యాసంగికి లేదు రంది

- నిండుకుండల్లా నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు
- నిజాంసాగర్ కింద 80 వేలు, అలీసాగర్ కింద 80వేలు, గుత్ప ద్వారా 35 వేల ఎకరాలకు సాగునీరు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నీటితో కళకళలాడుతున్న చెరువులు
- పరుగులు పెడుతున్న గోదావరి
- సంతోషం వ్యక్తంచేస్తున్న అన్నదాతలు
వానకాలం సీజన్లో కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి పంటల సాగుకు రంది లేకుండా పోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 80వేలు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 80 వేలు, గుత్ప ఎత్తిపోతల కింద 35వేల ఎకరాల్లో పంటలకు సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. సాగునీటికి ఢోకా లేకపోవడంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు.
బోధన్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలకు తోడు ఈసారి ప్రకృతి కూడా కరుణించడంతో యాసంగి పంటలకు రైతులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. తెగుళ్ల బెడదతో వానకాలం సీజన్లో అక్కడక్కడ దిగుబడులు తగ్గినప్పటికీ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల సరఫరా మొదలుకొని కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలకు మద్దతు ధరను ఇచ్చింది. ప్రస్తుతం యాసంగిలో కోటి ఆశలతో రైతులు పంటల సాగుకు సిద్ధం అవుతున్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు తీసుకున్నది. నియంత్రిత విధానంలో పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు పొలంబాట పట్టారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు జిల్లాలోని భారీ ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ పూర్తిగా నిండాయి. వానకాలం సీజన్‌కే కాకుండా యాసంగి సీజన్‌కు ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు పుష్కలంగా అందనున్నది. మరోపక్క జిల్లాలో ప్రధానమైన అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల నిర్వహణకు కూడా పుష్కలంగా గోదావరి నదీ జలాలు లభించనున్నాయి. జిల్లాలోని చిన్నా, పెద్ద చెరువులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఇందుకు తోడుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవడం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా నిర్మిం చిన వరద కాల్వ ద్వారా జిల్లాలోని అనేక చెరువులకు నీటి లభ్యత పెరిగింది. జిల్లాలోని 24 ఎత్తిపోతల పథకాలు కూడా ఈసారి ఆయకట్టు భూములను నీరందించనున్నాయి. ప్రభుత్వ చేయూతకు తోడుగా ప్రకృతి ప్రసాదించిన సాగునీటితో వచ్చే యాసంగి సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా మారింది. జిల్లాలోని నదులు, వాగుల్లో జలసంపద ఫలితంగా భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 24గంటల ఉచిత విద్యుత్తుతో ఈ భూగర్భజలాలను రైతులు పూర్తిస్థాయిలో వినియోగించుకునే వెసులుబాటు ఏర్పడింది. వెరసి.. జిల్లాలోని వ్యవసాయభూములన్నీ అప్పుడే యాసంగి కళను సంతరించుకుంటున్నాయి.
నాలుగేండ్లకు పూర్తిస్థాయిలో నిండిన నిజాంసాగర్ ప్రాజెక్టు..
జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగేండ్ల తర్వాత పూర్తిగా నిండడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రాజెక్ట్‌గా నిజాంసాగర్‌కు పేరున్నప్పటికీ ఐదారు దశాబ్దాలుగా ప్రాజెక్టు పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇటీవల కాలంలో 2016లో మాత్రమే ప్రాజెక్టు నిండింది.
ఈసారి భారీ వర్షాలకు ఎగువన సింగూరు ప్రాజెక్టు నిండడం.. అక్కడి నుంచి వదిలిన నీరు తరలిరావడంతో నిజాంసాగర్ సైతం పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.8 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. మరోపక్క శ్రీరాంసాగర్ కూడా పూర్తిస్థాయిలో నిండడంతో ఆ ప్రాజెక్ట్ 90 టీఎంసీల నీటితో తొణికిసలాడుతున్నది. జిల్లాలోని రెండు భారీ ప్రాజెక్టులు పూర్తిగా నిండడం యాసంగిలో రైతులకు వరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ, గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల నుంచి భారీగా నీరు విడుదలచేసే అవకాశం ఉండడంతో, ఈ ఆయకట్టులో నిజాంసాగర్ నీటిని 80 వేల ఎకరాలకు అందించాలని, మిగతా 20 వేల ఎకరాలకు అలీసాగర్ ఎత్తిపోతల పథకం నీటిని అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో సమావేశమైన బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ ప్రతిపాదనలు రూపొందించింది. దీన్ని జిల్లా నీటిపారుదల అభివృద్ధి బోర్డు ఆమోదించాల్సి ఉంది.
ఎత్తిపోతల పథకాలకూ ఢోకా లేదు..
జిల్లా సరిహద్దులో ఇప్పటికీ నిండుగా ప్రవహిస్తున్న గోదావరి నదితో దీనిపై నిర్మించిన అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని నీటిపారుదలశాఖ భావిస్తోంది. వర్షాకాలంలో మాదిరిగానే ప్రస్తుతం గోదావరి, దాని ఉపనది మంజీరలో నీటి ప్రవాహం యాసంగి పంట సాగుచేసే రైతుల్లో కోటి ఆశలను చిగురింపజేస్తున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరగడంతో కాల్వల ద్వారా నీరందని వ్యవసాయభూముల్లో కూడా పంటలు జోరుగా సాగయ్యే అవకాశం ఏర్పడింది. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాలకు, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా 35 వేల ఎకరాలకు యాసంగిలో సాగునీరు అందించేందుకు బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇవే కాకుండా మంజీరానదిపై నిర్మించిన సాలూరా ఎత్తిపోతల పథకం, గోదావరి బ్యాక్ వాటర్‌ను వినియోగించుకునేందుకు నిర్మించిన చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి పథకం, నవాబ్ ఎత్తిపోతల పథకం, కందకుర్తి ఎత్తిపోతల పథకం ఈసారి పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు గోదావరి నది బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి నిర్మించిన జిల్లాలోని మరో 20 ఎత్తిపోతల పథకాలు కూడా ఈసారి రైతులకు ఉపయోగపడనున్నాయని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాల్వ పరిధిలోని 16 చెరువులు పూర్తిగా నిండాయి. జిల్లాలోని చెరువులన్నీ జలకళతో తొణికిసలాడడంతో ఆయకట్టు రైతులందరూ సాగును చేపట్టారు. ఇప్పటికే రైతులు నారుమళ్లను పోయగా, కొన్ని ప్రాంతాల్లో శనగ పంట సాగు చేశారు.
భూగర్భజలాలు పెరిగాయి..
గోదావరి పక్కన మా ఊరు ఉంది. ఈసారి గోదావరిలో పుష్కలంగా నీరు ఉండడం మా అదృష్టం. యాసంగిలో శనగను సాగుచేస్తున్నా ను. భూగర్భజలాలకు లోటులేకపోవడంతో శనగ పంటలో మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా.
జహంగీర్ బేగ్, రైతు, కందకుర్తి (రెంజల్)
పంటలకు పూర్తి భరోసా..
వర్షాలు సమృద్ధిగా కురవడంతో యాసంగి పంటలకు పూర్తి భరోసా ఏర్పడింది. వట్టిపోయిన బోర్లు సైతం భూగర్బ జలాలు పెరగడంతో తిరిగి పనిచేస్తున్నాయి. నారుమళ్లు వేసి నాట్లకు భూములను సిద్ధం చేస్తున్నాం. పంటలకు ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాం.
నాయుడు పోతన్న, రైతు, ఎడపల్లి.
తాజావార్తలు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష