బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 31, 2020 , 01:14:49

వలస జీవులకు భరోసా

వలస జీవులకు భరోసా

  • కష్టకాలంలో అండగా నిలిచిన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు 

ఆర్మూర్‌ :కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకుంటున్న సమయంలో ఎందరో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలవారు ఉదారతను చాటారు. వారికి ఆహారం, వసతులు కల్పించి అండగా నిలిచారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ర్టాల్లో ఉపాధి పొందుతున్న వారు స్వగ్రామాలకు పయనమయ్యారు. ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో వారికి నడకే శరణ్యమయ్యింది. ఒకటి కాదు రెండు కాదు వందల కిలో మీటర్లు నడిచి తమ ప్రాంతాలకు చేరుకున్నారు. పిల్లా పాపలతో ఎడతెగని నడక సాగించారు. కాళ్లకు చెప్పులు అరిగేలా వారి పయనం కొనసాగింది. వలస కార్మికులు ఆకలి దప్పులకు అవస్థలు పడ్డారు. దొరికిన చోట తిన్నారు. లేకుంటే పస్తులున్నారు. పొద్దు పోగానే రోడ్డు పక్కనే నిద్రపోయారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మీదుగా జాతీయ రహదారి గుండా నిత్యం వందలాది మంది కార్మికులు కాలినడనక వెళ్తూ కనిపించారు. ఇలాంటి వారికి చేయూతనిచ్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. పలు చోట్ల నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి వెంట శిబిరాలు ఏర్పాటు చేసి అన్నసత్రాలు నిర్వహించారు. వలస కార్మికుల ఆకలి తీర్చి పెద్ద మనసును చాటుకున్నారు. కొందరు ఆహార పొట్లాలను తయారు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారి వద్దకు వెళ్లి అందజేశారు. భిక్షాటన చేసేవారు, కూలీ నాలీ చేసుకునే వారి వద్దకు వెళ్లి ఆహార ప్యాకెట్లు అందజేశారు. వస్తు రవాణా వాహనాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వడంతో వలస కార్మికులకు కొంత మేర ఉపశమనం లభించినైట్లెంది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు ముందుండి వారికి అండగా నిలిచారు. వాహనాల్లో వెళ్లేందుకు సహాయ పడ్డారు. వలస కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఉచితంగా బియ్యం, నగదును అందజేసింది. అధికారులు వలస కార్మికుల వద్దకు వెళ్లి వీటిని అందజేశారు. వారికి ఆశ్రయం కల్పించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇబ్బందులు పడ్డవారికి వసతి కల్పించి ఆహారాన్ని అందించారు. 

కరోనా ‘పరీక్ష’

మనుషుల మధ్య బంధాలు, బంధుత్వాలు, మానవత్వానికి కరోనా పరీక్ష పెట్టింది. కడుపున పుట్టినోళ్లు, తోడబుట్టినోళ్లు, కట్టుకున్నోళ్లు సైతం కరోనా భయంతో వివక్షను చూపించారు. అయినవాళ్లు, బంధుప్రీతి కలిగిన వాళ్లు సైతం దగ్గరికి రాలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు స్వచ్ఛంద సంస్థలు కరోనా బాధితులకు అండగా నిలిచాయి. పోలీసు, వైద్య సిబ్బందికి ఏమాత్రం తీసిపోని విధంగా కరోనా బాధితులు, వలస కార్మికులకు బాసటగా ఉన్నాయి. హోం ఐసొలేషన్‌ సెంటర్లలో కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులకు నిత్యావసర సరుకులు, మందులు, శానిటైజర్లను అందిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపాయి. కరోనా కష్టకాలంలో పేదలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వారు లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి రోజు గడవడానికి అవస్థలు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వలస కార్మికులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు బాసటగా నిలిచి తోడ్పాటునందించారు. కరోనా ఆపత్కాల సమయంలో మేమున్నామంటూ భరోసా కల్పించి వారికి అండగా నిలిచారు.   


logo