మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Dec 06, 2020 , 01:14:54

అందుబాటులోకి మరికొన్ని రైళ్లు

అందుబాటులోకి మరికొన్ని రైళ్లు

  • రాకపోకల వేళలు యథాతథం

నిజామాబాద్‌ సిటీ: లాక్‌డౌన్‌ సమయంలో రైళ్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల తర్వాత కొన్ని రైళ్లను నడిపేందుకు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరిగి రైల్వేశాఖ ప్రారంభించింది. రైళ్ల రాకపోకల సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న సమయానుసారం ఈ రైళ్లను నడుపనున్నారు. లౌక్‌డౌన్‌ తర్వాత రెండు నెలల క్రితం జిల్లా నుంచి నిజామాబాద్‌  తిరుపతి రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాత్రమే ప్రారంభించారు. తాజాగా ఈ నెల నుంచి ఏడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. అజంతా, దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రోజువారి ఉండగా, మిగతా ఐదు ప్రత్యేక రైళ్లు వివిధ వారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. 

ప్రారంభించిన రైళ్ల వివరాలు ఇలా..

అజంతా ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌- మన్మాడ్‌) సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌కు రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు ఉదయం 5.28 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటుంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-ముంబాయి) సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి నిజామబాద్‌కు సాయంత్రం 3.58 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు నిజామాబాద్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటుంది. అమరావతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (తిరుపతి-అమరావతి) తిరుపతి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌కు ఉదయం 6.45లకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌కు మధ్నాహ్నం 2.23 గంటలకు చేరుకుంటుంది. నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నర్సాపూర్‌-నాగర్‌సోల్‌) వారానికి ఐదు రోజులు (సోమ, మంగళ, బుధ, గురు, శని) మాత్రమే ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 7.45కు బయలుదేరి నిజామాబాద్‌కు 10.38 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు నిజామాబాద్‌కు రాత్రి 8 గంటలకు వస్తుంది. జైపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (హైదరాబాద్‌-జైపూర్‌) వారానికి రెండ్రోజులు (సోమ, బుధవారం) అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి నిజామాబాద్‌కు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌కు రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది.

కొత్తగా ఏడు రైళ్లు.. 

జిల్లాలోని ప్రయాణికులకు మరో ఏడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్‌ మీదుగా రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో మాదిరిగానే రిజర్వేషన్‌, నాన్‌ రిజర్వేషన్‌ బోగీలు అందుబాటులో ఉన్నాయి. 

- రవి, నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్‌.