ఆన్లైన్లో ఆహారం

- ఒక్క ఫోన్‌కాల్‌తో క్షణాల్లో పసందైన విందు
- స్విగ్గీ, జొమాటోకు పెరుగుతున్న ఆదరణ
- నిత్యావసర వస్తువులూ సరఫరా..
- ఉమ్మడి జిల్లాలో మారిన ట్రెండ్
- నిరుద్యోగ యువతకు ఉపాధి
రాజు.. ఒక సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా అనుకోకుండా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే రోజు ఆయన కూతురు పుట్టిన రోజు. ఎంతో గ్రాండ్‌గా చేద్దామనుకున్నా తాను అందుబాటులో లేకపోవడంతో ఎంతో మథన పడ్డాడు. దీన్ని గమనించిన ఆయన కొలీగ్ ఓ సలహా ఇచ్చాడు. దాంతో ఆయన ఇక్కడ లేకున్నా కూతురు పుట్టిన రోజును అనుకున్నట్లుగానే ఎంతో గ్రాండ్‌గా చేశాడు. దీనంతటికీ ‘ఆన్లైన్' ఎంతో దోహదం చేసింది. ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో కేక్, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆన్లైన్లో పేమెంట్ చేశాడు. డెలివరీ బాయ్స్ ఆర్డర్లను ఇంటికి చేర్చడంతో ఎలాంటి చింతా లేకుండా పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగిపోయింది. ఇలా రాజు ఒక్కడే కాదు చాలా మంది ‘ఆన్లైన్'పై ఆధారపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు తమ సేవలు అందిస్తున్నాయి. అనుకున్న సమయానికి ఆహారం డెలివరీ ఇస్తుండడంతో వినియోగదారుల్లో వీటిపై నమ్మకం ఏర్పడింది. ఆహారపదార్థాలు సరఫరా చేసే సంస్థలతోపాటు నిత్యావసర వస్తువులు, కూరగాయలు సరఫరా చేసే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది.
విద్యానగర్ / ఖలీల్‌వాడి :
ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అంత్యంత వేగంగా మన జీవన గమనం కొనసాగుతున్నది. పల్లెలు పట్టణాలుగా విస్తరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ప్రపంచమంతా ఒక్క చోటుకు చేరింది. ఈ క్రమంలో కుటుంబాల్లో ఆహారపదార్థాలు తయారు చేసుకునే స్థితి నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఆహారపదార్థాలే కాదు.. నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులు, బేకరీ పదార్థాలు, చికెన్, మటన్, చేపలు వంటివి కూడా స్విగ్గీ, జొమాటో వంటి ఈ- కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి ఆర్డర్ చేసి కొద్ది నిమిషాల్లోనే పొందుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ సంస్థలు సైతం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆహార పదార్థాలు, వస్తువులను వారి ఇంటి వద్దకు చేరుస్తున్నాయి.
డెలివరీ బాయ్‌లకు ఉపాధి
స్విగ్గీ, జొమాటో సేవల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. కామారెడ్డి పట్టణంలో స్విగ్గీలో ఏడుగురు, జొమాటోలో 20 మంది డెలివరీ బాయ్‌లు పనిచేస్తున్నారు. నిజామాబాద్‌లో స్విగ్గీలో 10 మంది, జొమాటోలో 25 మంది వరకు డెలివరీ బాయ్‌లు విధులు నిర్వహిస్తున్నారు. పట్టణం, నగరంలో ఆరు నుంచి 12 కిలో మీటర్ల పరిధిలో ఆర్డర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో బాయ్ 13 నుంచి 15 డెలివరీలు చేస్తుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11.30 వరకు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. యాప్‌లో తాము ఉన్న లొకేషన్‌ను బట్టి ఏయే రెస్టారెంట్లు ఉన్నాయో మెనూ ప్రకారం ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలో అంతా వినియోగదారుడి ఇష్టం. బుక్ చేసిన తరువాత డెలివరీ ఎంత సమయంలో తెస్తారో తెలిసిపోతుంది. డెలివరీ బాయ్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వేడి వేడి ఆహారాన్ని ఆర్డర్ చేసిన వెంటనే రెస్టారెంట్లో ప్యాక్ చేసి రెడీగా ఉంచుతారు. డెలివరీ బాయ్స్ అక్కడికి చేరుకొని ఆర్డర్ల వారీగా వినియోగదారులకు చేరవేస్తారు.
ఆన్లైన్ సేవలకు మరింత క్రేజ్
గతంలో హైదరాబాద్, ముంబై వంటి మహానగరాల్లో మాత్రమే ఆన్లైన్ సేవలు ఉండేవి. ఇప్పుడు నిజామాబాద్ నగరంతోపాటు, కామారెడ్డి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా విజృంభణతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకుండా ఆన్లైన్ ఆర్డర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన క్షణాల్లోనే ఆహారం చేతికి అందుతోంది. స్విగ్గీ, జొమాటో ద్వారా ఆర్డర్ల పద్ధతి వేగంగా విస్తరించింది. చెప్పిన గంటలోపే మనకు కావాల్సిన ఆహార పదార్థాలు, వస్తువులు సరఫరా చేస్తున్నారు. సెలవు రోజుల్లో మరింత విస్తృతంగా ఆర్డర్లు అందుతున్నాయి. దీంతో ఆన్లైన్ సేవలకు మరింత క్రేజ్ పెరిగింది.
ఆధునికతవైపు వ్యాపారుల చూపు
ఆన్లైన్లో వినియోగదారులు ఆహార పదార్థాలతోపాటు నిత్యావసర వస్తువులైన కూరగాయలు, కిరాణా సామగ్రి, చికెన్, మటన్, చేపలు సైతం ఆర్డర్లకు అనుగుణంగా స్విగ్గీ, జొమాటో సంస్థలతోపాటు పలు వ్యాపార సంస్థలు సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంలోని కొందరు కిరాణా వ్యాపారులు తమ వద్దకు వచ్చే వినియోగదారులు ఆర్డర్ చేసి వెళ్తే వస్తువులను ప్యాక్ చేసి వారి ఇండ్లకు పంపిస్తున్నారు. అలాగే కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఫోన్ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. వ్యాపారులు సైతం ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సరఫరా చేసే వస్తువుల నాణ్యతలో రాజీ పడడంలేదు.
ఉపాధి లభిస్తోంది..
నేను డిగ్రీ వరకు చదివి కొరియర్లో పని చేశా ను. జొమాటో వచ్చిన త రువాత ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ రంగాన్ని ఎ ంచుకున్నాను. మాకు బా స్ ఉండరు. ఎన్ని ఆర్డర్లు వస్తే అంత సంపాదిస్తాం. రోజుకు 13 నుంచి 15 వరకు ఆర్డర్లు వస్తాయి. ఫోన్ ద్వారానే ఆర్డ ర్లు అందుతాయి. నిమిషాల్లో ఇంటి వద్ద అందజేస్తున్నాం.
-రాజశేఖర్,
జొమాటో డెలివరీ బాయ్, కామారెడ్డి
సంతృప్తిగా ఉంది
గతంలో దుకాణాలు, హోటళ్లకు వెళ్లి వారికి కా వాల్సిన ఆహార పదా ర్థాలు, వస్తువులను తీసు కెళ్లేవారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రతి రోజూ కస్టమర్లు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తున్నారు. ఈ వృత్తిపై నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను.
-భరత్, స్విగ్గీ డెలివరీ బాయ్, కామారెడ్డి
హోటల్‌కు వెళ్లకుండానే..
కుటుంబమంతా కలిసి భోజనం చేయాలనుకున్నప్పుడు బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇస్తే చాలు 15 నిమిషాల్లో ఇంటికి వ స్తుంది. కుటుంబమంతా కలిసి భోజనం చేయవ చ్చు. స్విగ్గీ, జొమాటో యాప్‌ల ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతోంది. టైం సేవ్ అవుతోంది. మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఇలాంటివి నిజామాబాద్‌లో మరిన్ని రావాలి.
-ప్రశాంత్, నిజామాబాద్
ఫోన్ ద్వారా ఆర్డర్లు
గతంలో పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలకు మా బేకరీకి వచ్చి అవసరమైన వస్తువులు తీసుకెళ్లేవారు. ఇప్పుడు కస్టమర్లు ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే.. క్షణాల్లో వారి ఇంటికే పంపిస్తున్నాం. స్విగ్గీ, జొమాటో ద్వారా వినియోగదారులకు అన్ని పదార్థాలను సరఫరా చేస్తున్నాం.
-రాజు, బేకరీ యజమాని, కామారెడ్డి
20 నిమిషాల్లో తీసుకొస్తున్నారు..
హైదరాబాద్ తరహా జిల్లాలో స్విగ్గీ, జొమాటో యాప్‌లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆర్డర్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల్లో వేడి వేడి బిర్యానీ తీసుకొస్తారు. మేము ఏ హోటల్లో ఆర్డర్ ఇస్తామో అక్కడి నుంచే తీసుకొస్తారు.
-అఖిలేష్గౌడ్, నిజామాబాద్
తాజావార్తలు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
- బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త
- నేపాల్, బంగ్లాకు 30 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్
- కల్తీ కల్లు ఘటన.. మత్తు పదార్థాలు గుర్తింపు