శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Dec 03, 2020 , 00:39:46

‘సీజనల్‌' ముప్పు.. జర భద్రం

‘సీజనల్‌' ముప్పు.. జర భద్రం

  • వాతావరణ మార్పులతో విషజ్వరాలు 
  • చలి గాలులతో చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు 
  •  శీతాకాలంలో కరోనా వైరస్‌ విజృంభించే ప్రమాదం  
  • జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన 

ఖలీల్‌వాడి: ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తుండగా.. సీజనల్‌ వ్యాధులు కూడా ప్రభలుతున్నాయి. ప్రతి ఏటా చలికాలంలో వృద్ధులు, చిన్నారులకు వ్యా ధులు సోకడం పరిపాటిగా మారింది. దీంతో పాటు కరోనా వైరస్‌ కూడా విజృంభిస్తుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఆ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడంతో చలి వణికిస్తున్నది. ఎండ సరిగా లేకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధులు సోకుతున్నాయి. చలి కరోనాకు అనుకూలంగా ఉంటుందని, వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు అంటున్నారు. జిల్లా యంత్రాంగం కొన్ని రోజులుగా గ్రామాల్లో డెంగీ, లార్వా సర్వేను నిర్వహిస్తోన్నది. పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీటిని వెంటనే శుభ్రం చేసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు గ్రామాల్లోని ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద చికిత్సలు చేయించుకుంటున్నారు. 

చల్లని వాతావరణంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ.. 

సీజన్‌ మారుతున్నప్పుడు వాతావరణంలో మార్పులు సహజం. దీంతో రకరకాల ఇన్‌ఫెక్షన్లు సులభంగా మానవ శరీరంపై దాడి చేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలంలో వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ఉధృతి ఉంటుంది. ఈ సీజన్‌లో ప్రతి పది మందిలో ఒకరు జలుబు, జ్వరంతో బాధపడుతారు. కరోనా వైరస్‌కు కూడా ఇలాంటి లక్షణాలే ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ నివారించేందుకు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకితే వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించాలని, నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారు ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేడి నీళ్లను తాగాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలని పేర్కొంటున్నారు. కప్పులు, స్పూన్లు, ప్లేట్లను షేర్‌ చేసుకోవద్దని సూచిస్తున్నారు. 


పిల్లల విషయంలో అజాగ్రత్త వద్దు.. 

వాతావరణంలో మార్పు తో చలి జ్వరం వస్తుంది. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. దగ్గర్లోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో ఉండే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలి. 

- సుదర్శనం, డీఎంహెచ్‌వో, నిజామాబాద్‌.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి.. 

కరోనాతో పాటు సీజనల్‌ వ్యాధుల ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క రూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్‌ వ్యాధులపై  అవగాహన పెంచుకోవాలి. కరోనా వైరస్‌ నివారణకు భౌతికదూరం పాటించడంతో పాటు మాస్కులను తప్పకుండా ధరించాలి. 

- డాక్టర్‌ జలగం తిరుపతిరావు,

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌.

వేడి పదార్థాలు తీసుకోవాలి.. 

చిన్న పిల్లలకు చల్లని వస్తువులను ఆహారంగా ఇవ్వకూడదు. వేడి పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. ఈ సీజన్‌లో పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పిల్లలు జంక్‌ఫుడ్‌ను తీసుకోకుండా చూడాలి. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడంతో పాటు వేడి నీళ్లను తాగడం చాలా మంచిది. 

- డాక్టర్‌ హరికృష్ణ, పిల్లల వైద్య నిపుణులు.