శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Dec 08, 2020 , 01:23:30

ఖాకీపై మరక!

ఖాకీపై మరక!

  • అక్రమార్కులతో పోలీసు శాఖకు తలవంపులు
  • డబ్బుల కోసం దిగజారుతున్న కొంతమంది పోలీసులు
  • కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ అరెస్టుతో కలకలం
  • వీఆర్‌ఎస్‌ కోసం ప్రయత్నించి అంతలోనే కటకటాలకు..
  • మార్కెట్‌ విలువ ప్రకారం ఆస్తులు రూ.30కోట్ల్ల పైమాటే!
  • డీఎస్పీ భూదందాకు పలువురు రెవెన్యూ అధికారుల సహకారం
  • అవినీతి, అక్రమాలతో పోలీసు శాఖపై మచ్చ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ అక్రమాస్తులపై పోలీసు శాఖలో విస్తృతంగా చర్చ సాగుతున్నది. 17 చోట్ల వ్యవసాయ భూములు, 5 నివాస స్థలాలు, 3 నివాస భవంతులను ఏసీబీ గుర్తించడంతో వీటి విలువపై ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. లక్ష్మీనారాయణ తనకు వచ్చే అక్రమ సంపాదనతో కూడబెట్టిన స్థిరాస్తులన్నీ హైదరాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ఉండడం గమనార్హం. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం తిరుమలగిరి, మిర్యాలగూడలోని జీ ప్లస్‌ త్రీ ఇండ్లు, సరూర్‌నగర్‌లోని జీ ప్లస్‌ 2 భవంతులే రూ. 10 కోట్లకు పైబడి ఉంటాయని అంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ని మచ్చబొల్లారంలో ఒకటి, మన్సూరాబాద్‌లో మరోటి, నిజామాబాద్‌ జిల్లా గూపన్‌పల్లి, ముబారక్‌నగర్‌లో మూడు ప్లాట్లు మొత్తం 5 ప్లాట్లు డిమాండ్‌ ఉన్నవే కావడం గమనార్హం. 17 చోట్ల వ్యవసాయ భూముల్లో కామారెడ్డి పట్టణ శివారులోని పాత రాజంపేట, నల్లగొండ జిల్లా గనుగుబండ, జాన్‌పహాడ్‌లో ఎకరాల కొద్దీ రూ.కోట్లు విలువ చేసే సాగు భూములున్నట్లు గుర్తించారు. పట్టుబడిన నగదు, బంగారం, వెండి ఆభరణాలన్నీ కలిపితే రూ.30 కోట్ల్ల నుంచి రూ.50కోట్ల  వరకు అక్రమాస్తులు ఉండొచ్చనే అంచనాకు వస్తున్నారు. హైదరాబాద్‌ తిరుమలగిరిలోని డీఎస్పీ ఇంట్లో కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు వ్యక్తుల పేరిట భూమి డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వాటిలో డీఎస్పీ ఇంట్లో పని చేసే ఓ ఇద్దరు వ్యక్తులతో పాటుగా వ్యాపారులకు సంబంధించినవీ ఉన్నట్లుగా తెలిసింది. ఇవి బినామీ ఆస్తులా?  సెటిల్‌మెంట్ల కోసం తీసుకువచ్చినవా? అన్నది తేలాల్సి ఉంది.

డీఎస్పీకి రెవెన్యూ అధికారుల లింకు...

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ అక్రమాస్తుల వ్యవహారంలో పలువురు రెవెన్యూ అధికారుల పాత్రపైనా విచారణ సాగే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే సంగారెడ్డిలో రూ.కోట్లు వి లువ చేసే భూ దందాలో పాత్రధారిగా  ఆర్డీవో సైతం ఉన్నట్లుగా తెలిసింది. కామారెడ్డి ఆర్డీవోగా పని చేసిన సదరు వ్యక్తి గతంలోనూ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పని చేశారు. ఆ సమయంలో డీఎస్పీ లక్ష్మీనారాయణతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. ఇరువురు కలిసి లాక్‌డౌన్‌కు ముందు సెటిల్‌మెంట్లు చేసినట్లుగా తెలిసింది. ఓ పేరొందిన వ్యక్తికి విలువైన అసైన్డు భూ మిని అప్పనంగా అప్పగించడంలో  డీఎస్పీ, సదరు రెవెన్యూ ఉన్నతాధికారి చేతులు కలిపారని సమాచారం. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారగా అసైన్డు భూమిపై అభ్యంతరాలు రాకుండా డీఎస్పీ తన అధికారాన్ని దుర్వినియో గం చేశారు. పాత రాజంపేటలో డీఎస్పీ వ్యవసాయ భూములు ఇప్పించడంలో గతంలో ఇక్కడ పని చేసినటువంటి ఓ వివాదాస్పద వీఆర్వో తెర వెనుక తతంగం నడిపినట్లు సమాచారం. అతగాడు ఏసీబీకి రెండుసార్లు పట్టుబడి తప్పించుకున్న వ్యక్తే కావడంతో డీఎస్పీతో దోస్తీ కుదిరింది. పోలీసులను అడ్డం పెట్టుకుని పాత రాజంపేటలో సామాన్యులను సదరు వీఆర్వో తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాడు. టేక్రియాల్‌ రోడ్డులో మరో నివాస స్థలంలోనూ డీఎస్పీ జోక్యం చేసుకోవడం ఏడాది క్రితం వివాదాస్పదమైంది. ఇందులో పరస్పర దాడులు, ఘర్షణలు జరిగా యి. ఇందులో నాటి దేవునిపల్లి ఎస్సై పాత్రతోపాటు స్థానిక సీఐ, డీఎస్పీలు చాకచక్యంగా వ్యవహరించారని తెలుస్తున్నది. బాధితులు కొందరు అట్రాసిటీ కేసు పెట్టడంతో డీఎస్పీ రాజీ ప్రయత్నాలు కూడా చేశారు. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి పోలీసు శాఖకు మచ్చ తెచ్చే ఘటనలు ఇలా అనేకం ఉన్నాయి. ప్రజల ముందు మంచి పనులు చేసి తలెత్తుకోవాల్సిన పోలీసు లు... వరుసగా ఏసీబీకి పట్టుబడుతూ తలదించుకునే విధంగా మారుతుండడం దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు.

కుటుంబ తగాదాలకు పెద్దన్న పాత్ర...

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ తీరు ఆది నుంచి వివాదాస్పదమనే ఆరోపణలున్నాయి. ఠాణాకు వచ్చే ప్రతీ కేసును డబ్బులకు ముడిపెట్టనిదే వదిలేది కాదన్న విషయం పోలీసు శాఖలో అందరికీ తెలిసిందే. నిజామాబాద్‌ రూరల్‌ సీఐగా పని చేసిన నాటి నుంచి కుటుంబ తగాదాలకు పెద్దన్న పాత్ర పోషించేవారనే పేరుంది. ఉన్నతాధికారులను మేనేజ్‌ చేస్తూ అనేక కేసుల్లో చాకచక్యంగా తప్పించుకుంటూ రాగా... అనుకోకుండా బెట్టింగ్‌ వ్యవహారంలో కూపీ లాగుతుండగా డీఎస్పీ లక్ష్మీనారాయణ అక్రమాస్తుల కేసులో పట్టుబడడంపై తోటి ఉద్యోగులే విస్త్తు పోతున్నారు. తప్పు చేస్తే ఎన్నటికైనా చట్టం ముందు దోషిగా నిలబడడం ఖాయమని... అందుకు లక్ష్మీనారాయణ ఉదంతమే నిదర్శనమని పలువురు గుసగుసలాడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వృద్ధులను బయట తిప్పొద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ... డీఎస్పీ లక్ష్మీనారాయణ మాత్రం ఓ కేసులో రూ.లక్షలు పుచ్చుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారు. హన్మకొండలో ఉండే 70 ఏండ్ల   వృద్ధురాలిని ఓ విషయంలో అనవసరంగా కామారెడ్డికి పట్టుకొచ్చారు. కొవిడ్‌ 19 సమయంలో రాలేమని చెప్పినా... పిట్ట కథ లు చెప్పొద్దంటూ కామారెడ్డి పోలీసులు కఠినంగా వ్యవహరించారు. వృద్ధురాలి కొడుకుపైనే కేసులున్నాయని, తనను ఎందు కు ఠాణాకు రమ్మంటున్నారంటూ వేడుకున్నా డీఎస్పీ, సీఐలు మాత్రం కనికరించలేదు. ఈ వ్యవహారంలో కామారెడ్డి పట్టణ ఎస్సై(అరెస్టు కాని వ్యక్తి) స్వయంగా హన్మకొండకు వెళ్లి రావడం ఇందుకు నిదర్శనం.

పంచాయితీలకు అడ్డాగా.. 

కామారెడ్డి జిల్లాలో పోలీస్‌ శాఖ పనితీరు రాష్ట్రంలోనే గుర్తింపు సాధించింది. ఎస్పీ శ్వేతారెడ్డి దీర్ఘకాలంగా ఇక్కడ పని చేస్తూ ఎనలేని పట్టు సాధించారు. కామారెడ్డి జిల్లా ప్రారంభంతోనే కొత్త జిల్లాలో అరాచకాలను తొక్కి పెట్టారు. మహిళలపై దారుణాలను ఎక్కడికక్కడే ఎండగట్టారు. కేసుల ఫైలింగ్‌ వ్యవస్థను ఆన్‌లైన్‌ చేశారు. మండల స్థాయిలో మామూళ్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించారు. కామారెడ్డిలో పని చేయాలంటే చేతులు కట్టుకుని ప్రజలకు సేవ చేయాల్సిందేనన్న సంకేతాలు వెళ్లాయి. రెండున్నరేండ్ల కాలంలో సక్రమంగానే వ్యవస్థ నడిచింది. ఇందులోకి వక్రబుద్ధి గల కొంత మంది ఆఫీసర్లు పోస్టింగ్‌ల పేరిట చొచ్చుకొచ్చారు. రాచబాటలో నడుస్తున్న కామారెడ్డి పోలీసింగ్‌లో చీడపురుగై నిలిచారు. ఒక్కో రకంగా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఠాణాలను పంచాయితీలకు అడ్డాగా మార్చారు. డివిజన్‌ స్థాయిలో క్యాంపు కార్యాలయాన్ని సైతం సెటిల్‌మెంట్లకు కేంద్రంగా మార్చారు. జిల్లా కేంద్రంలో ఇంత జరుగుతున్నా అధికారులకు సమాచారం తెలియకుండా వ్యవస్థను క్రియేట్‌ చేశారు. అంతే... మూడేండ్లుగా గాడిలో పడుతూ వచ్చిన వ్యవస్థ కాస్త అదుపు తప్పి ప్రజలను వేధించడం వరకూ వెళ్లింది. ఏసీబీని ప్రజలు ఆశ్రయించడం, అక్రమార్కులు జైల్లో ఊచలు లెక్కించడం చకచకా జరిగిపోవడంతో పోలీస్‌ శాఖ అవినీతి, అక్రమాల మచ్చలతో అపకీర్తి మూట కట్టుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ప్రజలకు మేలైన సేవలందించాలనే ప్రభుత్వ లక్ష్యం అవినీతి పోలీస్‌ అధికారుల తీరుతో నీరుగారుతున్నది. సర్కారు లక్ష్యం అడుగడుగునా దెబ్బతింటున్నది. 

కామారెడ్డి పట్టణ సీఐగా మధుసూదన్‌  

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి పట్టణ సీఐగా మధుసూదన్‌  సోమవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్‌లో ఎస్బీ   పనిచేసిన మధుసూదన్‌ కామారెడ్డి సీఐగా బదిలీపై వచ్చారు. గతంలో పనిచేసిన సీఐ జగదీశ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఏసీబీ  అధికారులు అరెస్టు చేయడంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. logo