ఆదివారం 24 జనవరి 2021
Nizamabad - Dec 12, 2020 , 00:57:52

ప్రేమించి పెండ్లాడి.. మృత్యువుతో ఓడి..

ప్రేమించి పెండ్లాడి.. మృత్యువుతో ఓడి..

  • మనువాడిన గంటల్లోనే మృత్యువాత
  • పోలీసుల రక్షణ కోరేందుకు వెళ్తుండగా ఢీకొన్నగుర్తుతెలియని వాహనం 
  • యువతి అక్కడికక్కడే దుర్మరణం.. దవాఖానలో యువకుడు మృతి 

వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కొన్ని రోజులు ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో పెండ్లి చేసుకున్నారు.. అనంతరం తమకు రక్షణ కల్పించాలని కోరేందుకు పోలీసుస్టేషన్‌కు బయల్దేరారు.. ఇంతలోనే గుర్తు తెలియని వాహనం వారి ప్రాణాలను బలి తీసుకున్నది. ప్రేమించుకొని జీవితాంతం ఒకటిగా కలిసి ఉందామనుకున్న ఆ జంట మృత్యు ఒడిలోకి చేరింది. ఈ హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకున్నది

- సదాశివనగర్‌ 

సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ జంట మృత్యవాత పడిందని సదాశివనగర్‌ సీఐ వెంకటయ్య, ఎస్సై నరేశ్‌ శుక్రవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌ మండలంలోని మోడెగామకు చెందిన బట్టు సతీశ్‌(24) తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. దీంతో అతడు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అక్కడే ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతడికి హైదరాబాద్‌లోని గండిమైసమ్మ ప్రాంతంలో ఉండే మహిమ(22)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలకు చెప్పకుండానే గురువారం హైదకాబాద్‌లో పెండ్లి చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కప్పించాలని కోరేందుకు సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌కు బయల్దేరారు. సదాశివనగర్‌లో బస్సు గురువారం రాత్రి దిగి రోడ్డు దాటుతున్నారు. ఈక్రమంలో గుర్తు తెలియని వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో పడి ఉన్న విషయాన్ని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మహి మ మృతిచెందడంతో మృతదేహాన్ని కామారెడ్డి ప్రభు త్వ దవాఖానకు, తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు పోలీసులు తమ వాహనంలో తరలించారు. సతీశ్‌ చికిత్స పొం దుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడని పోలీసులు తెలిపారు. విషయాన్ని పోలీసులు మహిమ కుటుంబీకులకు చేరవేశారు. దీంతో వారు కామారెడ్డికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. తమ కూతురు గురువారమే ఇంట్లో నుంచి వెళ్లిందని మహిమ తల్లి నిర్మల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్‌లోనే ఉంటే బతికేవారేమో.. 

ప్రేమించి పెండ్లి చేసుకున్న ఇద్దరూ మృత్యువాత పడడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఉంటే ప్రాణాలతో ఉండేవారేమోనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెండ్లి చేసుకున్న ఆనందం తీరకముందే మృ త్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. వారి మృతితో అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. 

మృతిపై పలు అనుమానాలు.. 

నవదంపతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రహదారిపై ఇద్దరు పడి ఉండడంతో పోలీసులు ఒకరిని కామారెడ్డికి, మరొకరిని నిజామాబాద్‌కు ఎందుకు తరలించారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. గుర్తు తెలియని వాహనం ఢీకొడితే శరీరం అంతా తీవ్ర గాయాలు కావాల్సి ఉండగా.. సతీశ్‌కు కేవలం ముఖంపై మాత్రమే గాయాలు ఉండడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. సతీశ్‌ చాలా రోజుల క్రితమే హైదరాబాద్‌కు వెళ్లగా.. పెండ్లి చేసుకున్న అనంతరం వారు సదాశివనగర్‌కు ఎందు కు, ఎలా వచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారిని ఎవరైనా కొట్టి పడేశారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. logo