సోమవారం 18 జనవరి 2021
Nizamabad - Dec 17, 2020 , 03:32:34

పూర్తవుతున్న పునరుజ్జీవం

పూర్తవుతున్న  పునరుజ్జీవం

  •  మూడో పంప్‌హౌజ్‌లో శరవేగంగా మోటర్ల ఏర్పాటు
  •  వరద కాల్వలో ఏడాది పొడవునా గోదావరి జలాలు 
  •  పూర్తయిన రాంపూర్‌, రాజేశ్వర్‌రావు పేట పంప్‌హౌస్‌లు
  •  ముగింపు దశలో ముప్కాల్‌ పంప్‌హౌజ్‌ నిర్మాణం 

ప్రతిష్ఠాత్మకమైన శ్రీరాంసాగర్‌ పునర్జీవ వథకం తుదిదశకు చేరుకొన్నది. ప్రాజెక్టు పరిధిలోని రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌లు ఇప్పటికే పూర్తవగా.. ముప్కాల్‌లో నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పంప్‌హౌజ్‌లో మోటర్ల బిగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకొన్నది. మొత్తం 8 మోటర్లలో ఆరు మోటర్లను ఇదివరకే బిగించగా.. మరో రెండు మోటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా సాగుతున్నది. 2017లో చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులు ప్రారంభమయ్యాయి. ఎస్సారెస్పీ నీళ్లను దిగువకు పారించే వరద కాలువలపై మూడుచోట్ల రివర్స్‌ పంప్‌ల నిర్మాణాల్ని చేపట్టేలా రూ.1067 కోట్లు వ్యయంతో ఈ పథకం పనులు కార్యరూపం దాల్చాయి.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మకమైన శ్రీరాంసాగర్‌ పునర్జీవ వథకం తుదిదశకు చేరుకొన్నది. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని రెండు పంప్‌హౌజ్‌లు పూర్తవగా మూడో పంప్‌హౌజ్‌లో మోటర్ల బిగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకొన్నది. ముప్కాల్‌ మండలకేంద్రంలోని ఈ పంప్‌హౌజ్‌లో మొత్తం 8 మోటర్లలో ఆరు మోటర్లను ఇదివరకే బిగించారు. రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తికావడంతో 2019 సెప్టెంబర్‌లోనే కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీని ముద్దాడాయి. వరదకాల్వ మూలంగా భూగర్భ జలాలు అమాంతంగా పెరుగటంతో యాసంగి పంటలకు ఢోకాలేకుండాపోయింది. ఇప్పుడు రెండు పంటలను రైతులు ధైర్యం తో వేసుకొంటున్నారు. 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన నాటినుంచి శరవేగంగా జరుగుతున్నాయి.

రూ.1,067 కోట్ల్ల వయ్యంతో ఎస్సారెస్పీ నీళ్లను దిగువకు పారించే వరద కాలువలపై మూడు చోట్ల రివర్స్‌ పంప్‌ల నిర్మాణాల్ని చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కిందకు నీళ్లు పారించిన కాలువలోనే.. మళ్లీ వెనక్కి నీళ్లు పారించేలా డిజైన్‌చేసి నిర్మించడం ఇంజినీరింగ్‌ అద్భు తం. ముప్కాల్‌ పంప్‌హౌజ్‌  నిర్మాణం పూర్తయితే ఎస్సారెస్పీలో నీళ్లు లేని సమయంలో నేరుగా కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీలోకి మళ్లిస్తారు. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ వరదకాలువ నుంచి 0.100 కిలోమీటర్‌ పాయింట్‌ వద్ద మూడో పంప్‌హౌజ్‌ లో 8 మోటర్లలో ఆరింటిని బిగించారు. మిగిలిన రెండింటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల్లో దాదాపు 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే వరదకాల్వలోని నీటితో సమీప ఆయకట్లు పంటలకు మేలు చేకూరుస్తున్నారు. ముప్కాల్‌వద్ద మూడో పంప్‌ నెలాఖరులోగా ఎత్తిపోతకు సిద్ధమవుతున్నది. ఒక్కో పంప్‌నకు 1,450 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉంటుంది. మొత్తం 8 మోటర్ల ద్వారా 11,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయవచ్చు. 

15 నుంచి యాసంగికి నీరు..

ఎస్సారెస్పీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యాసంగిలో ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీరు విడుదలచేస్తున్నట్టు ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజినీర్‌ బీ శంకర్‌ తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజి1,2 కలిపి మొత్తం 13.18 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని మంగళవారం శంకర్‌ తెలిపారు. దీంతోరైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. డిసెంబర్‌ 15 నుంచి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదలచేస్తున్నామని, రైతులు ఆరుతడి పంటలే వేయాలని పేర్కొన్నారు ఈ విషయంలో వ్యవసాయ అధికారులతో కలిసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి నీటి బొట్టును వృథాచేయకుండా వాడుకొనే విషయమై రైతులు చొరవచూపాలని కోరారు. చివరి ఆయకట్టుకు నీరు వెళ్లాలంటే ముందుగా ఉన్న రైతులు నిబంధనలకు లోబడి నడుచుకోవడమే కాకుండా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. 

వేగంగా పనులు

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా మూడో పంప్‌ హౌజ్‌  పనులు వేగంగా సాగుతున్నాయి. వరద కాలువ నుంచి పంప్‌ హౌజ్‌ లోకి నీరు చేరే అప్రోచ్‌ కెనాల్‌, వరద కాలువ నుంచి పంప్‌ హౌజ్‌ లోకి నీటిని మళ్లించే గేట్లు, పంప్‌ హౌజ్‌  నుంచి ఎస్సారెస్పీ లోకి నీటిని తరలించే లీడ్‌ కెనాల్‌ పనులు పూర్తయ్యాయి. పంప్‌ హౌజ్‌  సబ్‌ స్టేషన్‌ పనులు కూడా చివరిదశలో ఉన్నాయి. నెలాఖరులోగా పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. 
- తిరుపతి, డీఈ, ఎస్సారెస్పీ వరద కాలువ