బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 24, 2020 , 00:06:22

ఎడారి బతుకులపై పిడుగు..

ఎడారి బతుకులపై పిడుగు..

యూఏఈలో కనీస వేతనాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

ఉమ్మడి జిల్లా నుంచి గల్ఫ్‌లో రెండు లక్షల మందికి ఉపాధి

కార్మికుల పొట్టగొడుతూ కేంద్రం సర్క్యులర్లు

బీజేపీ ప్రభుత్వ తీరుపై గల్ఫ్‌ కుటుంబాల ఆగ్రహం

గల్ఫ్‌ ఆశలను చిదిమేస్తున్న నరేంద్ర మోదీ సర్కారు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతూ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అన్నదాతలను నిండా ముంచి బడా వ్యాపారులకు పంటల సాగును అప్పనంగా ఇచ్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. చీకటి చట్టాలపై నిరసన వ్యక్తమవుతున్న దరిమిలా ఇప్పుడు మోదీ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం గల్ఫ్‌ కార్మికుల బతుకులపై నీలినీడను కమ్మేస్తోంది. దేశంలో ఉపాధి లేక... ఉన్న ఊరును, కన్న వారిని వదిలి వెళ్తున్న ఎంతో మంది అభాగ్యులకు సెప్టెంబర్‌, 2020లో భారత విదేశీ వ్యవహారాల శాఖ జారీ చేసిన రెండు సర్క్యులర్లు గల్ఫ్‌కు కొత్తగా వెళ్లే కార్మికుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికార పీటమెక్కిన నరేంద్ర మోదీ గడిచిన ఆరేండ్లుగా కొత్తగా ఉపాధి చూపించకపోగా... పొట్ట చేతపట్టుకొని గల్ఫ్‌కు వలస వెళ్తున్న వారి నడ్డి విరుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ చీకటి సర్క్యులర్లపై ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన జ్వాలలు పెల్లుబికుతున్నాయి. 

కార్మికుల పొట్టగొడుతున్న చీకటి సర్క్యులర్లు

కొత్తగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారి కనీస వేతనాలు (మినిమమ్‌ రెఫరల్‌ వేజెస్‌) 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అత్యంత రహస్యంగా జారీ చేసిన ఈ రెండు సర్క్యులర్లు గల్ఫ్‌ దేశాల్లో బతుకీడుస్తున్న వారికి ఆశనిపాతంలా మారాయి. ఖతార్‌, బెహ్రెయిన్‌, ఒమన్‌, యూఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్‌ డాలర్లు అంటే సుమారుగా రూ.15వేలు, కువైట్‌లో 245 డాలర్లు, సౌదీ అరేబియాలో 324 డాలర్లకు తగ్గిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓవర్సీస్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ జనరల్‌ ఆఫ్‌ ఇమిగ్రెంట్స్‌ డివిజన్‌లోని డైరెక్టర్‌ స్థాయి అధికారి రాజ్‌ కుమార్‌ సింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 8, సెప్టెంబర్‌ 21 తేదీల్లో రెండు సర్క్యులర్లను జారీ చేశారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కి వెళ్లే కార్మికులకు వారి నైపుణ్యాన్ని, వృత్తిని బట్టి ఇప్పటి వరకు కనీస వేతనాలు 800 నుంచి 1700 దిర్హామ్స్‌ సుమారుగా రూ.16వేలు నుంచి రూ.34వేలు వరకు ఉండేది. కేంద్రం తీసుకొచ్చిన సర్క్యులర్లతో అందరినీ ఒకే గాటన కట్టి 735 ధరమ్స్‌ అంటే సుమారుగా రూ.15వేలకు తగ్గనుంది. స్కిల్డ్‌ అండ్‌ అన్‌ స్కిల్డ్‌ కార్మికులందరినీ ఒకే గాటన కట్టి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉపాధి కల్పిస్తున్న గల్ఫ్‌ దేశాల నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకున్నా భారతీయుల పొట్ట కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వమే పూనుకోవడం విడ్డూరంగా మారింది. కేవలం గల్ఫ్‌లోని బడా రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు, విదేశీ కంపెనీ యాజమాన్యాల లాబీకి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పు మంటున్నాయి.

లక్షలాది మంది అభాగ్యులపై ప్రభావం

పొట్టకూటి కూసం విదేశాలకు వెళ్లే వారు ఉభయ జిల్లాల్లో నిజామాబాద్‌ జిల్లా నుంచే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రతి 10 కుటుంబాల్లో సగం మంది గల్ఫ్‌ కార్మికులే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 25 లక్షల మంది జనాభా ఉంది. ఇందులో 10 శాతం నిరుపేద కుటుంబాలకు గల్ఫ్‌ నుంచి వచ్చే కష్టార్జితమే ఆధారం. గల్ఫ్‌ కార్మిక సంఘాల అంచనా మేరకు నిజామాబాద్‌ జిల్లాలో సుమారుగా 1.8 లక్షల మంది గల్ఫ్‌ కార్మికులున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోనూ 1.25 లక్షల మంది ఉన్నారని అంచనాలున్నాయి. మొత్తానికి రెండు జిల్లాల నుంచి గల్ఫ్‌కు వెళ్లిన వారు దాదాపుగా రెండున్నర లక్షల మంది ఉంటారు. అనేక మంది కార్మికులు ఎడారి దేశంలో కన్నవారిని, ఉన్న ఊరును వదిలి వెళ్లిన వారే. ముఖ్యంగా యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, సౌదీ, కువైట్‌ దేశాల్లోనే ఎక్కువ మంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ దేశాల్లో ప్రస్తుతం కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంటుందని సమాచారం. ఆయా దేశాల్లో ఎక్కువగా నిర్మాణ రంగంలోనే ఉమ్మడి జిల్లా వారు పని చేస్తున్నారు. 

పిడుగుపాటు లాంటి నిర్ణయం

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో అనేక సంవత్సరాలుగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. నేటికీ రూ.లక్షలు అప్పు జేసి చాలీచాలని జీతాల కోసం ఎడారి దేశాలకు పయనం అవుతున్న వారు వేలల్లో ఉన్నారు. ఓ వైపు ఏజెంట్ల చేతుల్లో మోసపోతూనే... లక్షలు ఖర్చు చేసి విమాన టికెట్లు ఖర్చు చేస్తూ దేశం కాని దేశానికి వలస వెళ్తున్నారు. దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి ఉపాధి వేటలో ఇతర దేశాలకు వలస వెళ్తున్న అభాగ్యులకు మోదీ సర్కారు మేలు చేయలేకపోగా కీడును తలపెడుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్న ఊరిలో ఉపాధి లేదని అప్పులు చేసి గల్ఫ్‌ బాట పట్టాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా మారింది. నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఏకంగా లక్షలు పోసి విమానమెక్కే వారికి మొండి చేయి చూపించనుంది. ఏటా ఉపాధి కోసం లక్షలాది మంది గల్ఫ్‌ బాట పడుతున్నారు. వీరంతా లక్షల రూపాయలు సంపాదిస్తామని కలలు కంటూ గాలి మోటరు ఎక్కుతుంటారు. అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గల్ఫ్‌బాట పట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కవితాగ్రహం

గల్ఫ్‌ కార్మికుల వేతనాల కోతపై ఎమ్మెల్సీ మండిపాటు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గల్ఫ్‌ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గల్ఫ్‌ కార్మిక సంఘాలతో ఎమ్మెల్సీ కవిత బుధవారం సమావేశం అయ్యారు. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్న ఊరును, కుటుంబ సభ్యులను వదిలి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి కష్టపడుతున్న కార్మికులకు కేంద్రం తీసుకొచ్చిన తాజా ఆదేశాలతో పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖతార్‌, బహ్రెయిన్‌, ఒమన్‌, యూఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలవారీ వేతనాలను తగ్గిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం గల్ఫ్‌ కార్మికుల పొట్టగొట్టే విధంగా ఉందన్నారు. 

కేంద్రంపై ఒత్తిడి తెద్దాం..

గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని కవిత చెప్పారు. వలస కార్మికుల సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇదే అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో కార్మికుల రక్షణకు అద్భుతమైన చట్టాలు ఉన్నాయన్నారు. గతంలో సుష్మాస్వరాజ్‌ దృష్టికి సైతం ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. కవితతో భేటీ అయిన వారిలో ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, పలువురు గల్ఫ్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

ఉత్తర్వులను రద్దు చేయాలి

ధర్పల్లి : కేంద్ర సర్కార్‌ గల్ఫ్‌ బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారి నోట్లో మట్టి కొడుతోంది. బతుకు దెరువు కోసం వెళ్లిన వారి కష్టానికి తగిన ఫలితం రాకుండా అడ్డుపడుతోంది. ఉపాధి కోసం వెళ్లిన వారికి వేతనాలు పెంచండి అని చెప్పాలే గానీ తగ్గించాలని చెప్పడం సరికాదు. కేంద్ర సర్కార్‌ వెంటనే సర్క్యులర్లను రద్దు చేయాలి.

-తోంటకొల్ల ఎర్రన్న, హొన్నాజిపేట్‌

చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నాం..

నవీపేట : బతుకు దెరువు కోసం భార్యాపిల్లలను వదిలి నాలుగేండ్ల క్రితం బహ్రెయిన్‌ వెళ్లా. అక్కడ చాలీచాలని వేతనాలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా. నాకు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వీరందరి పోషణ భారం నాపైనే ఉంది. వేతనాలు తగ్గించడంతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలియడంలేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గల్ఫ్‌ దేశం వెళ్లాలంటే భయంగా ఉంది. 

-కల్లెం తులసీరాం, లింగాపూర్‌, నవీపేట

కేంద్ర నిర్ణయం సరికాదు

వేల్పూర్‌ : గల్ఫ్‌ కార్మికుల వేతనాల్లో 30 నుంచి 50 శాతం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. సరైన జీతాలు లేక గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్నాం. లక్షలు పెట్టి గల్ఫ్‌ వెళ్తే ఎండ్లు పనిచేసినా అప్పులు తీరడంలేదు. కేంద్రం నిర్ణయంతో గల్ఫ్‌కు వెళ్తే నెలకు రూ.10వేలు కూడా రావు

- శ్రీనివాస్‌గౌడ్‌, వేల్పూర్‌ 503 బిఎల్‌కె 23ఎ

కక్షగట్టిన మోదీ ప్రభుత్వం

సదాశివనగర్‌ : గల్ఫ్‌ కార్మికులపై మోదీ ప్రభుత్వం కక్షగట్టింది. నేను గతంలో గల్ఫ్‌ వెళ్లి వచ్చా. గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పట్టించుకునేవారే లేరు. గల్ఫ్‌ కార్మికుల వేతనాలను తగ్గించాలని కేంద్రం సిఫారసు చేయడం దురదృష్టకరం.  

-మహ్మద్‌ ఇర్షాదొద్దీన్‌, అడ్లూర్‌ ఎల్లారెడ్డి

గల్ఫ్‌ కార్మికులపై దొంగదెబ్బ

ఖలీల్‌వాడి : గల్ఫ్‌ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం తీరు సరైందికాదు. ప్రవాస కార్మికులపై కక్షగట్టినట్లు కనిపిస్తున్నది. కనీస వేతన సిఫారసు ఒప్పందాల్లో భారీ కోత విధించడంతో గల్ఫ్‌ కార్మికుల నడ్డి విరిచినైట్లెంది. డబ్బులను సంపాదించుకునేందుకే ఉన్న ఊరు వదిలి గల్ఫ్‌ బాట పడుతున్నారు. బతుకు దెరువు కోసం వెళ్లే కార్మికులపై దొంగదెబ్బతీయడం సిగ్గుచేటు. 

-సుజిత్‌సింగ్‌ ఠాకూర్‌, తెలంగాణ ఉద్యమకారుడు

గల్ఫ్‌ కార్మికులను మోసం చేస్తున్న కేంద్రం

ఖలీల్‌వాడి : బీజేపీ ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తోంది. కొత్త చట్టాలను తీసుకొచ్చి అటు వ్యవసాయరంగాన్ని, ఇటు గల్ఫ్‌ కార్మికులకు తీరని అన్యాయం చేస్తోంది. గల్ఫ్‌ కార్మికులకు సరైన వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన కార్మికుల పొట్టగొట్టాలని చూస్తోంది. ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేనిపక్షంలో కార్మికలోకం ఉద్యమిస్తుంది. 

- విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి 


logo