‘ఎఫ్ఏక్యూ’తో కడ్తాకు కళ్లెం

- కడ్తా లేకుండా ధాన్యం బస్తాలను స్వీకరించిన రైస్‌మిల్లర్లు
- నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ
- ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
- జిల్లావ్యాప్తంగా 445 కొనుగోలు కేంద్రాల ద్వారా 571 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
- 275 రైస్‌మిల్లులకు ధాన్యం బస్తాల తరలింపు
నిజామాబాద్ రూరల్ :వానకాలం సీజన్లో అన్నదాతలు పండించిన వరిధాన్యం కడ్తా (తరుగు) లేకుండా రైస్‌మిల్ యజమానులు స్వీకరించే విధంగా నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో తొలిసారిగా అమలు చేసిన ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ) సర్టిఫికెట్ జారీ ఎంతగానో దోహదపడింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జిల్లాలో సొసైటీ, ఐకేపీ, మెప్మా తరఫున 445 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించారు. కొంతమంది రైస్‌మిల్లర్లు ఇష్టారాజ్యంగా కడ్తా తీస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో వానకాలం సీజన్లో వరి పంట చేతికి వచ్చే సమయానికి ముందుగానే కలెక్టర్ వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ, సహకార శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సారి కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలించినప్పుడు కడ్తా పేరిట తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మిల్లర్లతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించి కడ్తా పేరిట ధాన్యం తరుగు తీయొద్దని సూచించారు. ఇందుకు మిల్లర్లు కూడా స్పందిస్తూ తర్ర లేకుండా, శుభ్రపరిచిన ధాన్యాన్ని తీసుకువస్తే కడ్తా లేకుండానే ధాన్యం బస్తాలను స్వీకరిస్తామని మిల్లర్లు కూడాఅంగీకరించారు. కడ్తా కారణంగా రైతులు నష్టపోవద్దనే ఆలోచనతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లోనే వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ(ఎఫ్ఏక్యూ) జారీ చేసేలా ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు విక్రయించడానికి తెచ్చిన ధాన్యాన్ని కుప్పలాగా పోయగా వాటిని పరిశీలించి ఏఈవో ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలించినప్పుడు మిల్లర్లు కడ్తా లేకుండా స్వీకరించారు. ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ జారీ చేసినా కడ్తా తీసుకుంటే ఆ మిల్లుపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే మిల్లు సీజ్ చేయాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరికలు కూడా జారీచేశారు.
బాధ్యతను గుర్తించిన రైతులు
వరి నారు నాటినప్పటి నుంచి పంట కోత దశకు వచ్చేంత వరకు ఓపికతో శ్రమించిన రైతులు కోసిన అనంతరం కొంతమంది ధాన్యాన్ని సరిగ్గా శుభ్రపర్చకుండానే కొనుగోలు కేంద్రం వద్దకు ఇంతకుముందు తెచ్చేవారు. కానీ ఈసారి రైతులు కూడా తమ వంతు బాధ్యతను పూర్తిగా నిర్వర్తించారు. యంత్రాల సహాయంతో వరి పంటను కోయగానే కలెక్టర్ సూచన మేరకు ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి శుభ్రపరిచిన అనంతరం కొనుగోలు కేంద్రాల వద్దకు విక్రయించేందుకు తీసుకవచ్చారు. దీంతో ఏఈవోలు ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో కడ్తా లేకుండానే ధాన్యం బస్తాలను మిల్లర్లు స్వీకరించారు. ఫలితంగా జిల్లా రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
571 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ధాన్యం సేకరణ జిల్లాలో సజావుగా సాగేందుకు కలెక్టర్‌తో పాటు అధికారులూ నిరంతరం పర్యవేక్షించారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 571 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 275 రైస్‌మిల్లులకు తరలించారు. ధాన్యం విక్రయించిన లక్షా 994 మంది రైతులకు రూ.1,020 కోట్ల బిల్లులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
రైతులకు వెన్నుదన్నుగా..
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం కడ్తా లేకుండా మిల్లులకు తరలించడంతో పాటు వరి కోత సమయంలోనూ కలెక్టర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. హార్వెస్టర్ల యజమానులు వరి పంటను కోసేందుకు ఎకరానికి రూ. మూడు వేల పైచిలుకు డబ్బులను గంటకు తీసుకునేవారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి రాగా ఎకరానికి గంటకు రూ.2,500 లు మించి వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. దీంతో వరికోతల సమయంలో హార్వెస్టర్ల యజమానుల ధరలను నియంత్రించడంతో పాటు కడ్తా లేకుండా ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించే విధంగా చర్యలు తీసుకున్న కలెక్టర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు.
గతంలో 2 నుంచి5 కిలోల వరకు కడ్తా
గతంలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం బస్తాల నుంచి క్వింటాలుకు 2 నుంచి 5 కిలోల వరకు మిల్లర్లు కడ్తా తీసుకునే వారు. కడ్తా కారణంగా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చేది. ఈ తరుణంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి కడ్తాను అరికట్టడంలో సఫలీకృతులయ్యారు.
కడ్తా బాధ తప్పింది
గుండారం సొసైటీ పరిధిలో ఈసారి లక్షా 30వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కలెక్టర్ చొరవతో కడ్తా లేకుండా ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాం. ఈ సీజన్లో కడ్తా తీసుకోకపోవడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది పూర్తి సహకారమందించారు. కడ్తాను అరికట్టినందుకు రైతుల పక్షాన కలెక్టర్‌కు కృతజ్ఞతలు.
-దాసరి శ్రీధర్, గుండారం సొసైటీ చైర్మన్