గురువారం 28 జనవరి 2021
Nizamabad - Dec 15, 2020 , 01:07:17

కొలువుల సంబురం

కొలువుల సంబురం

  • రాష్ట్రవ్యాప్తంగా శాఖల వారీగా భర్తీకి ప్రభుత్వ నిర్ణయం

  • ఉమ్మడి జిల్లాకు నాలుగు వేల పోస్టులు దక్కే అవకాశం
  • ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో విద్యా వ్యవస్థకు ఊపిరి 
  • పోలీసు, ఇతర శాఖల్లోనూ ఖాళీల భర్తీకి సన్నాహాలు
  • ప్రభుత్వ  ప్రకటనపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం.. నిరుద్యోగుల్లో ఆనందం

తెలంగాణ ఉద్యమానికి ప్రధాన భూమికల్లో.. నీళ్లు, నిధుల తర్వాత అత్యంత కీలకమైనది నియామకాలే. సమైక్య రాష్ట్రంలో కొలువుల భర్తీ అంతంతమాత్రమే. ఒకవేళ నోటిఫికేషన్‌ వేసినా అందులో తెలంగాణలో చూపించే ఖాళీలు అత్యల్పం. ఆ ఆవేదనతో  రగిలిన యువత ఉద్యమంలో పిడికిలెత్తిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పరిస్థితి మారింది. ఆరేండ్లుగా స్వరాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ద్వారా అనేక ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. గ్రూప్‌-2, గ్రూప్‌-4 నోటిఫికేషన్లలో అత్యంత పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగ భర్తీలో నిరుద్యోగ యువతకు అనేక అవకాశాలు దక్కాయి. తాజాగా మరో 50వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. 

- నిజామాబాద్‌ ప్రతినిధి/ నమస్తే తెలంగాణ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  తెలంగాణ ప్రాంతంలో కొలువుల భర్తీ ఊసే ఉండేది కాదు. ఆయా ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడినా గుట్టు చప్పుడు కాకుండానే భర్తీచేసేవారు. దొడ్డి దారిన  నియామకాలు జరిగేవి. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాల్లోనూ డబ్బులు ఇచ్చినోడికే పెద్ద పీట దక్కేది. ఉద్యోగ ప్రకటనలు వచ్చినా తెలంగాణలో చూపించే ఖాళీల వివరాలు అత్యంత స్వల్పం. సీమాంధ్ర ప్రాంతంలో దండిగా నియామకాలు చేపట్టి మన ప్రాంతానికి ఆంధ్రా పాలకులు దశాబ్దాలుగా చేసిన అన్యాయాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌  చరమగీతం పాడారు. ఏపీపీఎస్సీ స్థానంలో పురుడు పోసుకున్న టీఎస్‌పీఎస్సీ ద్వారా అనేక ఉద్యోగ ప్రకటనలు గడిచిన ఆరేండ్లలో వెలువడ్డాయి. గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌లలో అత్యంత పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగ భర్తీలో మన యువతకు అనేక అవకాశాలు దక్కాయి. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వేలాది కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులు సైతం భర్తీ అయ్యాయి. ఇలా ఒకటేమిటి ట్రాన్స్‌కో, జెన్‌కో, విద్యుత్‌ పంపిణీ సంస్థలోనూ వేలాది ఉద్యోగాలు భర్తీ కాగా... మరో 50వేల ఉద్యోగాలకు త్వరలో కొత్తగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. సీఎం కేసీఆర్‌ తాజాగా చేసిన ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి.

వేల మందికి ఉద్యోగాలు...

స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కాయి. వ్యవసాయ శాఖలోనే ఉమ్మడి జిల్లాలో సుమారు వందలాది మందికి ఉద్యోగాలు లభించాయి. ఏఈవో పోస్టులను మూకుమ్మడిగా ప్రభుత్వం భర్తీ చేయడంతో బీఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసిన పట్టభద్రులకు అవకాశాలు ఇట్టే వచ్చాయి. ఆయా ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు సైతం భారీగా భర్తీ అయ్యాయి. ఎన్పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌ ఉద్యోగాలు సైతం వందలాది ఖాళీలను యాజమాన్యం భర్తీ చేసింది. పోలీస్‌ శాఖలో పలు దఫాలుగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ జరిగింది. గ్రూప్‌ -2తోనూ గెజిటెడ్‌ ఉద్యోగాలు పొందిన వారు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో అనేక మంది ఉన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని ఉద్యోగ సంఘాల అంచనాలు చెబుతున్నాయి. మన ఉద్యోగాలు..మనకే అనే నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఆరేండ్ల స్వరాష్ట్రంలో దిగ్విజయంగా అమలవుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరిగిన అన్యాయం కాస్తా 2014, జూన్‌ 2 నాటికే భూ స్థాపితమైంది. స్వరాష్ట్రంలో ఉద్యమ సారథియే సీఎం కావడంతో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ ట్యాగ్‌ లైన్‌ ప్రధాన ఉద్దేశం కార్యరూపం దాల్చింది. మన ఉద్యోగాలు మనకే దక్కుతుండడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది.

ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల ఖాళీలు

సీఎం కేసీఆర్‌ చేసిన 50వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఆయా శాఖల్లో అవసరమైన పోస్టుల వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో ఎక్కడెక్కడ ఏ స్థాయి ఉద్యోగి అవసరమో లెక్కలు తీస్తున్నారు. ప్రధానంగా విద్యా, పోలీస్‌ శాఖల్లో ఇప్పటికే ఖాళీలు భర్తీ కాగా ఇంకా అవసరమైన సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం విద్యా శాఖలో వేలాదిగా ఖాళీలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అనేకచోట్ల విద్యా వలంటీర్లతో బోధన కొనసాగిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలుండే అవకాశాలున్నాయి. ఇకపోతే మిగిలిన శాఖల్లోనూ భారీగా ఖాళీలున్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా జిల్లాలు ఏర్పడడంతో సిబ్బంది కొరత వేధిస్తోంది. పలు శాఖల్లో తీవ్రమైన కొరత ఉండడంతో వాటి భర్తీకి త్వరలోనే ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం

రాష్ట్ర వ్యాప్తంగా 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం చేసిన ప్రకటనను టీఎన్జీవో తరఫున స్వాగతిస్తున్నాము. ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక శాఖల్లో ఖాళీలను భర్తీ చేసిన ప్రభుత్వం భారీ స్థాయిలో మరిన్ని పోస్టులను భర్తీకి సన్నాహాలు ప్రారం భించడం హర్షించదగిన విషయం. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీచేయడం ద్వారా సర్కారు ఆశిస్తున్న పరిపాలనా వికేంద్రీకరణ మరింత పకడ్బందీగా జరుగుతుంది.

- దయానంద్‌, టీఎన్జీవో అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా

ఉపాధ్యాయుల భర్తీతో విద్యాభివృద్ధికి దోహదం

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం మంచి నిర్ణయం. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాము. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నది. ఖాళీలను భర్తీ చేయడం ద్వారా గ్రామాల్లో విద్యా వ్యాప్తి పకడ్బందీగా జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరగా సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే మరిన్ని ఖాళీలు ఏర్పడుతాయి. ఉద్యోగోన్నతులు ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే ఇంకా మంచిది.

- దామోదర్‌ రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లాlogo