ఫ్యామిలీ పంచ్

తైక్వాండోలో రాణిస్తున్న కుటుంబం
జాతీయ స్థాయిలో వరించిన పతకాలు
విద్యార్థులకు శిక్షణలో మెళకువలు
ప్రత్యర్థిపై పిడుగుల వర్షం.. ఆపకుండా పంచులు ఇవ్వడం.. అమాంతం గాల్లో తేలిపోవడం.. కాలుపైకెత్తి తలపై కిక్ ఇవ్వడం.. జంప్ చేస్తూ.. గిరగిరా తిరుగుతూ పంచ్ ఇస్తూ.. ప్రత్యర్థిని గుక్కతిప్పుకోకుండా చేసి విజయం సాధించడం అంత ఆశామాషీ కాదు.. ఎంతో కఠోర సాధన ఉంటే తప్ప తైక్వాండోలో రాణించలేరు. ఈ యుద్ధకళలో ఒక కుటుంబం మొత్తం రాణిస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. భార్యా భర్త, ఇద్దరు కుమారులు ఈ ఆటలో నైపుణ్యం సాధించి ఔరా..! అనిపిస్తున్నారు.
ఇందూరు :
తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కుమారు తైక్వాండోలో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మనోజ్‌కుమార్ ఆప్తమెట్రిస్ట్ (కంటివైద్య సహాయ నిపుణుడు)గా, సిద్ధార్థ మెడికల్ కళాశాలలో డీవోఏ అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. తైక్వాండోతోపాటు సాండ్ ఆర్ట్‌లోనూ రాణిస్తున్నారు. మనోజ్‌కుమార్‌కు 2009లో నాగరాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు సిద్ధార్థ 2011లో, రెండో కుమారుడు అవిరాజ్ 2016లో జన్మించారు. మనోజ్ విద్యాభ్యాసం నిజామాబాద్ నగరంలోనే సాగింది. ఇంటర్ చదివే సమయంలో 2004లో తైక్వాండో వైపు ఆయన దృష్టి మళ్లింది. మాస్టర్ అబ్దుల్లా ఫారూఖీ వద్ద శిక్షణ తీసుకున్నాడు. 2007లో ఉన్నత చదువుల కోసం ప్రాక్టీస్‌కు బ్రేక్ పడింది. పెళ్లి తర్వాత మళ్లీ తైక్వాండో పోటీల్లో పాల్గొన్నారు. మనోజ్‌కుమార్ బ్లాక్‌బెల్ట్ థర్డ్ డాన్, నాగరాణి బ్లాక్‌బెల్ట్, సిద్ధార్థ రెడ్ బెల్ట్, అవిరాజ్ ఎల్లో బెల్ట్ సాధించారు.
విద్యార్థుల పతకాల పంట
వినాయక్‌నగర్‌లోని బస్వాగార్డెన్‌లో ఐదేండ్లుగా విద్యార్థులకు మనోజ్‌కుమార్ తై క్వాండోలో శిక్షణ ఇస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెడ ల్స్ సాధించారు. హనిషా, హేమం త్, శ్రీనిజ, శర్వాణి, ప్రియన్, హరిని రాథోడ్, సిద్ధార్థ, అనితేజ్, అక్షిష్, ఈశ్వరీప్రియ, శ్రీజారెడ్డి, నయన్, సహాన, సుగుణ, అస్తా గోల్డ్ మెడల్ సాధించారు. లోకేశ్, మణికంఠ, ఆదిత్య, నాగరాజు, రుద్రకాంత్ జాతీయస్థాయిలో సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఓపెన్ ఇంటర్ పోటీల్లో సిద్ధార్థ గోల్డ్‌మెడల్, శ్రీప్రియన్ సిల్వర్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో సిద్ధార్థ బ్లాక్‌బెల్ట్ అందుకోనున్నారు.
మనోజ్‌కుమార్ కుటుంబం సాధించిన విజయాలు
తైక్వాండోలో మనోజ్‌కుమార్‌తోపాటు భార్యా పిల్లలు పలు పతకాలు సాధించారు. మనోజ్‌కుమార్ 2005 మే 12న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో స్టేట్ గోల్డ్ మెడల్ సాధించి నేషనల్‌కు ఎంపికయ్యారు. 2014లో గ్రాండ్ మాస్టర్ జయంత్‌రెడ్డి నుంచి సర్ తైక్వాండో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ తీసుకున్నారు. 2014లో రంగారెడ్డి జిల్లాలో తైక్వాండోలో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. 2015లో వెస్ట్ బెంగాల్లో నిర్వహించిన నేషనల్ తైక్వాండో పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. 2017లో తైక్వాండో బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ మాస్టర్ గ్రాండ్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా తీసుకున్నారు. 2017లో నేషనల్ క్యూరేజీ రెఫరీ అండ్ పుమ్సే నేషనల్ జడ్డ్ కొరియర్ గ్రాండ్ మాస్టర్ ద్వారా నేషనల్ సర్టిఫికెట్ అందుకున్నారు. 2019లో తైక్వాండో బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకున్నారు. నాగరాణి 2019 బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకున్నారు. సిద్ధార్థ 2018లో తైక్వాండోలో పుమ్ సే స్టేట్ చాంపియన్ షిప్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి, వైజాగ్‌లో తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. 2020 నవంబర్‌లో ఆన్లైన్లో జరిగిన తైక్వాండో ఇంటర్నేషనల్ పుమ్సే చాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు.
పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ
తైక్వాండోలో ఇందూరును ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే నా లక్ష్యం. తైక్వాండాలో ఆసక్తి ఉన్న 15 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. అమ్మాయిల ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో దోహదం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పై చదువులకు సర్టిఫికెట్స్ ఎంతో ఉపయోగపడతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు నన్ను సంప్రదించొచ్చు.
-మనోజ్‌కుమార్, తైక్వాండో మాస్టర్