శనివారం 23 జనవరి 2021
Nizamabad - Dec 12, 2020 , 00:57:52

ధాన్యలక్ష్మి1748 కోట్లు!

ధాన్యలక్ష్మి1748 కోట్లు!

  • పుట్లకొద్దీ వడ్లు.. కోట్లకొద్దీ కొనుగోళ్లు
  • ఉమ్మడి జిల్లాలో రూ.1748 కోట్ల చెల్లింపులువెల్లువెత్తిన వరి  
  • రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో సంపూర్ణంగా కొనుగోళ్లు
  • సకాలంలో రైతు ఖాతాల్లో డబ్బులు జమ  
  • నిజామాబాద్‌లో 5.55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • కామారెడ్డిలో 3.70 లక్షల మెట్రిక్‌ టన్నులు.. 
  • కష్టకాలంలోనూ సమన్వయంతో వ్యవహరించిన యంత్రాంగం

ఈసారి వానకాలం సీజన్‌లో బంగారం పండింది. పుట్లకొద్దీ వడ్ల దిగుబడి రావడంతో ఇంటింటా ధాన్యలక్ష్మి కళకళలాడింది. సకాలంలో కురిసిన వానలతో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కరోనా కష్టకాలంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతిగింజనూ కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రప్రభుత్వం.. ధాన్యం సేకరణలో ముందుచూపుతో వ్యవహరించింది. ఫలితంగా నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో మొత్తం 786 కొనుగోలు కేంద్రాల ద్వారా.. 9.26లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వడ్ల డబ్బులు రూ.1748కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. ఇంత పెద్దమొత్తంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఓ రికార్డు.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వానకాలం సీజన్‌లో వరి పంట ఉత్పత్తులు ఊరూరా వెల్లువెత్తాయి. సకాలంలో వానలు, కలిసి వచ్చిన వాతావరణంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పంట చేతికొచ్చే సమయానికి అక్కడక్కడా పంట నష్టం సంభవించినప్పటికీ మొత్తంగా దిగుబడులు మాత్రం పెద్ద ఎత్తున రావడం విశేషం. పంటల విస్తీర్ణం పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి అప్రమత్తంగా ఉంది. చేతికి పంట వచ్చే నాటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వానకాలం 2020 సీజన్‌లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ధాన్యం సేకరణను నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల యం త్రాంగాలు సకాలంలో పూర్తి చేశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం సేకరణ పూర్తి కావడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. నిజామాబాద్‌ జిల్లానూ 95శాతం మేర పంట ఉత్పత్తులను సేకరించగా మిగిలిన కేంద్రాల పరిధిలోని వరి ధాన్యా న్ని మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో వానకాలంలో వరి ధాన్యం 9లక్షల 26వేల 328 మెట్రిక్‌ టన్నుల మేర పోటెత్తింది. వీటి విలువ రూ.1748.79 కోట్లు కావడం గమనార్హం. పంటల సేకరణకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 786 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం రికార్డు.

సర్కారు ప్రోత్సాహం..

వానకాలం సీజన్‌లో రైతులు తమకున్న గుంట భూమిని కూడా వ్యవసాయానికి వాడుకున్నారు. పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తుల ను గణనీయంగా రాబట్టారు. సర్కారు అందిస్తున్న  సహాయ, సహకారాలను ఫలవంతం చేసుకున్నారు. రైతుబంధుతో పెట్టుబడులు సమకూ రాయి.  గతంలో సీజన్‌ సమయం ఆసన్నమవుతుండగా రైతుకు చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఇప్పుడేకంగా రైతుల చెంతకే రైతుబంధు రూపం లో ఎకరాకు రూ.5వేలు చొప్పున నగదు రావడంతో  చింత లేకుండా పోయింది. సకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి రైతుబంధు కలిసి వచ్చింది. దీంతో పాటుగా ఉచితంగా 24గంటల కరెంటు సరఫరా, కాలువల ద్వారా పంటలకు సాగు నీరు, అందుబాటులో వ్యవసాయ అధికారులు, సలహాలు, సూచనలు అందివ్వడానికి క్షణాల్లో వాలిపోయే శాస్త్రవేత్తలతో రైతులకు కొండంత అండగా లభించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కలిసి రావడం, కొనుగోలు కేంద్రాలూ విస్తారంగా ఏర్పా టు చేయడంతో అన్నదాతలకు వ్యవసాయం పం డుగలా మారింది. నిజామాబాద్‌ జిల్లా వానకాలం 2020 సీజన్‌లో ధాన్యం సేకరణకు 445 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 92,327 మంది రైతుల నుంచి రూ.1048కోట్లు విలువ చేసే 5లక్షల 55వేల 382 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని యంత్రాంగం సేకరించింది. కామారెడ్డి జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,02,097 మంది రైతుల నుంచి రూ.700.23 కోట్లు విలువ చేసే 3లక్షల 70వేల 946 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గమనార్హం.

రైతుకు ‘మద్దతు’ ధర...

ఉమ్మడి రాష్ట్రంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడే పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కే అవకాశం ఉండేది కాదు. మార్కెట్‌ యార్డుల్లో వ్యాపారులు, ఇతర మధ్యవర్తులు రైతుల పేరిట ధాన్యాన్ని విక్రయించకుండానే గోల్‌మాల్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఊరూరా ధా న్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. కొనుగోళ్లలో పారదర్శకత రెట్టింపు అయ్యింది. రైతుల ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకాలను అనుసంధానం చేసి వారి ఖాతాల్లోనే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు రైతులు ధాన్యం తీసుకెళ్తే వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేసే పరిస్థితులకు కాలం చెల్లింది. పండించిన ధాన్యానికి రైతులకు మద్దతు ధర దక్కేలా పౌరసరఫరాల సంస్థ ద్వారా పకడ్బందీ చర్యలు అమలవుతున్నాయి. మా పంటలు కొనాలంటూ రైతులు రోడ్డెక్కి వేడుకోవాల్సిన అవసరమే లేకుండా... రైతుల చెంతకే కేంద్రాలను తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రైతులు అంటున్నారు. ఏ చిన్న పొరపాటు లేకుండా కేంద్రాలను రైతుల ముంగిటకు తీసుకు పోవడంతో దోపిడీని నివారించడం సాధ్యమైంది. కనీస మద్దతు ధరను రైతుల ఖాతాల్లోకి నేరుగా వేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఏర్పాట్లు ఫలితాలు ఇస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనం..

రాష్ట్ర స్థాయిలో ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా ముందంజలో ఉంది. కొనుగోళ్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వేగంగా పంట ఉత్పత్తులను రైతుల నుంచి సేకరించాం. ధాన్యాన్ని సేకరించిన 48 గంటల్లోనే రైతు బ్యాంకు అకౌంట్లో కనీస మద్దతు ధరను జమచేసే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశాం. యంత్రాంగం సమష్టిగా కృషి చేయడం ద్వారా అన్ని జిల్లాల్లో కన్నా ముందుగానే కామారెడ్డిలో కొనుగోళ్లు పూర్తి కావడం గొప్ప విషయం. రైతులకు ఇబ్బందుల్లేకుండా ప్రక్రియను సజావుగా ముగించడం ఆనందంగా ఉంది.

- డా.ఎ.శరత్‌, కలెక్టర్‌, కామారెడ్డి  


logo