శనివారం 23 జనవరి 2021
Nizamabad - Dec 11, 2020 , 00:27:13

సాగుకు సన్నద్ధం..!

సాగుకు సన్నద్ధం..!

  • యాసంగి సీజన్‌కు సిద్ధమైన రైతులు
  • ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్న అధికారయంత్రాంగం 
  • సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి..
  • ఉభయ జిల్లాల్లో 8.18లక్షల ఎకరాల్లో సాగు అంచనా
  • గత సీజన్‌తో పోల్చితే అదనంగా 40వేల ఎక రాల్లో పంటలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో జిల్లాలో యాసంగి సాగు జోరందుకోనుంది. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు ఉభయ జిల్లా ల్లో సుమారు 8.18లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనున్నట్లుగా తెలుస్తున్నది. ఓవైపు భూగర్భ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉండడం, మరోవైపు చెరువులు, కుంటల్లో నీటి కొరత లేకపోవడంతో మునుపెన్నడూ లేనివిధంగా యాసంగి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో వరద కాలువ ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయడం, చెరువులను నింపేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకోవడంతో బీడు భూములన్నీ పచ్చబడనున్నాయి. పంటల సాగు కు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలం లో పకడ్బందీగా పంపిణీ చేసేందుకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల యంత్రాంగం సిద్ధమవుతోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే అప్రమత్తమైంది. మక్కల సాగుకు సెలవు ప్రకటించి మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలని రైతులను వ్యవసాయాధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

నారు పోస్తున్న రైతులు.. 

యాసంగి సాగుకు ఓ వైపు రైతులు సన్నద్ధమవుతుండగా విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు తగిన సూచనలు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ సిద్ధమైంది. గతంతో పోలిస్తే వ్యవసాయ విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని అంచనాలు సిద్ధమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి అందించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈనెల 27వ తేదీ నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానుండడంతో సాగుబాటలో రైతులు బిజీ కానున్నారు. గతంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ యాసంగిలో ఎరువుల కొరత లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నీటి వనరులు అనుకూలంగా ఉన్నందున ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల రైతులు నారు పోస్తున్నారు. ఉభయ జిల్లాల్లో విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. వరి విత్తనాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. 2020-21 యాసంగి కాలానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ జోరుగా వ్యవసాయ భూములు సాగుకు నోచుకోనుండగా భిన్న పంటలు సాగయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని 3,31,901 ఎకరాల్లో, నిజామాబాద్‌ జిల్లాలోని 4,86,218 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే అంచనాలు సిద్ధం కాగా అందుకు తగిన ఏర్పాట్లను సైతం అధికారులు పూర్తి చేశారు.

పెరుగనున్న సాగు విస్తీర్ణం.. 

గతంలో సాగునీటి కొరత, కరెంట్‌ కోతలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైతం యాసంగిలో వరి వేయకుండా ఆరుతడే పంటలే సాగు చేయాలని రైతులకు సూచించేది. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. భారీ వర్షాలు కురిసి సాగు నీటి వనరుల నిండా నీరు ఉండడంతో ఎక్కువ మంది రైతులు వరి పంటను సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. వరి పంటనే ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ కూడా గుర్తించింది. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 4,86,218 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలుండగా ఇందులో వరి 3,13,106 ఎకరాల్లో సాగు కానుంది. కామారెడ్డి జిల్లాలో 3,31,901 ఎకరాలకుగాను వరి 1,85,500 ఎకరాల్లో సాగయ్యే అవకాశాలున్నాయి. పెరిగిన జలసంపదతో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. యాసంగి సాగు అంటేనే భయపడే రైతులంతా ఇప్పుడు కొండంత ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారడంతో సాగుకు సమాయత్తం అయ్యారు. యాసంగి పంటకు ఢోకా లేదన్న ఆత్మవిశ్వాసంతో అన్నదాతలు ముందుకు కదులుతున్నారు. గతేడాది 2019-20 యాసంగిలో కామారెడ్డి జిల్లాలో మొత్తం 3,22,726 ఎకరాల్లో పంటలు సాగవగా.. 2020-21 యాసంగిలో 3,31,901 ఎకరాలకు అంచనాలు సిద్ధమయ్యాయి. గతంతో పోలిస్తే బీడు భూములన్నీ సాగుకు నోచుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోనూ 2019-20 యాసంగిలో 4,53,534 ఎకరాల్లో పంటలు సాగవగా.. 2020-21 యాసంగిలో 4,86,218 ఎకరాల్లో ఈసారి పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింతగా పెరుగనున్నట్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికల ద్వారా స్పష్టమవుతున్నది. 

నిజామాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా వరి నాట్లు..

యాసంగి సీజన్‌లో పంటల సాగును నిజామాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి చొరవతో జిల్లావ్యాప్తంగా 29 మండలాల్లో వరి నాట్లు యాం త్రీకరణ పద్ధతుల్లో వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈసారి మండలానికి ఐదు గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశా రు. ఈ గ్రామాల్లోని ఆదర్శరైతులతో యాంత్రీకరణ ద్వారా పంటల సాగును పెంచనున్నారు. మరోవైపు ఎరువుల వాడకాన్ని తగ్గించి పెట్టుబడి ఖర్చుల నుంచి రైతుకు ఊరటను ఇచ్చే ప్రక్రియకు కలెక్టర్‌ శ్రీకారం చుట్టారు. ఇష్టానుసారంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను వాడడంతో భూసారం తగ్గి దిగుబడి కూడా అనుకున్నంత రావడం లేదు. ఫలితంగా రైతు నష్టపోవడంతో.. ఈ పరిస్థితిని మార్చేందుకు వరి సాగులో అవసరమైన మేరకే ఎరువులు వాడనున్నారు. యూరియాను మోతాదుకు మించి వాడొద్దని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.

రైతులకు అందుబాటులో...

యాసంగి పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల మేరకు సాగులో భిన్నమైన పద్ధతులను అవలంబించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ యాసంగిలో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగనున్నది. పుష్కలమైన జల సంపద అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. వరి పంట సాగుకే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులున్నా వ్యవసాయాధికారులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందవచ్చు. 

- సునీత, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారిణి, కామారెడ్డి.


logo