నేటి నుంచి రిజిస్ట్రేషన్లు షురూ

- మూడు నెలల తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
- ఉమ్మడి జిల్లాలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాట్లు
- రోజుకు 24 స్లాట్లకు మాత్రమే అవకాశం
- నిలిచిన లావాదేవీలను పునరుద్ధరించేందుకు ‘రియల్' వ్యాపారుల ఆసక్తి
- అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడాలని సర్కారు ఆదేశం
..మూడు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతుండడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముందస్తు ఏర్పాట్లకు శని, ఆదివారాల్లోనూ ప్రభుత్వం పని దినాలుగా ప్రకటించింది. కాగా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. ఇందుకోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు, అమ్మకందారులు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే కేటాయిస్తారు. ఆ తర్వాత డిమాండ్ మేరకు వాటిని పెంచే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. కాగా ఇప్పటికే తహసీల్ కార్యాలయాల్లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.
-నిజామాబాద్ ప్రతినిధి/నమస్తే తెలంగాణ
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మూడు నెలలుగా నిలిచిపోయిన వ్యవసాయేతర భూములు, ఆస్తులకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సులభమైన పద్ధతిలో ఆస్తుల విలువలకు అనుగుణంగా ఆన్లైన్ పద్ధతిలో చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. వ్యవసాయేతర భూములకు సంబంధించి ధరణిలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో ప్రస్తుతానికి పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. మరోవైపు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారమే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల సర్వర్ మొరాయించడంతో ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకోనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముందస్తు ఏర్పాట్లకు శని, ఆదివారాల్లో నూ ప్రభుత్వం పని దినాలుగా ప్రకటించింది. స్థిరా స్తి కొనుగోలుదారుల స్లాట్ బుకింగ్ ఆధారంగా సోమవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా...
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రియ ల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు వంద రోజులుగా లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు లేక రియల్ వర్గాలు కలవరానికి గురయ్యాయి. వ్యాపారులు, బిల్డర్లతో పాటు ఒప్పందాలు చేసుకున్న వారు ఆందోళన చెందారు. ముందుగా వ్యవసాయ భూములు మాత్రమే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత వ్యవసాయేతర భూములకు సైతం ఇదే పద్ధతిని కొనసాగించేలా కసరత్తు ప్రారంభించింది. అయితే వివిధ దశల్లో తలెత్తిన సాంకేతిక కారణాలతో చివరికి పాత పద్ధతికే మొగ్గు చూపింది. గతంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తయారు చేసిన కార్డు(కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) సాఫ్ట్వేర్ ద్వారానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేన్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్(జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం), భీమ్‌గల్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, దోమకొం డ, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా నూతన రెవె న్యూ చట్టం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయగా, నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్ ద్వారా తహసీల్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపడుతున్నారు.
వేలల్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు...
ఉమ్మడి జిల్లాలో సుమారుగా రోజుకు రూ.అర కోటికి పైగానే ఆదాయం వస్తుండేది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 30వేలకు పైగానే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ నెల 10న పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, పాన్ కార్డు తప్పనిసరి అని సూచించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా లు సిద్ధమయ్యాయి. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారో అని ప్రజలు మూడు నెలలుగా ఎదురు చూశారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు, అమ్మకందారులు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుం ది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాత చార్జీలే అమలులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఆస్తి వివరాలు న మోదు చేయగా నే సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీ, స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీల చెల్లింపు వివరాలు జనరేట్ అవుతా యి. ఆధార్ ఇవ్వని వారి కోసం ప్రత్యేక పద్ధతిని పాటిస్తారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే కేటాయిస్తారు. ఆ తర్వాత డిమాండ్ మేరకు వాటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యను ఎప్పటికప్పుడు టెక్నికల్ టీం పరిష్కరిస్తుంది. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కోసం www.registration.telangana.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షులు తమ ఐడీ ఫ్రూఫ్‌తో హాజరు కావాల్సి ఉంటుంది.
భారీగా క్రయవిక్రయాలు..
సోమవారం నుంచి ప్రారంభమవుతున్న వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. సెప్టెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో క్రయ, విక్రయదారులు ఎదురుచూపులకే పరిమితం అయ్యారు. స్థిరాస్తి వ్యాపారులైతే రిజిస్ట్రేషన్లు ఎప్పుడు మొదలవుతాయా? అని కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్న దృష్ట్యా ఇప్పటికే 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిజామాబాద్, కా మారెడ్డి జిల్లాల్లో సిద్ధమయ్యాయి. ఉభయ జిల్లాల్లో భూక్రయ, విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. జిల్లాలో భూముల రేట్లు సైతం రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోనే ఆస్తుల క్రయ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. అం దుకే స్థిరాస్తి వ్యాపారుల చూపు కామారెడ్డితో పా టు నిజామాబాద్ నగరంపై పడింది. విలీన గ్రా మాల నుంచి భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్ పురపాలక సం ఘాల పరిధిలో పలు గ్రామాలు విలీనం కావడంతో మారుమూల ప్రాంతాలకు ప్రధాన కేం ద్రంగా ఉన్న పురపాలికల నుంచి రిజిస్ట్రేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రిజిస్ట్రేషన్లకు సర్వం సిద్ధం...
వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీని కోసం అంతా సిద్ధం చేశాం. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ కోసం కొనుగోలుదారులు తమ ఆస్తికి అవసరమైన స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లను మాత్రమే కేటాయించారు.
- ఎం.రవీందర్ రావు, ఉమ్మజి జిల్లా రిజిస్ట్రార్
తాజావార్తలు
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- అలాగైతే ప్రజాస్వామ్యానికి తీరనిముప్పు: బాంబే హైకోర్టు సంచలనం
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ