సోమవారం 18 జనవరి 2021
Nizamabad - Dec 21, 2020 , 00:43:32

ప్రారంభానికి ముస్తాబైన జగన్నాథ ఆలయం

ప్రారంభానికి ముస్తాబైన జగన్నాథ ఆలయం

ఈ నెల 24 నుంచి 28 వరకు ఉత్సవాలు

ఏర్పాట్లు  చేస్తున్న వీడీసీ

ధర్పల్లి : మండల కేంద్రంలోని మాలగుట్ట (గోవర్ధనగిరి)పై నూతనంగా నిర్మించిన జగన్నాథ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

24 నుంచి ఉత్సవాలు

ఈ నెల 24వ తేదీన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్థాపిత దేవత విగ్రహాల ఊరేగింపు, గణపతి పూజ, పుణ్యహవచనం, నాంది దేవత ఆహ్వానం, రిత్విక్‌వర్ణన, రక్షా బంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండ దీప స్థాపన, అంకురారోహణ, తీర్థ ప్రసాద వితరణ ఉంటాయి. 25న శుక్రవారం ఉదయం 8.30 గంటలకు గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల ప్రదక్షిణ, హారతి, మంత్రపుష్పం నిర్వహిస్తారు. 26న అగ్ని మథనం, యాగశాలలో మంటపం దేవతా పూజ, ఆవాహిత దేవతా హవనం, మూలమంత్ర హవనం, భక్తులతో విశేష హవనం, మధ్యాహ్నం, సాయంత్రం విగ్రహాలకు జలాధివాసం, ఉపచార పూజ మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ ఉంటాయి. 27న మంటపం ఆవాహిత పూజ, మూలమంత్ర హవనం, భక్తులతో విశేష హవనం, సాయంత్రం మహా స్నపనం, శయ్య, ఫల, పుష్ప, హిరణ్య అధివాసాలు, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. చివరి రోజు సోమవారం 28న ఉదయం 5 గంటలకు ప్రారంభం, 5.30 గంటలకు యంత్రస్థాపన, మూలమంత్ర హవనం, మీనలగ్నమున విగ్రహస్థాపన, కళాన్యాస హవనం, ప్రాణప్రతిష్ఠ, 11.50 నిమిషాలకు పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, ప్రోక్షణ, తీర్థ ప్రసాద వితరణ, ఆశీర్వచనము, భక్తులకు అన్నదానం ఉంటుంది.

చరిత్రకు సాక్ష్యం.. జగన్నాథుని ఆలయం

మాల గుట్టపై పురాతన జగన్నాథుని ఆలయం, రాతి స్తంభం ధర్పల్లి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. పురాతన ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో రెండు పెద్ద రాళ్ల మధ్యన చిన్న ఆలయం నిర్మించి మూలవిరాట్టు విగ్రహాలను ఉంచారు. అయితే రాళ్ల మధ్యలో నిర్మించిన ఆలయం సైతం శిథిలమైపోయింది. దీంతో నూతన ఆలయం నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు.

నూతన ఆలయ నిర్మాణం

2007లోనే జగన్నాథ ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.5 లక్షల వరకు చందాలు చేశారు. కాగా పురాతన ఆలయాల పరిరక్షణ కోసం దేవాదాయ శాఖ నిధులు అందిస్తుందని తెలుసుకొని గ్రామస్తులు దేవాదాయ శాఖకు దరఖాస్తు చేశారు. దీంతో పరిశీలనకు వచ్చిన అధికారులు పురాతన ఆలయం చరిత్ర గుర్తులు ఏమీ లేకపోవడంతో సందేహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఆలయం వద్ద చెక్కు చెదరకుండా ఉన్న రాతి స్తంభం ఆధారంగా ఆలయ చరిత్రను గుర్తుపట్టినట్లు సమాచారం. దీంతో మాలగుట్ట ప్రాంతంలోని సర్వే నంబర్‌ 195లో ఐదెకరాల స్థలాన్ని ఆలయ పునర్నిర్మాణం కోసం కేటాయించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చందాల ద్వారా పోగు చేసిన రూ.5 లక్షలు, ప్రభుత్వం (ఎండోమెంట్‌ శాఖ) అందించిన రూ.20 లక్షలు మొత్తం రూ.25 లక్షలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో గుట్టపైన ఆలయ నిర్మాణానికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఆలయంలో ప్రతిష్ఠాపన చేసేందుకు రాతి విగ్రహాలను ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి నుంచి తీసుకొచ్చారు. 

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..

ప్రసిద్ధిగాంచిన ఆలయ నిర్మాణం కోసం పెద్దలు ఎంతో కృషి చేశారు. రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పూర్తి సహకారం, గ్రామస్తులు, భక్తుల విరాళాలతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుతున్నాం.

-చెలిమెల రంజిత్‌, వీడీసీ చైర్మన్‌, ధర్పల్లి

నిర్మాణం పూర్తికావడం చాలా సంతోషం

పురాతన ఆలయం శిథిలమైనందున మాల గుట్టపై నూతన ఆలయాన్ని అందరి సహకారంతో నిర్మించాం. ఆలయ నిర్మాణం పూర్తికావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ఉత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలిరానున్నారు.

-సంటన్నోల్ల నడ్పి రాజన్న, వీడీసీ సభ్యుడు ధర్పల్లి