సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Jan 02, 2021 , 00:48:19

పంట రక్షణకు మైకు కేకలు!

పంట రక్షణకు మైకు కేకలు!

అటవీ జంతువుల నుంచి పంట రక్షణకు మైకుల ఏర్పాటు

కుక్కల అరుపులతోపాటు మనుషుల మాటలు రికార్డు

పంట చేలల్లో మైకులు అమర్చుకుంటున్న రైతులు

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను అటవీ జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు రైతులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారాలు వినియోగించే రికార్డింగ్‌ మైక్‌సెట్లను రైతులు అటవీ జంతువుల నుంచి పంటలను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లభిస్తున్న రికార్డింగ్‌ మైక్‌సెట్లలో కుక్కల అరుపులతోపాటు, మనుషుల అరుపులను రికార్డింగ్‌ చేసి పంట చేలల్లో అమర్చుతున్నారు. రాత్రి వేళల్లో రికార్డింగ్‌ మైకుల నుంచి వచ్చే కుక్కల అరుపులతోపాటు, మనుషుల కేకలు విని అటవీ జంతువులు చేలల్లోకి రావడంలేదు. 

గాంధారి, జనవరి 1 :

గాంధారి మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారు. రైతులు తమ పంట భూముల్లో ఎక్కువగా మక్క, జొన్న, శనగ, వేరు శనగ, గోధుమ, వరితోపాటు కూరగాయలు సాగు చేస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో వ్యవసాయ భూములు అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నాయి. దీంతో అటవీ జంతువులు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటి బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు చేను చుట్టూ కంచెలు, చీరలతోపాటు గాజు సీసాల చప్పుడు వచ్చేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినప్పటికీ అటవీ జంతువుల బెడద తప్పడంలేదు. ప్రస్తుతం చాలా మంది రైతులు వీటికి ప్రత్యామ్నాయంగా రికార్డింగ్‌ మైకులను చేలల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు.

పెరిగిన మైక్‌ సెట్ల వినియోగం

అటవీ జంతువుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు మైక్‌సెట్లను వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన మైకుల ధరలు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. మెమోరీ కార్డులో కుక్కలు, మనుషుల అరుపులను రికార్డు చేయిస్తున్నారు. రికార్డింగ్‌ మైక్‌సెట్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీన్ని ఆన్‌ చేస్తే నిరంతరాయంగా 5 నుంచి 6 గంటల వరకు పనిచేస్తుంది. 

అటవీ జంతువుల బెడదకు చెక్‌

రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి రికార్డింగ్‌ మైక్‌సెట్లలో కుక్కల అరుపులు, మనుషుల కేకలను రికార్డు చేయిస్తున్నారు. పంట చేనులో ఏర్పాటు చేస్తున్న మైకులో కుక్కల అరుపులు వినిపిస్తుండడంతో నిజంగానే పంట చేనులో కుక్కలు ఉన్నాయేమోననే భ్రమ కలుగుతుంది. దీనికి తోడు మధ్య మధ్యలో మనుషుల కేకలు వస్తుండడంతో పగటి పూట కోతులు, పక్షులు, రాత్రి వేళల్లో అడవి పందులు పంట చేనుపై దాడి చేయడంలేదు.

గతంలో పడరాని పాట్లు

రైతులు తాము సాగు చేస్తున్న పంటలను కాపాడుకోవడం కోసం గతంలో పడరాని పాట్లు పడేవారు. పగటి పూట కోతులు, పక్షుల నుంచి, రాత్రి పూట అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి కాపలా కోసం వెళ్లే వారు. చాలా సార్లు కోతులు, పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను తీవ్రంగా నష్టపరిచేవి. కొందరు రైతులు పంటను కాపాడుకోవడం కోసం మైక్‌సెట్‌లను ఏర్పాటు చేసుకొని అటవీ జంతువులు వచ్చే సమయంలో ఆన్‌ చేస్తున్నారు.

అడవి పందులు రావడం లేదు..

యాసంగిలో మక్క పంటతోపాటు, కూరగాయలను సాగు చేశాను. అడవి పందులు పంటలపై దాడి చేసి నష్టపరుస్తున్నాయి. వీటి బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి రికార్డింగ్‌ మైక్‌సెట్‌ను కొనుగోలు చేసి, చేనులో ఏర్పాటు చేశాను. మైక్‌సెట్‌ నుంచి కుక్కల అరుపులు, మనుషుల కేకలు వస్తుండడంతో అడవి పందులు రావడం లేదు.

-తాడ్వాయి సాయిలు, రైతు, గాంధారి

కుక్కల అరుపులతో జంతువులు పరార్‌

మక్క, కంది పంట సాగు చేస్తున్న. పంటలను కోతులు, అడవి పందుల బారి నుంచి రక్షించుకోవడానికి చేనులో మైక్‌సెట్‌ను ఏర్పాటు చేశా. మైకు నుంచి కుక్కల అరుపులు, మనుషుల కేకలు వస్తుండడంతో ప్రస్తుతం చేనులోకి కోతులు, అడవి పందులు రావడం లేదు.

-ఆకుల లక్ష్మణ్‌, రైతు, గాంధారిlogo