్కడి నుంచి 21ప్యాకేజీ కింద ఉన్న లక్ష ఎకరాల భూములకు అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్‌ సహాయంతో నీటిని సరఫరా చేస్తారు. ఇదే ప్యాకేజీ కింద డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి నిజాంసాగర్‌ ప్రధాన కాలువ వద్ద మరో రెగ్యులేటర్‌ను నిర్మించి పైపులైన్‌ సహాయంతో 1.10లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకుంటారు. 

రిజర్వాయర్‌తో నియోజకవర్గం సస్యశ్యామలం.. 

నియోజకవర్గంలోని బీడు భూములకు సాగునీరు అందించడమే ఏకైక లక్ష్యం. మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయితే రూరల్‌ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారుతుంది. ఏడాదిలోగా రిజర్వాయర్‌తో పాటు పైప్‌లైన్‌ పనులు పూర్తయి భూములకు సాగునీరు అందనుంది. దశాబ్దాల కల ఇక త్వరలోనే నెరవేరబోతుందని రైతులు కూడా సంతృప్తితో ఎదురు చూస్తున్నారు. 

-బాజిరెడ్డి గోవర్ధన్‌,ఎమ్మెల్యే, నిజామాబాద్‌ రూరల్‌.

ఏడాదిలోగా పనులు పూర్తి.. 

మంచిప్ప రిజర్వాయర్‌తో పాటు భూములకు సాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్‌ పనులన్నీ 2022 జనవరి నెలాఖరు వరకు పూర్తవుతాయి. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. రైతులకు పంట నష్టం జరుగకుండా సాగునీరు సరఫరా చేయడానికి వేస్తున్న అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ పనులను పొలాల్లో పంట లేనప్పుడు మాత్రమే చేపట్టాల్సి వస్తుంది. ఈ పనులన్నీ పూర్తయితే రూరల్‌ నియోజకవర్గంతో పాటు బాల్కొండ, మెట్‌పల్లి నియోజకవర్గాల్లో ఉన్న 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. 

-శ్రీధర్‌, ఈఈ, కాళేశ్వరం ప్రాజెక్టు.


logo