శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Dec 04, 2020 , 00:33:54

దివ్యాంగులను అన్ని రకాలుగా ఆదుకుంటాం

దివ్యాంగులను అన్ని రకాలుగా ఆదుకుంటాం

  • దివ్యాంగుల దినోత్సవంలో జిల్లా జడ్జి సాయి రమాదేవి

నిజామాబాద్‌ లీగల్‌: దివ్యాంగుల హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడడానికి రూపొందించిన చట్టం వారి దరిచేరడానికి సమాజం సమష్టిగా బాధ్యత తీసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ కె.సాయిరమాదేవి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వ శాఖలతో పాటు న్యాయసేవా సంస్థ తమ బాధ్యతలను నిర్వహిస్తాయని వాటికి తోడుగా రోటరీ క్లబ్‌ తదితర స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు కీలకమని అన్నారు. వారికి తోడు, నీడ, ఆలంబనగా ప్రభుత్వ, న్యాయ, స్వచ్ఛంద సంస్థలు నిలుస్తాయని చెప్పారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ పుట్టుకతో కానీ ప్రమాదవశాత్తుకానీ శారీరక వైకల్యం కలిగినవారు, కృత్రిమ అవయవాలను అమర్చుకొని తమ జీవితంలో వె లుగులు నింపుకోవాలని సూచించారు. దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని, ప్రభు త్వ సహకారాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో జీవితంవైపు పరుగులు తీయాలని పేర్కొన్నారు. అనంతరం రోటరీ క్లోబ్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి గౌతం ప్రసాద్‌, నర్సింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌మహి, రోటరీక్లబ్‌ సభ్యులు డాక్టర్‌ కౌలయ్య, దర్శన్‌సింగ్‌ సోకి, జగదీశ్వర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 

చిన్నచూపు వద్దు.. 

నిజామాబాద్‌ సిటీ: దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దని నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోగలరని, వారిలో ఎంతో మంది ప్రస్తుతం ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం 75 మంది దివ్యాంగులకు టీసీఎల్‌(ట్రైనింగ్‌ లర్నింగ్‌ మెటల్‌)ను అందజేశారు. కార్యక్రమంలో జాతీయ మానసిక వికలాంగుల సాధికారిక సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ పద్మావతి, సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు 


logo