శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Dec 22, 2020 , 00:04:01

ఆర్టీసీపై కేంద్రప్రభుత్వం వివక్ష

ఆర్టీసీపై కేంద్రప్రభుత్వం వివక్ష

ఇందూరు : ‘ఒకే దేశం - ఒకే పన్ను’ అంటున్న కేంద్ర ప్రభుత్వం రైల్వే, ఆర్టీసీకి డీజిల్‌పై వేర్వేరుగా పన్ను విధిస్తూ వివక్ష చూపుతున్నదని ఏఐటీయూసీ నాయకులు విమర్శించారు. డీజిల్‌పై రైల్వేకు 4శాతం, ఆర్టీసీకి 31.83శాతం పన్ను విధిస్తుండడంతో తెలంగాణ ఆర్టీసీపై రూ.622 కోట్ల అదనపు భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయూసీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే దేశంలో ప్రజారవాణా వ్యవస్థలో విభిన్న పద్ధతులు ఆచరణీయం కాదని, రైల్వేలాగే ప్రభుత్వ రంగంలో నడిచే ఆర్టీసీకి సైతం పన్ను తగ్గించాలని కోరారు. పన్ను తగ్గిస్తే తెలంగాణ ఆర్టీసీ సంస్థ  నష్టాల నుంచి బయటపడుతుందని, ప్రయాణికులకు సంస్థ మరింత మెరుగైన సేవలందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటరు వెహికిల్‌ యాక్ట్‌ సెక్షన్లను ఆర్టీసీకి నష్టం వాటిల్లేలా, ప్రైవేట్‌ వ్యాపారులకు లాభం చేకూరేలా మార్పులు చేశారన్నారు. టూరిస్ట్‌ పన్ను కట్టి స్టేజీ క్యారియర్‌గా నడిపే అవకాశం ప్రైవేట్‌ సంస్థలకు కల్పించడంతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదన్నారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పి.సుధాకర్‌, సాయిలు, నర్సింగ్‌రావు, ఓమయ్య, అహ్మద్‌, అనిల్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.