సోమవారం 18 జనవరి 2021
Nizamabad - Dec 16, 2020 , 00:38:10

ఆపద్బాంధవులు

ఆపద్బాంధవులు

  • ఐదుగురి ప్రాణాలను కాపాడిన ఆర్‌ఎస్సైలు
  • కారు టైరు పేలి కాలువలోకి దూసుకెళ్లిన కారు
  • ఐదుగురికి తీవ్రగాయాలు  nఅంబులెన్స్‌లో దవాఖానకు తరలింపు
  • డిచ్‌పల్లి మండలం ధర్మారం (బీ) బ్రిడ్జి వద్ద ఘటన
  • ఆర్‌ఎస్సైలను అభినందించిన ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌

డిచ్‌పల్లి: ప్రమాదవశాత్తు ఓ కారు పల్టీకొట్టి కాలువలోకి దూసుకెళ్లగా అందులో ఉన్న ఐదుగురిని డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్సైలు కాపాడారు. వారిని కారులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకువచ్చి అంబులెన్సులో దవాఖానకు తరలించారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ధర్మారం (బీ) గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బోధన్‌లో ఓ శుభకార్యానికి బయల్దేరారు. మంగళవారం తెల్లవారుజామున ధర్మారం బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కారు టైరు పేలి పక్కనే ఉన్న నిజాంసాగర్‌ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న అబ్దుల్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులు షేక్‌ హుస్సేన్‌, షఫీ, జిలానీ, అయ్యూబ్‌ కారులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే దారిలో వెళ్తున్న కొంతమంది కారును చూస్తున్నారే తప్ప వారిని కాపాడలేకపోయారు. డిచ్‌పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్సైలు డి.నవీన్‌, డి.వీరప్రసాద్‌గౌడ్‌ ఉదయం 5గంటల ప్రాంతంలో పరేడ్‌కు వెళ్తుండగా ప్రమాదాన్ని గమనించి వెంటనే నిజాంసాగర్‌ కెనాల్‌లోకి దిగి కారులో ఉన్న ఐదుగురిని కాపాడారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ప్రమాదంలో ఐదుగురికి బలమైన గాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురిని కాపాడిన ఆర్‌ఎస్సైలను కమాండెంట్‌ సత్యశ్రీనివాస్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.