సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Jan 01, 2021 , 03:40:10

నిధుల మంజూరుకు కౌన్సిల్‌ ఆమోదం

నిధుల మంజూరుకు కౌన్సిల్‌ ఆమోదం

బోధన్‌, డిసెంబర్‌ 31 : పట్టణంలో మురుగు కాల్వలు, నీటిపారుదల శాఖ కాల్వలపై సీసీ కల్వర్టులు, రోడ్ల నిర్మాణం, శ్మశాన వాటికలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ తదితర అభివృద్ధి పనులకు నిధులను మంజూరుచేస్తూ బోధన్‌ మున్సిపల్‌ సమావేశంలో తీర్మానించారు. గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మావతి అధ్యక్షత వహించారు. సమావేశంలో 92 అంశాలతో కూడిన ఎజెండాను, మరో 30 అంశాలతో కూడిన అదనపు ఎజెండాను ప్రవేశపెట్టగా, కౌన్సిలర్లు ఆయా అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం చైర్‌పర్సన్‌ పద్మా వతి, వైస్‌ చైర్మన్‌ ఎహెతేషాం, కమిషనర్‌ రామలింగం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమావేశం తీ ర్మానాలను వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం పారిశుద్ధ్య విభాగంలో 60 ఏండ్లు నిండిన, పనిచేయలేని స్థితి లో ఉన్న కార్మికులను తొలగించి, వారి కుటుంబసభ్యులను నియమించాలని నిర్ణయించారు. అవుట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులు చనిపోయిన సందర్భాల్లో అంత్యక్రియల కోసం రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ నిధుల నుంచి ఇచ్చేందుకు సమావేశం ఆమోదం తెలిపింది. మున్సిపల్‌ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి వారసులను కారుణ్యనియామకాల కింద ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఏడుగురు సభ్యులతో ఒక ప్యానెల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెక్కి, పాండు చెరువుల అభివృద్ధి, శక్కర్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, డం పింగ్‌ యా ర్డు అభివృద్ధి పనులను డీపీఆర్‌లను తయారుచేసేందుకు ఈఐ వో పిలిచేందుకు సమావేశం ఆమోదం తెలిపింది.


logo