సాగు జలాలు వృథా కావొద్దు!

ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనే నీటి విడుదల
గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావు స్పష్టీకరణ
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:
వానకాలంలో కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలో జల వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి బేసిన్లో చెరువులు, కుంటలతోపాటు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తింది. ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. యాసంగి పంటలకు అన్నదాత సన్నద్ధమవుతున్న వేళ సాగునీటి ఇక్కట్లు లేకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జల వనరుల శాఖ అధికారులు సైతం పటిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గోదావరి బేసిన్ కమిషనర్ ఆర్.మధుసూదన్‌రావు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు, కాలువలను పరిశీలించారు. జల వనరుల శాఖ అధికారులను వెంట పెట్టుకుని కాలువల సామర్థ్యం, వాటి పటిష్టతను అధ్యయనం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులను బుధవారం సందర్శించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం నిజామాబాద్ ఎస్ఈ కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో...
సాగు నీటి వాడకంలో యాజమాన్య పద్ధతిని పకడ్బందీగా నిర్వహించాలని గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. ఇంజినీర్లు ముందస్తుగా అంచనాలు సిద్ధం చేసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తే సత్ఫలితాలు దక్కుతాయని, తద్వారా రైతులకు మేలు చేకూరుతుందన్నారు. 2019లో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని వదలడం ద్వారా సాధించిన ప్రగతిని కమిషనర్ గుర్తుచేశారు. ఒక టీఎంసీ నీటిని 13వేల ఎకరాలకు అందించినట్లు తెలిపారు. అలాగే నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అవలంబించిన విధానాలను సైతం ఇంజినీర్లకు వివరించారు. ప్రత్యేక చర్యలతో ప్రాజెక్టుల దిగువన రికార్డు స్థాయిలో ఆయకట్టు సాగు నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగు నీటిని వృథా చేయకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత జల వనరుల శాఖ ఇంజినీర్లదేనని వెల్లడించారు. రైతులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు.
కాళేశ్వరం పనులపై సమీక్ష...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21, 21/ఏ కు సంబంధించిన పనుల పురోగతిపై గోదావరి బేసిన్ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. పనులు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయన్న వివరాలను సంబంధిత విభాగం అధికారులు వివరించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వెనువెంటనే పనులను పూర్తి చేయాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న తీరును ఈఈలు, డీఈలు నిరంతరం ఫాలో అప్ చేయాలని చెప్పారు. కాంట్రాక్టర్లు పనులను వేగంగా పూర్తిచేసేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ మురళీధర్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన గోదావరి బేసిన్ కమిషనర్
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టును గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు బుధవారం పరిశీలించారు. ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిలువలు, గేట్ల పనితీరు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, ప్రధాన కాలువ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి మే 3వ తేదీ వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు. అలీసాగర్ వరకు 80వేల ఎకరాలకు నిజాంసాగర్ నీటిని అందించనున్నామని అన్నారు. మొత్తం ఏడు విడుతల్లో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎస్ఈ మురళీధర్, ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ దత్తాద్రి, ఏఈ శివ ఉన్నారు.
నేటి నుంచి నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని గురువారం ఉదయం నుంచి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1404.66 అడుగుల (17.31 టీఎంసీలు) నీరు నిల్వ ఉండగా ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు 1.12 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఒకటో నంబర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి 49వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీటి విడుదల కొనసాగనుంది.
అలీసాగర్ ద్వారా..
రెంజల్: అలీసాగర్ ప్రాజెక్టు ద్వారా గురువారం నుంచి సాగునీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన డీఐఏబీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని నవీపేట, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, మాక్లూర్, డిచ్పల్లి మండలాల పరిధిలోని 53వేల792 ఎకరాల ఆయకట్టుకు పంప్‌హౌస్ 4 మోటర్ల సహాయంతో స్టేజీల వారీగా తడి అందిస్తామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి పది రోజులు నీటిని విడుదల చేస్తామని, విడుతల వారీగా 2021 ఏప్రిల్ చివరి వరకు గుంట భూమి కూడా ఎండకుండా చూస్తామని ఏఈ ప్రవీణ్‌రెడ్డి వివరించారు.
తాజావార్తలు
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్‌స్టాప్