మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Dec 26, 2020 , 00:17:32

వడివడిగా ‘నాగమడుగు’

వడివడిగా ‘నాగమడుగు’

ఎత్తిపోతలకు వారం రోజుల్లో టెండర్లు

రూ.476.25 కోట్లతో నిర్మాణం

30వేల ఎకరాలకు సాగు నీరు

నిజాంసాగర్‌ :

మంజీరపై నాగమడుగు ఎత్తిపోతల పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం పది రోజుల క్రితం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌-మల్లూర్‌ గ్రామాల సమీపంలో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మించనున్నారు. రూ.476.25 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే కృషితో పదిరోజుల క్రితం పరిపాలనా అనుమతులు వచ్చాయి. 

నీటి వృథాకు చెక్‌..

సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్టు మత్తడి ద్వారా నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని మంజీరలోకి నీరు ప్రవహిస్తుంది. చిన్నపాటి వర్షాలు కురిసినా నల్లవాగు మత్తడి పొంగిపొర్లి నీరు మంజీరలోకి వృథాగా పోతుంది. ఈ వర్షాకాలంలోనూ నెల రోజులపాటు నల్లవాగు మత్తడి పొంగిపొర్లి నాలుగు టీఎంసీలు మంజీరలోకి ప్రవహించాయి. నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మంజీర పరీవాహక ప్రాంతంలో మత్తడి నిర్మించనున్నారు. 

30వేల ఎకరాలకు సాగు నీరు..

మంజీర పరీవాహక ప్రాంతంలో రూ.476.25 కోట్లతో మత్తడిని నిర్మిస్తే దాని ద్వారా నిజాంసాగర్‌ మండలంలో 6వేల ఎకరాలు, పిట్లం మండలంలో 8వేల ఎకరాలు, పెద్దకొడప్‌గల్‌ మండలంలో 8వేల ఎకరాలు, బిచ్కుంద మండలంలో 8 వేల ఎకరాలు మొత్తం 30వేల  ఎకరాలకు నీరు అందనుంది. పనులు పూర్తయితే జుక్కల్‌ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారనుంది. జుక్కల్‌ నియోజకవర్గంలో సాగు నీటి వనరులు అంతగా లేకపోవడంతో నిజాంసాగర్‌ మండలంలోని నాన్‌కమాండ్‌ ఏరియాతోపాటు పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల్లో రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలను సాగు చేస్తుంటారు. నాగమడుగు పనులు పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సాగు నీటి ఇబ్బందులకు దూరమై రెండు పంటలను సాగు చేసుకుంటారు. 


భూ సేకరణ అవసరం లేకుండానే డీపీఆర్‌

నాగమడుగు మత్తడి నిర్మాణానికి రూ.476.25 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు లభించాయి. ఇప్పటికే సర్వే పూర్తయింది. భూ సేకరణ అవసరం లేకుండానే ఎత్తిపోతల నిర్మాణం చేపట్టేలా నీటి పారుదల శాఖ అధికారులు డీపీఆర్‌ రూపొందించారు. వారం రోజుల్లో టెండర్లు పిలుస్తారు. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని నిర్ణయించాం. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. పనులు పూర్తయితే జుక్కల్‌ నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. 

-హన్మంత్‌షిండే, జుక్కల్‌ ఎమ్మెల్యే

సాగు నీటి ఇబ్బందులు దూరం

నిజాంసాగర్‌ ప్రాజెక్టు మా మండలంలోనే ఉన్నప్పటికీ ప్రాజెక్టు నీరు మాత్రం మాకు అందదు. మంజీర పరీవాహక ప్రాంతంలోనే నాకు 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నాగమడుగు ఎత్తిపోతల పూర్తయితే 25 ఎకరాల్లో రెండు పంటలను సంతోషంగా సాగు చేసుకుంటాను. ఎన్నో ఎండ్ల కల నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే షిండే ఆలోచనలకు ప్రతి రూపమే నాగమడుగు మత్తడి.

-దుర్గారెడ్డి, రైతు, గోర్గల్‌, నిజాంసాగర్‌ 


logo