గురువారం 21 జనవరి 2021
Nizamabad - Dec 15, 2020 , 01:07:17

వ్యాపారులకు సంపత్తి

వ్యాపారులకు సంపత్తి

  • రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొని..వారి పేరిటే సీసీఐ కేంద్రాల్లో విక్రయం
  • క్వింటాలుకు రూ. 500 నుంచి 800 వరకు దోపిడీ
  • అన్నదాతను నిలువునా ముంచుతున్న దళారులు

పత్తిరైతు మళ్లీ దగాపడుతున్నాడు. వ్యాపారులు-సీసీఐ ఆడుతున్న నాటకంలో పంటను పండించిన రైతే బాధితుడుగా మిగులుతున్నాడు. కామారెడ్డి జిల్లాలో గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్‌, లింగంపేట్‌ తదితర మండలాల్లో పత్తిని సాగుచేస్తున్నారు. అయితే ముందుగానే రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఉద్దెరకు ఇస్తున్న వ్యాపారులు.. పంట చేతికి వచ్చాక తక్కువ ధరకే రైతుల నుంచి పత్తిని లాగేసుకుంటున్నారు. రూ.4800- 5200కు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు దాన్నే తిరిగి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.5725కు విక్రయిస్తున్నారు. క్వింటాలుపై రూ.500 నుంచి రూ.800 వరకు లబ్ధిపొందుతున్నారు.

- గాంధారి

గాంధారి : ఆరుగాలం కష్టం చేసిన రైతులు నష్టపోతుంటే.. వారి అవసరాలు, అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. పత్తి రైతులను నిలువునా ముంచుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను దక్కించుకుంటున్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారు. సీసీఐ కేంద్రాల్లో క్వింటాలు పత్తికి రూ.5725 ధర ఉండగా.. వ్యాపారులు మాత్రం రూ. 4800 నుంచి గరిష్ఠంగా రూ. 5200 చెల్లిస్తున్నారు. అనంతరం అదే రైతుల పట్టా పాస్‌ పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్లను సేకరించి సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్‌, లింగంపేట్‌ తదితర మండలాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాలకు తరలించినట్లు సమాచారం.  

విత్తనాలు, ఎరువులు ఉద్దెర ఇస్తూ..

చాలా మంది వ్యాపారులు రైతులకు విత్తనాలతోపాటు పురుగు మందులు, ఎరువులను ఉద్దెర ఇస్తున్నారు. డబ్బులు వసూలు చేసుకోవడానికి రైతులు పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో అవసరమున్నప్పుడు తమకు ఉద్దెర ఇస్తారో.. లేదోననే భయంతో చాలా మంది రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులకు తక్కువ ధరకే పంటలను అమ్ముకుంటున్నారు. అలా కొనుగోలు చేసిన పత్తిని తమకు నమ్మకంగా ఉన్న రైతుల పేర్లతో సీసీఐ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేసిన అనంతరం వ్యాపారులు తీసుకుంటున్నారు. ఇలా చాలామంది రైతులు నష్టపోతుండగా.. వ్యాపారులు మాత్రం క్వింటాలుకు రూ.500 నుంచి రూ.800 వరకు లబ్ధిపొందుతున్నారు.

డబ్బుల అత్యవసరం మేరకు..

డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు తాము పండించిన పత్తిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకుంటే డబ్బులు రావడానికి 15 నుంచి 20 రోజుల సమయం పడుతుండడంతో డబ్బుల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు చెప్పిన ధరకే పత్తిని అమ్ముకోవాల్సి వస్తున్నది. కొందరు రైతులు కుటుంబ అవసరాలు, ఇతర అత్యవసరాల మేరకు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. పంటలు చేతికి వచ్చాక అప్పు తీర్చే క్రమంలోనూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా గాంధారి మండలంలో పదుల సంఖ్యలో వ్యాపారులు పత్తి రైతులను ముంచుతున్నారు. 

దూరంగా సీసీఐ కేంద్రాలు..

సీసీఐ కేంద్రాల్లో చెల్లిస్తున్న మద్దతు ధరకు పత్తిని అమ్ముకోవాలని చాలా మంది రైతులు ఆశిస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు దూరంగా ఉండడంతో అక్కడివరకు వెళ్లడంలేదు. ఇదే అదునుగా వ్యాపారులు పెద్ద ఎత్తున రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్‌, రాజంపేట, మాచారెడ్డి తదితర మండలాల్లో పత్తిపంటను సాగు చేస్తున్నారు. దీనిని అమ్ముకోవడానికి  మద్నూర్‌, నిర్మల్‌ జిల్లా భైంసాకు వెళ్లాల్సిందే. ఈ కేంద్రాలు ఆయా మండలాలకు దూరంగా ఉండడంతో స్థానికంగా దళారులను ఆశ్రయిస్తున్నారు.

నమ్మకం ఉన్న రైతుల పేర్లతో..

రైతుల నుంచి సేకరించిన పత్తిని వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందుతున్నారు. ఇందుకోసం తమకు నమ్మకంగా ఉన్న రైతులను ఎంచుకొని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. దళాలరులకు చెక్‌ పెట్టేందుకు పత్తి సాగు చేస్తున్న రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నది. కానీ కొందరు వ్యాపారులు వ్యవసాయాధికారుల నుంచి ఆ జాబితాను సేకరించి అందులో తమకు నమ్మకంగా ఉన్న రైతులను ఎంచుకుంటున్నారు. అనంతరం వారి వివరాలతో సీసీఐ కేంద్రంలో పత్తిని అమ్మేస్తున్నారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయగానే వ్యాపారులు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొంత కమీషన్లు కూడా ఇస్తున్నారు. వ్యాపారులు ఇలాంటి మోసాలకు పాల్పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.logo