గురువారం 21 జనవరి 2021
Nizamabad - Dec 23, 2020 , 01:00:16

కేంద్రం దొంగదెబ్బ

కేంద్రం దొంగదెబ్బ

గల్ఫ్‌ దేశాల్లోని కంపెనీ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ ప్రభుత్వం 

గల్ఫ్‌ కార్మికులపై కత్తిగట్టిన కేంద్రం

కనీస వేతనాలను తగ్గిస్తూ సర్క్యులర్లు

జీతాలు 30 నుంచి 50 శాతం తగ్గే ప్రమాదం

రాష్ర్టానికి చెందిన 15 లక్షల ప్రవాస కార్మికులపై ప్రభావం

దొడ్డిదారిన తెచ్చిన సర్క్యులర్లు వెనక్కి తీసుకోవాలి

ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు

‘కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికులను దొంగదెబ్బ తీసింది. కార్మికులపై కక్షగట్టి దొడ్డిదారిన జీవోలు తీసుకొచ్చింది. వారి జీవితాలతో ఆటలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్‌లోని కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలతో కార్మికులు రోడ్డున పడనున్నారు. కేంద్ర వైఖరితో రాష్ర్టానికి చెందిన 15 లక్షల మంది కార్మికుల జీవితాలు చిన్నాభిన్నం కానున్నాయి. అక్రమ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలి.’ అని ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. గల్ఫ్‌ కార్మికుల వేతనాలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచ్చిన జీవోల నేపథ్యంలో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. -ఆర్మూర్‌

సర్క్యులర్లను కేంద్రం ఎప్పుడు తీసుకొచ్చింది ? 

కొత్తగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారి కనీస వేతనాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 8, 21వ తేదీల్లో సర్క్యులర్లను జారీ చేసింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాల్లో ఉన్న కంపెనీలు, ఆ కంపెనీల యాజమాన్యాలు, రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల ఒత్తిడికి తలొగ్గి సర్క్యులర్లను జరీ చేసింది. 

రాష్ర్టానికి చెందిన కార్మికులు 

ఎంతమంది ఉన్నారు ?

కేంద్రం తీసుకొచ్చిన సర్క్యులర్లతో రాష్ర్టానికి చెందిన ఇతర దేశాల్లో ఉండే 15 లక్షల మంది, గల్ఫ్‌ దేశాల్లో ఉండే 10 లక్షల మంది గల్ఫ్‌ కార్మికులు నష్టపోనున్నారు. గల్ఫ్‌ దేశాలైన ఖత్తర్‌, బెహ్రెయిన్‌, యూఏఈ, మస్కట్‌, సౌదీ అరేబియా, కువైట్‌ దేశాల్లో రాష్ర్టానికి చెందిన 10 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 

వేతనాలు ఎంతమేర తగ్గనున్నాయి ?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సర్క్యులర్లతో బయటి దేశాల్లో పనిచేసే కార్మికులు ఇక మీదట ప్రతినెలా 30 నుంచి 50 శాతం వరకు నెలసరి జీతాలు తగ్గిపోనున్నాయి. ఇదివరకు 800 నుంచి 1700 దరమ్స్‌, రియాల్స్‌ నెలసరి వేతనాలు వచ్చేవి. ఇక మీదట నెలసరి జీతనం 735 రియల్స్‌ చెల్లించానికి కేంద్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్‌లోని కంపెనీలతో ఎంవోయూ చేసుకుంది. గల్ఫ్‌ దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులకు ఇదివరకు బయటి దేశాల్లో 250 నుంచి 400 డాలర్ల వరకు వేతనం వచ్చేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సర్క్యులర్లతో రానున్న రోజుల్లో 200 డాలర్లు మాత్రమే నెలసరి జీతనంగా రానుంది. గల్ఫ్‌ దేశాల్లో ఇంతకుముందు ప్రతినెలా 16 వేల నుంచి 34 వేల వరకు నెలసరి వేతనం కార్మికులకు వచ్చేది. కేంద్రం తీసుకొచ్చిన దొంగ జీవోతో రానున్న రోజుల్లో గల్ఫ్‌ కార్మికులకు కేవలం రూ.15 వేల వేతనం మాత్రమే రానుంది.

మీ డిమాండ్‌ ఏమిటి ?

18 దేశాల్లో మన దేశానికి చెందిన 90 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యులర్లతో కార్మికులు గల్ఫ్‌దేశాల్లో ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముంది. కేంద్ర ప్రభుత్వం ప్రవాస కార్మికులపై కక్ష గట్టింది. నెలసరి వేతనాలను తగ్గిస్తూ బయటి దేశాల్లోని కంపెనీలతో దొంగదారిన ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం దొంగదారిన తెచ్చిన సర్క్యులర్లను వెంటనే వెనక్కి తీసుకుని వాటిని రద్దు చేయాలి. logo