మారనున్న ముఖచిత్రం 2021

- కొత్త ఏడాదిలో ప్రజల ముంగిటకు అభివృద్ధి ఫలాలు
- ప్రారంభం కానున్న సమీకృత కలెక్టరేట్లు, కామారెడ్డి పోలీసు భవనం
- మంత్రి వేముల చొరవతో వేగంగా ప్యాకేజీ-20, 21, 22 పనులు
- శరవేగంగా ఐటీ టవర్ పనులు
- పూర్తి కానున్న ఎస్సారెస్పీ పునర్జీవం ముప్కాల్ పంప్‌హౌస్
- పర్యాటక ప్రాంతాలుగా నిజామాబాద్ మినీ ట్యాంక్‌బండ్.. ఆర్మూర్ సిద్ధుల గుట్ట
2020 సంవత్సరం గడిచింది. చూస్తుండగానే కరోనాతో సహజీవనం దాదాపుగా 9నెలలు పూర్తయ్యింది. గత ఏడాదంతా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నెన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. ఈ కొత్త సంవత్సరంలో ఆశలు, ఆశయాలన్నీ నెరవేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 2021లో కరోనాకు విరుగుడు దక్కాలని, ప్రజలంతా క్షేమంగా బయట పడాలనే దృక్పథంతోనే ముందడుగు వేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులు మనుగడలోకి రాబోతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ కోసం నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్లు, నిజామాబాద్ యువత ఉపాధి కోసం నెలకొల్పిన ఐటీ టవర్ ప్రారంభోత్సవం తథ్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 22 పనులు వేగంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. అభివృద్ధి వెలుగుల్లో ఉభయ జిల్లాలు విరాజిల్లనున్నట్లుగా స్పష్టమవుతున్న వేళ.. ఉమ్మడి జిల్లాలో చివరి దశకు చేరిన పనులపై ప్రత్యేక కథనం.
-నిజామాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వైట్‌హౌస్‌ను తలపించేలా కామారెడ్డి పోలీస్ భవనం
రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో పోలీసు భవనాల నిర్మాణానికి అంకురార్పణ జరుగగా.. కామారెడ్డి జిల్లాలో పూర్తయ్యింది. 2021 ఆరంభంలోనే ఇది అందుబాటులోకి రానుంది. రూ.15కోట్లతో జాతీయ రహదారి 44ను ఆనుకొని దీన్ని నిర్మించారు. వైట్‌హౌస్‌ను తలపించేలా నిర్మించిన జిల్లా పోలీసు అధికారి కార్యాలయ భవనం రాజసంతో ఉట్టిపడుతోంది. పోలీస్ సేవలకు ప్రతీకగా నిలిచే మూడు సింహాల చిహ్నాన్ని భవనంపై తీర్చిదిద్దారు. సుప్రీంకోర్టు భవనంపై కనిపించే గ్లోబ్ ఆకారంలోని నిర్మాణం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ప్రతిబింబించేలా చేపట్టారు. ఆరు భారీ స్తంభాలతో ఎస్పీ నూతన కార్యాలయం ముందు భాగం విశేషంగా ఆకట్టుకుంటోంది. చూడగానే గౌరవం పెరిగేలా, పోలీసు దర్పానికి ఈ భవనం అద్దం పడుతోంది. ఈ నిర్మాణాన్ని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా చేపట్టారు. పోలీసు భవనంలో సకల వసతులు కల్పించారు. పోలీస్ శాఖ అన్ని విభాగాలు ఇందులోనే ఇమిడి ఉంటాయి.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దిగువకు వృథాగా పోతున్న గోదావరి నదీమతల్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త నడకను నేర్పించారు. నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ పని చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు గోదావరి నీళ్లను లిఫ్టుల ద్వారా తీసుకురావడానికి ఉద్దేశించిన ప్యాకేజీ-20, 21 పనులు పురోగతిలో ఉన్నాయి. దీని ద్వారా ఆర్మూర్ నియోజకవర్గంలో 7వేలు, బాల్కొండ నియోజకవర్గంలో 80 వేలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్షా 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ-21బీలో భాగంగా నిజాంసాగర్ కెనాల్ నుంచి వచ్చే నీరు మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ నుంచి 650 క్యూసెక్కుల సామర్థ్యంతో పైప్‌లైన్ ద్వారా ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు అందివ్వనున్నారు. మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్యాకేజీ- 21ఏలో గడ్కోల్ పంప్‌హౌస్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఆర్మూర్ నవసిద్ధుల గుట్టకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగానూ విరాజిల్లుతున్నది. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నవసిద్ధుల గుట్టను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణ కమిటీకి సహాయ, సహకారాలు అందిస్తూ ప్రభుత్వం ద్వారా అండగా నిలుస్తూ ఘాట్ రోడ్డును అధునాతనంగా నిర్మిస్తున్నారు. మలుపులు తిరుగుతూ వాహనాలు నేరుగా గుట్టపైకి వెళ్లేందుకు వీలుగా తారు రోడ్డును వేస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం 2021లో పూర్తయ్యి అందుబాటులోకి రానుందని ప్రజలు భావిస్తున్నారు.
సిద్ధుల గుట్టకు ఘాట్‌రోడ్డు ఇందూరు మినీ ట్యాంక్‌బండ్
నిజామాబాద్ నగరాన్ని 2020లో సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చొరవతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో ప్రధాన రహదారుల గుండా డివైడర్లు ఏర్పాటు అయ్యాయి. ఎల్ఈడీ వీధి దీపాలతో నగరం రాత్రి వేళల్లో సుందరంగా కనిపిస్తోంది. దీనికి తోడుగా నిజామాబాద్ శివారులో నగర ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌బండ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు పూర్తిచేసి నూతన సంవత్సరంలో అందుబాటులో తేనున్నారు.
సాగుకు సంజీవని నాగమడుగుల
నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతమైన మంజీరపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సాగునీరు లేక అల్లాడిన అన్నదాతలంతా ఈ భారీ ప్రాజెక్టుతో తమకు ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావంతో ఉన్నారు. వెనుకబడిన జుక్కల్ ప్రాంతంలో ఈ భారీ నీటిపారుదల పథకంతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యవసాయానికి రెండు పంటలకు సాగునీరు అందనుంది. ఆదాయ మార్గాలు సైతం పెరగనున్నాయి. గత ప్రభుత్వాలు ఇక్కడి రైతుల ఇబ్బందులను కళ్లారా చూసినా వారి అవసరాలను గుర్తించలేదు. స్థానిక ఎమ్మెల్యే నీటిపారుదల శాఖలో ఇంజినీరు కావడంతో లిఫ్ట్ ఇరిగేషన్, బ్యారేజీ నిర్మాణంపై యుద్ధప్రాతిపదికన కసరత్తు చేసి సీఎం కేసీఆర్‌తో ప్రాజెక్టును ఆమోదింపజేశారు. నిజాంసాగర్ మండలం జక్కాపూర్ - మల్లూర్ గ్రామాల సమీపంలో నాగమడుగుల ఎత్తిపోతల పథకం, మంజీరా నదిపై బ్యారేజీ నిర్మాణాలకు రూ.476.25 కోట్లు ఖర్చు అవుతుంది. భూసేకరణ అవసరం లేకుండానే ఈ ప్రాజెక్టు చేపడుతుండడం విశేషం. 2020లో సర్వే పూర్తి కాగా డీపీఆర్ సైతం జల వనరుల శాఖ రూపొందించింది. టెండర్లు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ పథకం 2021లో కార్యరూపం దాల్చనుంది.
ఇందూరు సిగలో ఐటీ టవర్
నిజామాబాద్ జిల్లాలో ఐటీ సంస్థల కార్యకలాపాలు కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో మంజూరైన ఐటీ హబ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఎంపీగా ఉన్నప్పుడే నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ఐటీ హబ్‌కు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారు. సువిశాల ప్రాంతంలో ఈ ఐటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐటీ టవర్‌ను అనతికాలంలోనే పూర్తిచేసేలా కృషి చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నారు. రూ.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2018, ఆగస్టు 1వ తారీఖున భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్తుల్లో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు.
వికేంద్రీకరణకు ప్రతీకలు
సుపరిపాలనే ధ్యేయంగా ఆవిర్భవించిన నూతన జిల్లాల్లో పరిపాలన భవంతుల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 2021లో కొత్త కలెక్టరేట్ నుంచే పరిపాలన సాగనుంది. నిజామాబాద్ శివారులోని గిరిరాజ్ కళాశాల వెనుక భాగంలో బైపాస్ రోడ్డులో, కామారెడ్డి జిల్లా అడ్లూర్‌లో జాతీయ రహదారి 44కు కూతవేటు దూరంలో నిర్మితమైంది. బహుళ అంతస్తుల నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణానికి అక్టోబర్ 11, 2017న పునాదిరాయి పడింది. ఆధునిక సొబగులతో కూడిన ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. భవనాన్ని 1,59,307 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం 53,940 చదరపు అడుగులు, మొదటి అంతస్తు విస్తీర్ణం 50,874 చదరపు అడుగులు, రెండో అంతస్తు 54,493 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వాస్తుకు అనుకూలంగా భవన నమూనా రూపొందించారు.
కామారెడ్డి దశను మార్చనున్న ప్యాకేజీ- 22
కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలించేందుకు ప్యాకేజీ-22 పనులను శరవేగంగా చేపడుతున్నారు. కాలువలు, అప్రోచ్ కాలువలు, సొరంగాల పనులు చకచకా సాగుతున్నాయి. ఇందులో భూంపల్లి జలాశయం ముఖ్యమైనది. ప్యాకేజీ -22 కింద ఆయకట్టు 1.84 లక్షల ఎకరాలు స్థిరీకరించనున్నారు. ప్యాకేజీ -22 కోసం 2,921 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. సగానికిపైగా పూర్తయ్యింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం అమ్రాద్ కొండెం చెరువు నుంచి 1.9 కిలో మీటర్ల మేర అప్రోచ్ కెనాల్ తవ్వి 5.5 కిలో మీటర్ల మేర టన్నెల్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అర కిలో మీటరు టన్నెల్ తవ్వారు. కాలువల తవ్వకాలు జరుగుతున్నాయి. నూతన సంవత్సరంలో ఈ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్‌తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి