శనివారం 23 జనవరి 2021
Nizamabad - Dec 19, 2020 , 01:10:06

నిజాంసాగర్‌ కాలువలకు ‘ఆధునిక’ సొబగులు

నిజాంసాగర్‌ కాలువలకు  ‘ఆధునిక’ సొబగులు

50వేల ఎకరాలు సస్యశ్యామలం  అయ్యే అవకాశం

రూ. 406 కోట్లతో పనులు 95 శాతం  పూర్తి

406 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు

బాన్సువాడ, జుక్కల్‌, బోధన్‌, ఆర్మూర్‌, నియోజక వర్గాలకు సాగు నీరు అందించే నిజాంసాగర్‌ డిస్ట్రిబ్యూటరీ కాలువలు మొత్తం 82 ఉన్నాయి. నిజాంసాగర్‌ నుంచి బాల్కొండ వరకు 2 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిజాంకాలంలో నిర్మించిన డిస్ట్రిబ్యూటరీ (ఉపకాలువలు), నిజంసాగర్‌ నుంచి బాల్కొండ వరకు సాగునీరు అందించే మెయిన్‌ కెనాల్‌తో పాటు, పంట పొలాలకు సాగునీరు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువలు శిథిలావస్థకు చేరాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సహకారంతో , స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.406 కోట్ల నిధులను మంజూరు చేసింది. చివరి ఆయకట్టుకూ సాగునీరు అందేలా డిస్ట్రిబ్యూటరీలను ఆధునీకరించడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.  

బాన్సువాడ : రైతును రాజు చేయడమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయానికి అతి ప్రధానమైన  సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది. సమైక్య పాలనలో డిస్ట్రిబ్యూటరీల్లో శిథిలావస్థలకు చేరుకుని ఉపకాలువల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టుకు చేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌  వారి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఒకవైపు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా, రాయితీ విత్తనాలు, సకాలంలో ఎరువులు, ప్రతి రైతుకూ పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అంతే కాకుండా నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ఉన్న పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలన్న సంకల్పంతో కోట్లాది రూపాయల నిధులు ఆధునీకరణ పనుల కోసం విడుదల చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌తో పాటు , డిస్ట్రిబ్యూటరీ ( ఉపకాలువల) ల మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం సుమారు రూ.406 కోట్ల మంజూరుకు కృషి చేశారు.తద్వారా మట్టి కాలువలకు స్వస్తి పలికినట్టయ్యింది. 

50 వేల ఎకరాలకు సాగునీరు

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి బాల్కొండ వరకు మెయిన్‌ కెనాల్‌ను ఆధునీకరించడంతో 82 డిస్ట్రిబ్యూటరీల ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతున్నదని రైతులు చెబుతున్నారు. గతంలో మట్టితో నిర్మించిన కాలువలు ఉండడంతో నీరు చివరి ఆయకట్టుకు చేరేది కాదు. ఇప్పుడు మెయిన్‌ కెనాల్‌తో పాటు, డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సీసీ పనులు చేపట్టంతో సాగునీటికి రంది లేకుండా పోయింది. సుమారు రూ.193 కోట్లతో నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ను సీసీతో ఆధునీకరించారు. ఆధునికీకరణ పనులకు మొదటి విడుతగా రూ.98 కోట్లు, రెండో విడుతలో రూ.115 కోట్ల్ల నిధులతో పనులు చేపట్టారు. ఆధునికీకరణ పనులతో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులకు చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి.  

కాలువలు మంచిగైనయి. .

గప్పట్ల మట్టి కాలువలు ఉండే.. అచ్చిన నీళ్లు భూమిల ఇంకుకుంటా వచ్చేది. పొలాలకు రావల్నంటే కెనాల్‌ ఇడిశినంక నాలుగైదు రోజులకు అందుతుండే. ఇప్పుడు పొద్దుగల్ల కాలువ ఇడిస్తే రెండొద్దులల్ల నీళ్లు ఉరుక్కుంట అస్తున్నయి.  

-పాశం గంగారెడ్డి, రైతు, పాత బాన్సువాడ

నీళ్లు ఇడుసుడుతోనే అస్తున్నయి..

మెయిన్‌ కెనాల్‌ నుంచి నీళ్లు ఇడుసుడుతోనే పొలాలకు అస్తున్నయి. రైతులకు ఏంగావల్నో సీఎం సార్‌కు తెలుసు. స్పీకర్‌ పోచారం సార్‌కు కాలువల గురించి మస్తు అనుభవం ఉండుట్ల అన్ని కాలువలను మంచిగ చేయించిండు. కేసీఆర్‌ అచ్చినంక రైతులకు అంత మంచి జరుగుతున్నది. 

- జైపాల్‌ యాదవ్‌, రైతు, కొల్లూర్‌

చివరి ఆయకట్టుకూ సాగునీరు..

అంచలంచెలుగా కోట్లాది రూపాయల నిధులతో 52 ఉపకాలువలను, నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ను ఆధునీకరించాం. గతంలో మట్టి కాలువలతో సాగునీరు  ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఉపకాలువలను సీసీతో ఆధునీకరించడంతో మెయిన్‌ కెనాల్‌ నుంచి వచ్చే నీరు ఎక్కడా ఆగకుండా డిస్ట్రిబ్యూటరీలకు వచ్చేస్తున్నది. చివరి ఆయకట్టులో ఉన్న రైతుల పంటపొలాలకు సాగునీరు అందుతున్నది. 

-దత్తాద్రి, నీటిపారుదల శాఖ డీఈఈ, నిజాంసాగర్‌ ప్రాజెక్టు


logo