బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 09, 2020 , 00:56:44

ఒకే దేశం.. ఒకే ధర అమలు చేసే దమ్ముందా?

ఒకే దేశం.. ఒకే ధర అమలు చేసే దమ్ముందా?

  • కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న
  • టేక్రియాల్‌ ధర్నాలో మోదీ సర్కార్‌పై విమర్శలు
  • రైతులను మోసం చేసే బీజేపీని నమ్మొద్దని రైతులకు పిలుపు
  • నల్ల చట్టాలతో నట్టేట ముంచుతున్న నరేంద్ర మోదీ
  • కేంద్ర సర్కారుపై దుమ్మెత్తిపోసిన ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మోదీ పుణ్యమా అని దేశమంతా రోడ్డెక్కిందని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశంగా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా  కొనసాగుతున్న రైతు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు. టేక్రియాల్‌ జాతీయ రహదారి 44పై నిర్వహించిన ధర్నాలో ఆమె ప్రసంగించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకు వచ్చిన మూడు చట్టాలను అన్నదాతలకు అర్థమయ్యే విధంగా కవిత వివరించారు. ప్రధానంగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పంటల విషయంలోనే ఇక్కట్లు ఉంటాయని చెప్పారు. అందులో ఇప్పటికే విత్తనాలు, ఎరువులను ప్రైవేటుపరం చేసి కర్షకులను కేంద్ర సర్కారు ఇబ్బందులకు గురి చేస్తున్నదని గుర్తు చేశారు. తాజాగా మూడు నూతన వ్యవసాయ చట్టాలతో పంటలను సైతం ప్రైవేటుపరం చేయడం దారుణమని పేర్కొన్నారు.  నకిలీ విత్తనాలు, పనిచేయని పురుగు మందులిస్తే పీడీ యాక్టు పెట్టాలని చెప్పిన దేశం లోనే ఏకైక సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని కవిత పేర్కొన్నారు.  

ఒకే దేశం... ఒకే ధర అమలు చేసే దమ్ముందా?

రైతుల సాక్షిగా ఒక్కటే అడుగుతున్నా.. ఒకటే దేశం.. ఒకటే మార్కెట్‌ అంటున్నారు కదా.. ఒకటే ధర ఇస్తామనే దమ్ముం దా అంటూ కేంద్ర సర్కారును ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్ర శ్నించారు. ఇవాళ రాష్ట్రంలో రూ.1800 ధరకు మక్కలు కొంటుం టే... జార్ఖండ్‌లో వేయి రూపాయలకే కొంటున్నారని తేడాలను వివరించారు. ఇలా కాకుండా దేశమంతా రూ.1800 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ఉండడంతో రైతులకు ఇక్కట్లు లేకుండా అన్ని పంటలకు మద్దతు ధర అందుతున్నదన్నారు. నూతన వ్యవసాయ చట్టా లు రైతుల నడ్డి విరిచే బిల్లులుగా కవిత అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎకరాకు రూ.5వేలు ప్రతీ సీజన్‌కు ఏటా రూ.10వేలు ఇస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం ఎకరాలతో సంబంధం లేకుండా కేవలం రూ.2వేలు ఇస్తూ చేతులు దులుపుకొంటున్నదని చెప్పారు. 

యాంటీ సోషల్‌ మీడియా...

రైతు ఉద్యమాలపై బీజేపీ శక్తులు చేస్తున్న కుయుక్తులను ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని చెప్పారు. బీజేపీ వారు విషం చిమ్ముతున్నారని, దీన్ని గమనించాల ని రైతులకు సూచించారు. దేశంలో వరి ఉత్పత్తిలో 6వ స్థా నం నుంచి 2వ స్థానంలోకి మన రాష్ట్రం  దూసుకు పోయిందన్నారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ సభ్యులను కవిత అభినందించారు. 

పసుపు బోర్డు ఏమైంది?

ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్‌  5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిండని... ఎవరికైనా పసుపు బోర్డు కనిపించిందా? అంటూ ఎమ్మెల్సీ కవిత రైతులను అడిగారు. ఐదు రోజులు పోయి రెండేండ్లు అయినా పత్తా లేదని మండిపడ్డారు. రైతు వ్యతిరేక బిల్లులు తెచ్చి మంచి జరుగుతుందని చెబుతుంటే ఇదే బీజేపీని నమ్ముదామా? అని రైతులను ప్రశ్నించగా దొంగ బీజేపీ అంటూ కర్షకులు ఆగ్రహంతో నినాదాలు చేశారు. ఓట్లేసుకుని పసుపు బోర్డు తీసుకురాలేని వారిని ఎలా నమ్మేదంటూ దుయ్యబట్టారు. బీజేపీ 2014 నుంచి ఇప్పటి దాకా చెప్పింది ఏదీ చేయలేదన్నారు. రైతులకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ అధినేత ఏ పిలుపునిచ్చినా మడమ తిప్పకుండా పోరాటం చేద్దామంటూ రైతులకు కవిత స్ఫూర్తిని నింపారు.

రైతులను నట్టేట ముంచుతున్న మోదీ : విప్‌ గంప గోవర్ధన్‌

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్‌ రెండు సార్లు బాధ్యతలు చేపట్టి రైతు పక్షపాతిగా సేవలు అందిస్తున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలవుతున్నా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ ఒక్క సామాన్య రైతుకు లాభం జరిగే విధంగా ప్రవర్తించలేదన్నారు. స్వయంగా రైతు బిడ్డ అయినటువంటి సీఎం కేసీఆర్‌ ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.  నల్ల చట్టాలతో మోదీ ఏకంగా రైతుల పొట్ట కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని, మోదీకి అదే గుణపాఠాన్ని దేశంలోని రైతాంగం నేర్పబోతున్నదని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరిచి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  

కార్పొరేట్‌ సంస్థల మేలు కోసమే చట్టాలు 

కామారెడ్డి : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు  కేవలం కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా దేశంలోని 25 రాజకీయ పార్టీలు, 40 కార్మిక, రైతు సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.  రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేస్తున్నది కేవలం మన రాష్ట్రమే. సీఎం కేసీఆర్‌ నిరంతరం రైతు హితం కోసమే పని చేస్తున్నారు.  

-బీబీ పాటిల్‌, జహీరాబాద్‌ ఎంపీ

అంబాని, అదానీల కోసమే కేంద్ర బిల్లులు

రైతులు పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చనే బిల్లులను కేంద్ర ప్రభుత్వం అంబాని, ఆదానీల కోసమే తెచ్చింది.  దేశంలోనే వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్నది కేవలం మన రాష్ట్రంలోనే.. బీజేపీతో ఏ రైతుకు ఉపయోగం లేదు, భావోద్వేగాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నది.   రైతులకు నష్టం కలిగించే చట్టాలపై బీజేపీ  నాయకులను ఎక్కడికక్కడే నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడుదాం.  

-నల్లమడుగు సురేందర్‌,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే logo